సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ విషయంలో బీజేపీ ఎక్కడా వెనకడుగు వెయ్యదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం గత యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో పోలిస్తే దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన ఒప్పందాన్ని ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్నామని రాజ్‌నాథ్ తెలిపారు. కానీ కొంత మంది నాయకులు పడుకున్నా, నిల్చున్నా రఫేల్ డీల్ అని కలవరిస్తున్నారని, అందులో రా.. ఫెయిల్... రాహుల్ (గాంధీ) ఫెయిల్ అయ్యారని ఎద్దేవా చేశారు.
2019 ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ‘విజయ్‌లక్ష్య 2019 యువ మహాధివేశన్’పేరుతో యువ సమ్మేళనాన్ని నిర్వహించింది. బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనానికి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ రాఫెల్ ఒప్పందంపై ప్రతిపక్షాలు ఒకే అబద్ధాన్ని వందసార్లు ప్రచారం ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయని మండిపడ్డారు.
దేశంలో విశ్వసనీయతగల ఏకైక పార్టీ బీజేపీయేనన్నారు. సామాజిక, రాజకీయ కార్యకర్తలుగా సమాజ సేవ చేసేది కేవలం బీజేపీ మాత్రమేనన్నారు. స్వచ్ఛ భారత్, బేటీ బచావో, బేటీ పడావో లాంటి పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. సంకుచిత మనసుతో గొప్ప ఆలోచనలు రావన్న అటల్ బిహారీ వాజ్‌పేయి మాటలు ఎప్పుడూ బీజేపీకి ఆచరణీయమన్నారు.
యువతతోనే మార్పు సాధ్యం...
యువత ఎప్పుడూ యాచకులు కావద్దని, ఎదుటివారికి పెట్టే స్థాయికే ఎదగాలన్నదే బీజేపీ లక్ష్యమని రాజ్‌నాథ్ చెప్పారు. దేశంలో యువతను సరైన దిశలో తీసుకువెళ్లే నాయకత్వ లక్షణాలు పూనం మహజన్‌లో ఉన్నాయన్నారు. తన తండ్రి ప్రమోద్ మహాజన్ లాంటి గొప్ప నాయకుడి నుంచి ఆమె నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చు కుందన్నారు. దేశంలో ఏ మార్పు రావాలన్నా అది యువత వల్లనే సాధ్యం అవుతుందని, యువశక్తి ఎక్కువగా ఉన్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని రాజ్‌నాథ్ తెలిపారు.
విపక్షాలకు దేశాభివృద్ధి పట్టదు...
నేషన్ ఫస్ట్, పార్టీ నెక్ట్స్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో అన్ని వర్గాలకు సమన్యాయం అందించేందుకు బీజేపీ కృషి చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం రాజకీయాలే ప్రధానం అన్నట్లుగా వ్యవహరిస్తోందని రాజ్‌నాథ్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, అన్ని పక్షాలు ఒక్కటైనా ప్రధాని మోదీని, బీజేపీని ఏమీ చేయలేరని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో జట్టుకట్టే పార్టీలు తరువాత ‘మీటూ’ఉద్యమం చేయాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. మోదీ నేతృత్వంలో భారత్ విశ్వగురువుగా అవతరించాలంటే 2019 ఎన్నికల్లో బీజేపీ 350 సీట్లు గెలవాలని, ఈ లక్ష్యం సాధించే వరకు కార్యకర్తలు అహర్నిశలు పనిచేయాలని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు.
వందల ఎకరాలు ఉన్న వారికే
రైతు బంధుతో లబ్ధి: త్రిపుర సీఎం
తెలంగాణలో వందల ఎకరాలు ఉన్న వారే రైతు బంధు పథకం ద్వారా ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ విమర్శించారు. ఈ పథకం వల్ల చిన్న రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదన్నారు. ఒక ఎకరం భూమి ఉన్న వారికి రూ. 8 వేలే ఇస్తూ వందల ఎకరాలు ఉన్న వారికి ఎకరానికి రూ. 8 వేల చొప్పున ఇస్తున్నారన్నారు. అందులో పంట పండిస్తున్నారా లేదా అనేది చూడకుండానే ఇస్తున్నారన్నారు. దీంతో ఎక్కువ భూమి ఉన్న వారికే అధిక ప్రయోజనం చేకూరుతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కేంద్రం దేశంలో అందరికీ రూ. 5 లక్షల చొప్పున వైద్య సదుపాయం, ఆరోగ్య బీమా కల్పిస్తోందన్నారు. బీజేపీకి 1.25 శాతం ఓటింగ్ ఉన్న త్రిపురలో పార్టీ అధ్యక్షునిగా ఉన్న తనను అమిత్ షా వ్యూహాలతో సీఎంను చేశారన్నారు. ఆయన వ్యూహాల వల్లే త్రిపురలో 25 ఏళ్ల వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దించగలిగామన్నారు.
రాజకీయం అంటే వెన్నుపోట్లు కాదు..
రాజకీయాలు అంటే మోసం, నమ్మకద్రోహం, వెన్నుపోట్లు కాదని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. రాజనీతి అంటే ఇప్పుడున్న అర్థం మార్చి దాని గొప్పదనం పెంచాలన్నారు. సన్మార్గంవైపు నడిపించేదే రాజకీయమని, అందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ మాత్రం స్వార్థ రాజకీయాలు చేస్తోందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలన్న గాంధీజీ మాటలను ఆ పార్టీ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాంలో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ గెలిచినప్పుడు ఆమెను వాజ్‌పేయి పొగిడారని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. దేశం కోసం ఆలోచించినప్పుడే ఇందిర గెలిచారని, కానీ ఆ తరువాత సంతుష్టీకరణ రాజకీయాలు పెరగడంతో ఆమె ఓడి పోయారన్నారు.
2019 ఎన్నికల్లో 350 సీట్లే మన సంకల్పం: పూనం మహాజన్
వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 350 సీట్లు సాధించి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు యువమోర్చా కృషి చేయాలని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా మరోసారి మోదీ విజయం కోసం దీక్షబూనాలన్నారు. బీజేపీ గెలుపు కోసం ప్రతి పోలింగ్ బూత్‌లో కమలం యూత్ ఉండాలన్నారు. భారత్‌ను, మోదీని విశ్వగురువును చేసేందుకు, మరో 15 ఏళ్లు బీజేపీని అధికారంలో ఉంచేందుకు యువ మోర్చా పని చేయాలని పూనం కోరారు. దేశంలో పేదల కోసం పని చేసేది బీజేపీ మాత్రమేనని, దేశ వ్యతిరేక శక్తులను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేవైఎం తెలంగాణ, ఏపీ అ«ధ్యక్షులు భరత్‌గౌడ్, రమేష్ నాయుడు, ఇతర రాష్ట్రాల బీజేవైఎం అధ్యక్షులు ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment