సాక్షి, అమరావతి: పెండింగ్‌లో ఉన్న ధాన్యం బిల్లులను రైతులకు వెంటనే చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు శుక్రవారం నుంచి వారి ఖాతాల్లో ఆ మొత్తాలను జమచేసేందుకు వీలుగా సర్కారు రూ.2వేల కోట్లు విడుదల చేసింది. ధాన్యానికి మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో 1,700 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి ధాన్యాన్ని సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటివరకు రూ.8,227 కోట్ల విలువ చేసే 45.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇలా విక్రయించిన రైతులకు ఇప్పటికే ప్రభుత్వం రూ.6,319 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. మిగిలిన రూ.1,908 కోట్లను చెల్లించేందుకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నిజానికి..
- మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థకు చెందిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించింది. దీంతో రైతులకు ఇవ్వాల్సిన రూ.960 కోట్ల బకాయిలను చెల్లించలేదు.
- కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆ బకాయిలను కూడా చెల్లించి రైతులపట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు.
జిల్లాల వారీగా చెల్లించాల్సిన మొత్తం..
- చిత్తూరు జిల్లాలో రూ.4.64 కోట్లు.. వైఎస్సార్ కడపలో రూ.10 లక్షలు..తూర్పు గోదావరిలో రూ.491.32 కోట్లు..
- పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 101.54 కోట్లు.. గుంటూరులో రూ.96.66 కోట్లు.. కృష్ణాలో రూ.258.73 కోట్లు.. ప్రకాశంలో రూ.23.87 కోట్లు.. నెల్లూరులో రూ.39.06 కోట్లు..
- శ్రీకాకుళంలో రూ.520.09 కోట్లు.. విశాఖపట్నంలో రూ.11.75 కోట్లు.. విజయనగరంలో రూ.360.84 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది.
ఇక బిల్లుల చెల్లింపులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో మున్ముందు కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఆందోళన వద్దు..
రైతులు ఎవ్వరూ ఆందోళన చెందొద్దు. పెండింగ్ బకాయిలను శుక్రవారం నుండి వారి ఖాతాల్లో జమచేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుండి రెండు, మూడవ త్రైమాసికాలకు సంబంధించిన ధాన్యం నిధులు విడుదల కాకపోవడంవల్ల చెల్లింపుల్లో కొంత ఆలస్యమైంది. ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళ్తే మద్దతు ధర లభిస్తుంది. – కోన శశిధర్, పౌర సరఫరాల శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment