
ఎల్‌బీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు దారుల పడిగాపులు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకునేవారికి తిప్పలు తప్పడం లేదు. రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో దస్తావేజుల నమోదు నత్త నడక సాగుతున్నాయి. మహా నగరం నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా మెరుగైన సాంకేతిక సేవల కల్పనలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. నిరంతరం సర్వర్ డౌన్, నెట్‌వర్క్ మోరాయింపు వంటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.
ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖకు టీసీఎస్ నెట్‌వర్క్‌తో గల కాంట్రాక్ట్ గడువు ముగియడంతో సమస్య మరింత జఠిలమైంది. తాత్కాలికంగా మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. కేవలం పదంటే పది నిమిషాల్లో పూర్తి కావాల్సిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సర్వర్ డౌన్, నెట్‌వర్క్ సమస్యల కార ణంగా గంటల కొద్దీ వేచిచూడాల్సి వస్తోంది. సాధారణంగా నగరంలోని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోlరోజుకు 100 నుంచి 150 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 10 నిమిషాల్లో పూర్తి కావాల్సి ఉండగా, సర్వర్ సమస్యతో 40 నుంచి 60 నిమిషాల సమయం తీసుకుంటోంది.
అన్నింట్లో ఇదే దుస్థితి
హైదరాబాద్–రంగారెడ్డి జిల్లాలోని నాలుగు డీఆర్ (డిస్ట్రిక్ రిజిస్ట్రార్ ఆఫీస్) పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెల రోజుల నుంచి సర్వర్ సమస్య సర్వసాధారణమైంది. రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రత్యేక సర్వర్ లేకుండా పోయింది. ఇప్పటి వరకు ఉమ్మడిగానే సర్వర్, ఇంటర్నెట్ కోసం స్టేట్‌వైడ్ ఏరియా నెట్‌వర్క్ (స్వాన్)ను వినియోగిస్తున్నారు. ఇదే సర్వర్‌ను, ఇంటర్నెట్ సదుపాయాలను రెండు రాష్ట్రాలకు చెందిన మున్సిపల్, రెవెన్యూ, ట్రెజరీ.. తదితర ప్రభు త్వ శాఖలన్నీ వినియోగించుకుంటున్నాయి.
2 ఎంబీపీఎస్ సామర్థ్యంగల బ్రాండ్ బ్యాండ్ నెట్‌వర్క్ రిజిస్ట్రేషన్ ్ల శాఖ అవసరాలను తీర్చలేకపోతోంది. ఏదైనా సాఫ్ట్‌వేర్ చేర్చాల్సి వచ్చినప్పుడు సర్వర్ మరింత డౌన్ అవుతోంది. 1998 నుంచి కార్డ్ (కంప్యూటరైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) సిస్టమ్ ద్వారానే రిజి స్ట్రేషన్ ప్రక్రియను ఆన్‌లైన్‌లో మాత్రమే చేయా ల్సి ఉంది. దీంతో రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఆస్తి మార్కెట్ విలువను తెలుసుకోవాలన్నా, ప్రభు త్వ భూముల(పీవోబీ) వివరాల్లో తనిఖీ చేయాలన్నా ఇంటర్నెట్ వేగవంతమైన ఇంటర్నెట్ అవసరం.
మరోవైపు ఐదేళ్ల కిందట ఇచ్చిన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు పనిచేయని స్థితికి చేరాయి. దీంతో పనిభారం పెరగడంతో పాటు అధిక సమయం తీసుకుంటోంది. కాలం చెల్లిన యూపీఎస్‌లతో పవర్ బ్యాకప్ సరిపోక రిజిస్ట్రేషన్లు నిలిపివేయాల్సిన సంఘటనలూ తరచూ జరుగుతున్నాయి.