కన్నా లక్ష్మీనారాయణ (ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రధాని నరేంద్ర మోదీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో స్నేహం చేయడం వలన మోదీపై గాలి విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. 2007లో యూపీఏ హయాంలోనే రాఫెల్ యుద్ద విమానాల కోసం టెండర్లు పిలిచారని గుర్తుచేశారు. విమానాల కొనుగోలుకు మోదీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. లోకల్ అసిస్టెన్సీ కోసమే రిలయన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక జరగిన కుంభకోణాన్ని జరిగినట్లు చిత్రీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ధర విషయంలో అనుమానాలుంటే కాగ్‌తో విచారణ జరిపించుకోవాలని ఆరుణ్ జైట్లీ విసిరిన సవాల్‌ను స్వీకరించాలన్నారు.
ఒక ఏజెన్సీ పిలిస్తే చంద్రబాబు అమెరికా పర్యటన వెళ్లారని.. అంతేకానీ ఐక్యరాజ్యసమితి సమావేశానికి వెళుతున్నట్లు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు మళ్లీ వ్యవస్యాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నదుల్లో చెరువుల్లో మట్టిని, ఇసుకను తవ్విన చంద్రబాబు పర్యావరణ గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అరకు ఎమ్మెల్యే కిదారి సర్వేశ్వరావు, సోమను మావోయిస్టులు చంపాడాన్ని బీజీపీ తరుపున ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పోలీసు, ఇంటెలిజెన్సు వ్యవస్థ విఫలమైందన్నారు. తెలంగాణలో ఎన్నికల సర్వేల కోసం, సొంత ప్రయోజనాల కోసం టీడీపీ వాడుకోంటోందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment