సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంలో మోదీ సర్కార్‌కు భారీ ఊరట లభించింది. ఈ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ విచారణ కోసం దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సర్వోన్నత న్యాయస్ధానం కొట్టివేసింది. రాఫెల్ ఒప్పందంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రాఫెల్ డీల్‌కు వ్యతిరేకంగా దాఖలైన 36 పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ విమానాల ధరలను దేశభద్రత దృష్ట్యా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
విమానాల ధరల విషయం కొనుగోలు కమిటీ చూసుకుంటుందని పేర్కొంది. ఒప్పందంలో అనుమానించాల్సిన అంశాలేమీలేవని జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. దేశ రక్షణను దృష్టిలో ఉంచుకుని ఒప్పందంపై చర్చ అనవసరమని పేర్కొంది. రాఫెల్ ఒప్పందం ప్రకటించినప్పుడు అభ్యంతరాలు ఎందుకు రాలేదని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది.
రాఫెల్ ప్రకంపనలు
రాఫెల్ ఒప్పందంలో మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శల దాడి ఎక్కుపెట్టిన కాంగ్రెస్‌కు సుప్రీం కోర్టు తీర్పుతో నిరాశ ఎదురైంది. రూ 56వేల కోట్లతో 36 విమానాల కొనుగోలుకు సంబంధించి భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఆఫ్‌సెట్ పార్టనర్‌గా భారత్ సూచనతోనే దసాల్ట్ ఏవియేషన్ ఎంపిక చేసుకుందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ వెల్లడించడం కలకలం రేపింది. ఈ ఒప్పందంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుబట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment