సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. భారతీయ వాయు దళాన్ని (ఐఏఎఫ్) ఆయన అమ్మేశారని, తన స్నేహితుడు, వ్యాపారవేత్త అనిల్ అంబానీకి రూ. 30 కోట్లను చౌర్యం చేసి కట్టబెట్టడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని ఆరోపించారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువక్రాంతి మేళా యాత్ర పేరిట తల్కతోర స్టేడియంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ప్రభుత్వంలోనే అసమ్మతి ఉందని, దీంతో ప్రధాని మోదీకి నిద్ర పట్టడం లేదని ఆరోపించారు. తాను ప్రధాని మోదీని మూడు, నాలుగు ప్రశ్నలు అడిగానని, ఆయన అటు, ఇటు, క్రింద, పైన చూశారని, అయితే తనవైపు, తన కళ్లలోకి కళ్లు పెట్టి మాత్రం చూడలేకపోయారని అన్నారు.
‘‘కాపలాదారు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోయారు’’ అని విమర్శించారు. మోదీ ప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా జరిగిన సంఘటనను రాహుల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై రాహుల్ గాంధీ ప్రసంగించినపుడు చెప్పిన మాటలను ప్రస్తావించారు. దొంగతనం చేసినవాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరన్నారు. దేశాన్ని విభజించడమే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈశాన్యంతోపాటు కశ్మీర్‌ను రావణకాష్టం చేసేశారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు కనీస ఆదాయ హక్కు కల్పిస్తామంటూ రాహుల్ హామీ ఇచ్చారు. ఆ ఆదాయాన్ని నేరుగా పేదల ఖాతాల్లో వేస్తామని, ఇందులో మధ్యవర్తులెవరూ ఉండబోరని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment