
రిజిస్ట్రేషన్ మరింత భారం
ఆదాయమార్గాల అన్వేషణలో భాగంగా రిజిస్ట్రేషన్ శాఖపై దృష్టి పెట్టిన ప్రభుత్వం...
- రేపటి నుంచి భూముల విలువలు పెంపు
- ప్రాతాన్ని బట్టి 20 నుంచి 30 శాతం వరకూ..
- భవనాలు, నిర్మాణాల దరలకూ వర్తింపు
- 2015-16లో జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యం రూ. 530 కోట్లు
కాకినాడ లీగల్ : ఆదాయమార్గాల అన్వేషణలో భాగంగా రిజిస్ట్రేషన్ శాఖపై దృష్టి పెట్టిన ప్రభుత్వం..భూముల విలువను 20 నుంచి 30శాతం పెంచింది. గతంలో రిజిస్ట్రేషన్ల ఫీజులు పెంచి, భూముల విలువలు పెంచని సర్కారు ఇప్పుడు భూముల విలువను పెంచి రిజిస్ట్రేషన్ల ఫీజు పెంచలేదు. అరుుతే.. ఏ రారుుతో కొట్టినా పళ్లూడతాయన్న చందంగా విలువల పెంపు వల్ల కొనుగోలుదారుడికి రిజిస్ట్రేషన్ ఫీజు పెరిగి అదనపు భారం తప్పడం లేదు.
ఇప్పటి వరకు రూ.10 లక్షలవిలువైన భూమికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.75వేలు అయ్యేది. ఇప్పుడు భూమి విలువ 20శాతం పెరిగితే రిజిస్ట్రేషన్ ఫీజు రూ.90 వేలు అవుతుంది. అంటే కొనుగోలుదారుడికి రూ.15 వేల అదనపుభారం పడే అవకాశం ఉంది. జిల్లాలో 32 సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రభుత్వం 2014-15 రెవెన్యూ లక్ష్యాన్ని రూ.480 కోట్లుగా నిర్ధారించగా, రూ.380కోట్లు ఆదాయాన్ని సమకూర్చి లక్ష్యానికి చేరువగా నిలవడంతో రాష్ట్రంలో ద్వితీయస్థానంలో నిలిచింది. ప్రస్తుతం 2015-16 సంవత్సరానికి రూ.530 కోట్ల రాబడిని లక్ష్యంగా నిర్దేశించారు.
మార్కెట్ విలువలకు చేరువలో ఉండాలని..
2013 తరువాత భూముల మార్కెట్ విలువను సవరించలేదు. దీంతో మార్కెట్లో ధరలకు, రిజిస్ట్రేషన్‌శాఖ దగ్గర ఉన్న పుస్తకాల్లో ధరలకు పొంతనలేకుండా పోయింది. రాష్ట్ర విభజన తరువాత జిల్లాలోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అదే సమయంలో బంగారం విలువ తగ్గడంతో అధికశాతం మంది భూములపై పెట్టుబడి పెట్టడంతో భూముల విలువ విపరీతంగా పెరిగింది. సామాన్యుడికి అందుబాటులోలేని రీతిలో భూముల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో వాస్తవ మార్కెట్ విలువను అధ్యయనం చేసి, ఆ విలువలో 50 నుంచి 60 శాతం వరకు రిజిస్ట్రేషన్‌శాఖ పుస్తకాల్లో ధరగా నిర్ణయించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఉదాహరణకు ఒక ప్రాంతంలో గజం భూమి మార్కెట్‌ధర రూ.10వేలు ఉండగా రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ పుస్తకాల్లో విలువ రూ.5 వేల నుంచి రూ.6వేలుగా ఉండాలని ప్రభుత్వం నిర్ధారించింది. అలా కాక వెయ్యి నుంచి రెండువేలుగా పుస్తకాల్లో ఉంటే ఆ భూమి విలువను 50 నుంచి 60శాతం పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించింది. సాధారణంగా రిజిస్ట్రేషన్‌శాఖ పట్టణ ప్రాంతాల్లో ఏటా, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి భూముల విలువను పెంచుతుంటుంది. ఈ లెక్కన గతేడాది పట్టణ ప్రాంతాల్లో భూముల విలువను పెంచాల్సి ఉంది. నూతనరాష్ట్రం ఏర్పడే క్రమంలో గతేడాది భూముల మార్కెట్ విలువను పెంచలేదు. గతేడాది కాలంలో పట్టణ ప్రాంతాల్లో, వాటి ఆనుకొని ఉన్న గ్రామాల్లో భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది తప్పనిసరిగా భూముల విలువను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
భూముల విలువతో పాటు భవనాలు, కట్టడాల విలువనూ సవరించారు. ఉదాహరణకు ఇప్పటి వరకు చదరపు అడుగు ధర (ఆర్‌సీసీ రూఫ్)కు రూ.700 ఉంటే ఉంది. ఆగస్టు 1 నుంచి ప్రాంతాన్ని బట్టి రూ.100 నుంచి రూ.150 పెరగనుంది. అలాగే సిమెంట్ రేకుతో ఉన్న ఇల్లు, మద్రాస్ టైతో ఉన్న ఇంటికి కూడా చదరపు అడుగుకు గతం కంటే ధర పెరిగింది.
కిటకిటలాడుతున్న రిజిస్ట్రార్ కార్యాలయాలు
ఆగస్టు 1 నుంచి భూముల విలువలు పెరగనుండడంతో కొనుగోలుదారులు అధిక సంఖ్యలో భూములు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. అదే సమయంలో బంగారం విలువ తగ్గిపోతుండడంతో పెట్టుబడులు పెట్టేవారు అధికశాతం భూములు కొనడంతో జూలై 25 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.