‘రాహుల్‌ గాంధీపై పాక్‌ ప్రేమ ఆందోళన కలిగించిం‍ది’ | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీపై పాక్‌ ప్రేమ ఆందోళన కలిగించిం‍ది: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

Published Sun, May 5 2024 3:13 PM

Rajnath Singh on Pakistan deep love for Rahul Gandhi Grave concern

ఢిల్లీ:  పాకిస్తాన్‌ మాజీ మంత్రి  ఫవాద్ హుస్సేన్  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ప్రశంసలు కురిపించటంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర ఆందోళన చెందినట్లు తెలిపారు. ఆయన శనివారం పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.  

‘‘ఇండియా కూటమిపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. ప్రతిపక్షాల కూటమి అసత్య ప్రచారం చేసి, ఓటర్లను గందరగోళానికి గురిచేస్తోంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని మారుస్తామని దుష్ప్రచారం చేస్తోంది.  కానీ, కాంగ్రెస్‌ పార్టీనే రాజ్యాంగాన్ని 85 సార్లు సవరించింది. రాజ్యాంగంలో పీఠికలో సైతం మార్పులు చేసింది. అలాంటిది ప్రస్తుతం బీజేపీని నిందిస్తోంది. బీజేపీ అధికారంలోకి  వస్తే.. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చబోదు’’అని  రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

‘‘పాకిస్తాన్‌ రాహుల్‌ గాంధీపై అంత ప్రేమ చూపించటం వెనుక భారత్‌ను అస్థిర పరచాలనే కుట్ర ఉంది. అసలు పాక్‌ మాజీ మంత్రి రాహుల్ గాంధీపై చూపిన ప్రేమ చాలా ఆందోళన కలిగించింది. దానికి గల బలమైన కారణాన్ని భారత్‌ తెలుసుకోవాలనుకుంటుంది. సంపద పంపిణీతో వెనుజులా దేశం వలే ఆర్థిక వ్యవస్థ నాశనం చేయాలనుకుంటోంది. 

...ద్రవ్యోల్బణం పెంచాలని చూస్తోంది.  పాకిస్తాన్‌ భారత్‌లోని ఎన్నికలను ప్రభావితం చేయాలని ప్రయత్నం చేస్తోంది’’అని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. భారత్ ఎన్నికల్లో పాకిస్తాన్ ప్రభావం చూపనుందా? అని అడిన ప్రశ్నకు బదులిస్తూ..  ఆ దేశానికి అంత సామర్థ్యం లేదని కొట్టిపారేశారు.  

ఇక.. ఇటీవల పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సంబంధించిన ఓ  వీడియోను ‘ఎక్స్‌’పోస్ట్‌ చేసి.. ‘రాహుల్‌ ఆన్‌ ఫైర్‌’అని క్యాప్షన్‌పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నాయకులు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు  గుప్పించారు.

Advertisement
Advertisement