రాజధాని భూ గద్దలపై ఐటీ వేట!
- పెద్ద మొత్తంలో భూముల కొనుగోలుదారులపై కన్ను
- రిజిస్ట్రేషన్ శాఖ నుంచి పది మంది పేర్లు సేకరణ
- బినామీలు, కుటుంబ సభ్యులకు వచ్చిన డబ్బులపై దృష్టి
- ఏ ఖాతాల నుంచి చెల్లింపులు చేశారో ఆరా
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన వారిని వేటాడేందుకు ఐటీ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. రాజధానిని ఏ ప్రాంతంలో నెలకొల్పాలో ముందుగానే ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా భూములను కొనుగోలు చేసుకున్న విషయం తెలిసిందే . అలా కొనుగోలు చేసిన వారిలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కొంత మంది ఐఏఎస్ అధికారులు, ఆర్డీవోలతో పాటు ‘ముఖ్య’ నేత బినామీలు కూడా ఉన్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంటోంది. వందల ఎకరాల భూములను కొనుగోలు చేసిన వారిలో మొదటగా పది మందికి సంబంధించిన లావాదేవీల వివరాలను ఐటీ శాఖ ఇటీవలే రిజిస్ట్రేషన్ శాఖ నుంచి తీసుకున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.
భూములు పెద్దల పేరుమీద లేకుండా వారికి చెందిన కుటుంబ సభ్యులు, బినామీల పేరు మీద ఉన్నప్పటికీ ఆ భూముల కొనుగోలుకు అవసరమైన డబ్బులు ఎవరి ఖాతాల నుంచి వచ్చాయనే దానిపైనే ఐటీ శాఖ దృష్టి సారించనుందని పేర్కొన్నాయి. తద్వారా బినామీల వెనకున్న పెద్దల పాత్ర బయటపడుతుందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలు వ్యవహారాలపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే విషయం తెలిసిందే. రాజధానిలో ముందుగానే భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన తరువాత రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారనే విమర్శలున్న విషయం తెలిసిందే.
దర్యాప్తు తూతూ మంత్రమేనా..!
అమరావతి ప్రాంతంలో రెండేళ్లలో జరిగిన భూ కొనుగోలు లావాదేవీలపై ఐటీశాఖ పూర్తిస్థాయిలో, నిజాయితీగా దృష్టి సారిస్తే చాలామంది పెద్ద చేపలు చిక్కుకుంటాయని, కీలక నేతల పదవులకే ఎసరు వస్తుందని ఐటీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందువల్ల పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగకుండా తూతూమంత్రంగా ముగింపజేసేందుకే కేవలం పది మంది డేటా సేకరించారని అంటున్నారు. ‘భూముల ధరలు అమరావతి ప్రాంతంలో అమాంతం పెరిగాయని, ఉన్నతస్థాయి నేతలు, ఉన్నతాధికారులు బినామీ పేర్లతో భారీగా భూములు కొనుగోలు చేశారని అందరికీ తెలుసు. ఇలాంటి లావాదేవీలపై ఐటీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకపోవడం వెనుక చాలా మతలబు ఉంది’ అని ఒక ఐటీ శాఖ అధికారి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.