మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పురపాలక సంఘానికి రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సుమారు రూ.3.20 కోట్లపైగా స్టాంపు డ్యూటీ రావాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో గత పది నెలలుగా బకాయిలు పెండింగ్ పడ్డాయి. ప్రతీ నెల మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చే ఆదాయం మొత్తంపై 1.50 శాతం స్టాంపు డ్యూటీని మున్సిపల్‌శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. 2014 జనవరి నుంచి మున్సిపాలిటీకి రావాల్సిన స్టాంపు డ్యూటీ మున్సిపల్ ఖాతాలో జమకావడం లేదు.
అధికారుల నిర్లక్ష్యంతోపాటు సిబ్బంది కొరత వల్ల జమ నిలిచిపోయింది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్లు, వాటిపై వచ్చిన ఆదాయం వివరాలు ఏ నెలకు ఆ నెలా జిల్లా రిజిస్ట్రార్‌కు పంపించాలి. ఆ వివరాల ప్రకారం 1.50 శాతం స్టాంపు డ్యూటీని మున్సిపల్ పద్దులో జమ చేస్తారు. ఈ మొత్తాన్ని మున్సిపాలిటీ వివిధ పనుల కోసం వినియోగిస్తుంది. జనవరి నుంచి అక్టోబర్ వరకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ ఇంత వరకు రాలేదు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి నెలనెలా వివరాలు పంపించకపోవడంతోనే ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. పన్నుల వసూలు సమయం కాకపోవడంతో ప్రస్తుతం మున్సిపాలిటీలో సాధారణ నిధులు (జనరల్ ఫండ్) తక్కువగా ఉన్నాయి.
స్టాంప్‌డ్యూటీ రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తడంతో మున్సిపల్ అధికారులు సబ్ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. గత సబ్ రిజిస్ట్రార్ పలు ఆరోపణలతో సస్పెండ్ కాగా ప్రస్తుతం కొత్తగా వచ్చిన అధికారికి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, త్వరలోనే స్టాంపు డ్యూటీ చెల్లించేలా చర్యలు తీసుకుంటానని చెబుతున్నారు. స్టాంపు డ్యూటీ వస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందని, ఈ మేరకు ఎప్పటికప్పుడు సబ్ రిజిస్ట్రేషన్ అధికారులను సంప్రదిస్తున్నామని కమిషనర్ వెంకన్న తెలిపారు.
స్టాంపుడ్యూటీ బకాయిలు రూ.3.20కోట్లు
Published Thu, Nov 27 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM
Advertisement
Advertisement