Pending dues
-
అదనపు వనరులపై దృష్టిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంతోపాటు అదనపు వనరుల సమీకరణపై దృష్టిపెట్టాలని వివిధ శాఖల అధికారులను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి రావాల్సిన పెండింగ్ బకాయిలను వసూలు చేయాలని సూచించారు. బుధవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలసి పరిశ్రమలు, గనులు, భూగర్భ వనరులు, హౌజింగ్ కార్పొరేషన్, బోర్డు, హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ఉన్నతాధికారులతో భట్టి సమీక్షించారు. పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏల పరిధిలో ఇప్పటివరకు జరిగిన భూముల అమ్మకాలు, వాటితో రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం, రావాల్సిన బకాయిలు, వాటి వసూలు కోసం కార్యాచరణపై చర్చించారు. ప్రతి పైసా రాబట్టండి ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసానూ సమీకరించే బాధ్యతను ఆయా శాఖల అధికారులు తీసుకోవా లని భట్టి స్పష్టం చేశారు. ఇండ్రస్టియల్ పార్కులను వినియోగంలోకి తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టాలన్నారు. తూప్రాన్ ఇండ్రస్టియల్ పార్కు కోసం ప్రభుత్వం 325 ఎకరాలు కేటాయించగా.. ఇప్పటివరకు 139 ఎకరాలు అప్పగించారని, మిగతా భూమిని సేకరించాల్సి ఉందని అధికారులు వివరించారు. హౌజింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో చేపట్టిన 12 జాయింట్ వెంచర్లలో 6 పూర్తయ్యాయని.. వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.955 కోట్లు రావాల్సి ఉండగా, రూ.430 కోట్లు వచ్చాయని వివరించారు. మైనింగ్ రాయల్టీ ద్వారా రావాల్సిన ఆదాయం, దానిని పెంచుకోవడానికి ఉన్న అవకాశాలపై కూడా గనుల శాఖ అధికారులను మంత్రి ఆరా తీశారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో గనులు భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ హరిత, పరిశ్రమల శాఖ డైరెక్టర్ రెహమాన్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విజయేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వొడాఫోన్-ఐడియా కీలక ప్రకటన, ప్రభుత్వం చేతికి..
దేశంలో మూడో అతి పెద్ద ఫోన్ ఆపరేటర్‌గా ఉన్న వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. కంపెనీలోని మేజర్ వాటాను ప్రభుత్వానికి అప్పగించినట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. కంపెనీ బకాయిలను ఈక్విటీగా మార్చిన తర్వాత వొడాఫోన్ ఐడియాలో 35.8 శాతం వాటా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. ఈ పరిణామం వ్యవస్థాపకులతో సహా కంపెనీ ప్రస్తుత షేర్‌హోల్డర్లందరికీ దెబ్బేసేదే!. అయితే కస్టమర్లను భారీగా కోల్పోతున్న తరుణం, పెద్ద లాభదాయక పరిస్థితులు కనిపించకపోతుండడంతో ఈ చర్య తప్పడం లేదంటూ కంపెనీ సమర్థించుకుంటోంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ పూర్తి వివరాల్ని తెలిపింది కంపెనీ. ఈ మేరకు సోమవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ వాటాకు అంగీకారం తెలిపింది. యూకేకు చెందిన వొడాఫోన్ గ్రూప్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ 28.5 శాతం కలిగి ఉండగా, కుమార్ మంగళం బిర్లా ఆధ్వర్యంలోని ఆదిత్యా బిర్లా గ్రూప్ 17.8 శాతం వాటాను కలిగి ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం 36 శాతం దాకా వాటాతో నిర్ణయాలలో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ కీలక పరిణామం తర్వాత మంగళవారం నాటి స్టాక్ సూచీల్లో వొడాఫోన్ ఐడియా షేర్లు 19 శాతం పడిపోవడం గమనార్హం. చదవండి: బీఎస్ఎన్ఎల్ క్రేజీ ఆఫర్, ఉచితంగా 5జీబీ డేటా! -
ఫీజు కోసం దారుణం: ఆస్పత్రి సీజ్
భోపాల్ : బకాయిలు చెల్లించనందుకు తన తండ్రిని మంచానికి కట్టిపడేసారని మహిళ ఆరోపించిన మూడు రోజుల తరువాత, జిల్లా యంత్రాంగం సదరు ఆసుపత్రిని సీజ్ చేసింది. వివరాల ప్రకారం..రాజ్గర్ జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ కడుపునొప్పితో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. మొదట 10,800 రూపాయలు జమ చేయగా, శుక్రవారం ఆస్పత్రి యాజమాన్యం మరో పదివేలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో అంత మొత్తాన్ని ఇవ్వడానికి కుటుంబసభ్యులు నిరాకరించారు. (డయాబెటీస్‌కు కరోనా యమ డేంజర్! ) డిశ్చార్జ్ చెయ్యమని అడగ్గా చికిత్స పొందుతున్న తండ్రిని నిర్ధాక్షిణ్యంగా మంచానికి కట్టివేశారని బాధితుడి కుమార్తె ఆరోపించింది. ఆసుపత్రి యాజమాన్యం ఎంతో అమానుషంగా ప్రవర్తించారు అంటూ పోలీసులకి ఫిర్యాదు చేసింది. హాస్పిటల్‌కి వెళ్లి చూడగా..బాధితుడిని తాళ్లతో మంచానికి కట్టేసి ఉంది. ఇదేంటని ప్రశ్నించగా...ఆయనకు ఫిట్స్ ఉందని అందుకే మంచానికి కట్టేసినట్లు వైద్యులు తెలిపారు. ఇది కూడా చికిత్సలో ఒక భాగం అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. దీంతో హాస్పిటల్ యాజమాన్యంపై ఐపిసి సెక్షన్ 342 కింద కేసు నమోదు చేసినట్లు షాజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ విషయం కాస్తా పై అధికారుల దృష్టికి వెళ్లడంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో హాస్పిటల్ యాజామాన్యం కావాలనే మంచానికి కట్టేసిందని తేలడంతో జిల్లా యంత్రాంగం ఆసుపత్రిని సీజ్ చేసింది. (పాఠశాలలు అప్పటి నుంచే మొదలు! ) -
రైతుల ఖాతాల్లోకి ధాన్యం బిల్లులు
సాక్షి, అమరావతి: పెండింగ్‌లో ఉన్న ధాన్యం బిల్లులను రైతులకు వెంటనే చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు శుక్రవారం నుంచి వారి ఖాతాల్లో ఆ మొత్తాలను జమచేసేందుకు వీలుగా సర్కారు రూ.2వేల కోట్లు విడుదల చేసింది. ధాన్యానికి మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 1,700 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి ధాన్యాన్ని సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటివరకు రూ.8,227 కోట్ల విలువ చేసే 45.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇలా విక్రయించిన రైతులకు ఇప్పటికే ప్రభుత్వం రూ.6,319 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. మిగిలిన రూ.1,908 కోట్లను చెల్లించేందుకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నిజానికి.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థకు చెందిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించింది. దీంతో రైతులకు ఇవ్వాల్సిన రూ.960 కోట్ల బకాయిలను చెల్లించలేదు. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆ బకాయిలను కూడా చెల్లించి రైతులపట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. జిల్లాల వారీగా చెల్లించాల్సిన మొత్తం.. చిత్తూరు జిల్లాలో రూ.4.64 కోట్లు.. వైఎస్సార్ కడపలో రూ.10 లక్షలు..తూర్పు గోదావరిలో రూ.491.32 కోట్లు.. పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 101.54 కోట్లు.. గుంటూరులో రూ.96.66 కోట్లు.. కృష్ణాలో రూ.258.73 కోట్లు.. ప్రకాశంలో రూ.23.87 కోట్లు.. నెల్లూరులో రూ.39.06 కోట్లు.. శ్రీకాకుళంలో రూ.520.09 కోట్లు.. విశాఖపట్నంలో రూ.11.75 కోట్లు.. విజయనగరంలో రూ.360.84 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇక బిల్లుల చెల్లింపులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో మున్ముందు కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆందోళన వద్దు.. రైతులు ఎవ్వరూ ఆందోళన చెందొద్దు. పెండింగ్ బకాయిలను శుక్రవారం నుండి వారి ఖాతాల్లో జమచేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుండి రెండు, మూడవ త్రైమాసికాలకు సంబంధించిన ధాన్యం నిధులు విడుదల కాకపోవడంవల్ల చెల్లింపుల్లో కొంత ఆలస్యమైంది. ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళ్తే మద్దతు ధర లభిస్తుంది. – కోన శశిధర్, పౌర సరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి -
పంపులకు ‘పవర్’ కట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ బకాయిలు చెల్లించడంలో నీటిపారుదల శాఖ చేతులెత్తేస్తుండటంతో విద్యుత్ శాఖ కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటివరకు చార్జీలు చెల్లించాలని నోటీసులు మాత్రమే ఇచ్చిన ట్రాన్స్‌కో ఇప్పుడు ఏకంగా పంపులకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో నిధులు లేక నీటిపారుదల శాఖ దిక్కులు చూస్తోంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాల పరిధిలో ఏకంగా రూ.957 కోట్ల మేర బిల్లులు చెల్లించకపోవడంతో వచ్చే ఖరీఫ్ నుంచి పంపులు నడపడంపై అయోమయం నెలకొంది. ఏడాదిగా దాటవేతే.. రాష్ట్రంలో ప్రస్తుతం అలీసాగర్, గుత్ప, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి వంటి ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నారు. నీటిని తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్ అవసరాలను గుర్తించారు. ప్రస్తుతం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా, వీటికోసం 1,410 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతోంది. 90 రోజులపాటు నడిచే ఈ ఎత్తిపోతల పథకాలకు యూనిట్‌కు 6.40 చొప్పున గణించినా, రూ.1,750 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఇందులో పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి పరిధిలో 450 మెగావాట్లు, భీమాలో 96, నెట్టెంపాడులో 119 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కించారు. ఇందులో ఇప్పటికే కల్వకుర్తి పరిధిలో మూడు స్టేజీల లిఫ్టు పరిధిలో 50 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న 5 పంపులను పాక్షికంగా నడిపి 2018 ఖరీఫ్, రబీలో మొత్తంగా 31 టీఎంసీల నీటిని ఆయకట్టుకు తరలించారు. దీనికోసం 270 మెగావాట్ల మేర విద్యుత్‌ను వినియోగించారు. దీనికి సంబంధించి 2018లోనే రూ.550 కోట్ల మేర విద్యుత్ చార్జీలను ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంది. దీంతో పాటే అంతకుముందు ఏడాది ఉన్న బకాయిలు కలిపి మొత్తంగా రూ.777.45 కోట్లు విద్యుత్ బిల్లు కట్టాల్సి ఉంది. ఏడాదికి పైగా ఈ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో అడపాదడపా నోటీసులు ఇస్తున్న ట్రాన్స్‌కో తొలి దశలో ప్రాజెక్టు క్యాంపు కార్యాలయాలకు కరెంట్ కట్ చేసింది. తదనంతరం తాజాగా జొన్నలబొగడ పంప్‌హౌజ్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. ఇక భీమా పరిధిలో 12 మెగావాట్లు, 4 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లు ఉండగా, ఈ ప్రాజెక్టు పరిధిలో 12.12 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. దీనికి సంబంధించి రూ.74.85 కోట్ల బిల్లులు కట్టలేదు. వీటికి సంబంధించి ట్రాన్స్‌కో ఇదివరకే నోటీసులు పంపింది. ఇక నెట్టెంపాడు పరిధిలో 17 మెగావాట్లున్న 7 మోటార్ల ద్వారా 6.78 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా, ఇక్కడ విద్యుత్ బిల్లులు రూ.104.70 కోట్లు చెల్లించాల్సి ఉన్నా వాటికి మోక్షం లేదు. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలోనే ఏకంగా రూ.957 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడం, వాటి విడుదలలో ఆర్థిక శాఖ చేస్తున్న జాప్యం పథకాలకు గుదిబండగా మారింది. గతంలోనే ఇలాంటి సమస్య వచ్చినప్పడు, విద్యుత్ సరఫరా నిలిపినప్పుడు అప్పటి సాగునీటిశాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా జోక్యం చేసుకొని ట్రాన్స్‌కో అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. మున్ముందు సవాళ్లే... ఇక ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ఈ మూడు ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికింద నిర్ణీత 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అదే జరిగితే కనిష్టంగా వీటి కిందే 600 మెగావాట్ల మేర విద్యుత్ అవసరాలు ఉంటాయి. పాత బకాయిలు చెల్లించకుండా ఈ స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలంటే ట్రాన్స్‌కో ఎలా స్పందిస్తుందన్నది పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జోక్యం అవసరం ఉంటుందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రాజెక్టుల్లో బకాయిలు ఇలా.. ప్రాజెక్టు ఎత్తిపోసిన నీరు (టీఎంసీల్లో) విద్యుత్ బిల్లు బకాయి(రూ. కోట్లలో) కల్వకుర్తి 31 777.45 నెట్టెంపాడు 6.78 104.70 బీమా 12.12 74.85 మొత్తం 49.90 957 -
స్టాంపుడ్యూటీ బకాయిలు రూ.3.20కోట్లు
మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పురపాలక సంఘానికి రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సుమారు రూ.3.20 కోట్లపైగా స్టాంపు డ్యూటీ రావాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో గత పది నెలలుగా బకాయిలు పెండింగ్ పడ్డాయి. ప్రతీ నెల మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చే ఆదాయం మొత్తంపై 1.50 శాతం స్టాంపు డ్యూటీని మున్సిపల్‌శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. 2014 జనవరి నుంచి మున్సిపాలిటీకి రావాల్సిన స్టాంపు డ్యూటీ మున్సిపల్ ఖాతాలో జమకావడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతోపాటు సిబ్బంది కొరత వల్ల జమ నిలిచిపోయింది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్లు, వాటిపై వచ్చిన ఆదాయం వివరాలు ఏ నెలకు ఆ నెలా జిల్లా రిజిస్ట్రార్‌కు పంపించాలి. ఆ వివరాల ప్రకారం 1.50 శాతం స్టాంపు డ్యూటీని మున్సిపల్ పద్దులో జమ చేస్తారు. ఈ మొత్తాన్ని మున్సిపాలిటీ వివిధ పనుల కోసం వినియోగిస్తుంది. జనవరి నుంచి అక్టోబర్ వరకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ ఇంత వరకు రాలేదు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి నెలనెలా వివరాలు పంపించకపోవడంతోనే ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. పన్నుల వసూలు సమయం కాకపోవడంతో ప్రస్తుతం మున్సిపాలిటీలో సాధారణ నిధులు (జనరల్ ఫండ్) తక్కువగా ఉన్నాయి. స్టాంప్‌డ్యూటీ రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తడంతో మున్సిపల్ అధికారులు సబ్ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. గత సబ్ రిజిస్ట్రార్ పలు ఆరోపణలతో సస్పెండ్ కాగా ప్రస్తుతం కొత్తగా వచ్చిన అధికారికి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, త్వరలోనే స్టాంపు డ్యూటీ చెల్లించేలా చర్యలు తీసుకుంటానని చెబుతున్నారు. స్టాంపు డ్యూటీ వస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందని, ఈ మేరకు ఎప్పటికప్పుడు సబ్ రిజిస్ట్రేషన్ అధికారులను సంప్రదిస్తున్నామని కమిషనర్ వెంకన్న తెలిపారు.