
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హనుమంతరావు(ఫైల్)
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అబద్దాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హనుమంతరావు విమర్శించారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించామన్నారు. నివాసాన్ని ముట్టడి చేసే ప్రయత్నంలో పోలీసులు తమని అడ్డుకున్నారని తెలిపారు. రాఫెల్ డీల్‌ను దేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. మోదీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటివరకు నెరవేర్చలేదని మండిపడ్డారు.
రక్షణ శాఖ మంత్రికి తెలియకుండానే రాఫెల్ డీల్ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రాఫెల్ డీల్‌లో జరిగిన అవినీతి గురించి కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామానికి.. ప్రజల్లోకి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. రాఫెల్ డీల్‌పై తమ అధ్యక్షుడు రాహూల్ గాంధీ పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట నిలదీశారని అన్నారు. అనిల్ అంబానికి ఎలాంటి అనుభవం ఉందని ఈ డీల్ ఇచ్చారని ప్రశ్నించారు. అనిల్ అంబాని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కంపెనీ పెట్టినట్లు తెలుస్తోందన్నారు.