రూ.10 లక్షల దాటిన లావాదేవీలపై ఆరా
రిజిస్ట్రేషన్, బ్యాంకుల లావాదేవీల పరిశీలన
నెల్లూరు(సెంట్రల్): పెద్ద నోట్ల రద్దు చేసినప్పటి నుంచి మౌనంగా ఉన్న ఐటీ శాఖ అధికారులు కొత్త సంవత్సరంలో దూకుడు పెంచారు. కొత్త నోట్లు ఎక్కువ మొత్తంలో ఎవరి ఖాతాలోకి వెళ్లాయి. ఎవరి ద్వారా చేతులు మారాయి. అనే విషయాలతో పాటు నోట్ల రద్దు నుంచి రిజిస్ట్రేషన్ శాఖలో జరిగిన లావాదేవీలపై కూడా ఐటీ శాఖ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు బ్యాంకు అధికారుల్లో ఆందోళన నెలకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
రూ.10 లక్షలు దాటిన వాటిపై ఆరా..
బ్యాంకులలో జరిగే లావాదేవీలలో రూ.10 లక్షలు దాటిన వాటిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రత్యేకించి రెండేళ్ల నుంచి అకౌంటులో జరిగిన లావాదేవీలు ఎంత?, నోట్ల రద్దు తరువాత జరిగిన లావాదేవీలలో ఏ ఖాతాలో ఎక్కువ జరిగాయి. అనేది ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అనుమానితంగా ఉన్న ఖాతాలలో జరిగిన నగదు లావాదేవీలపై ఆరా తీస్తూ వారికి బ్యాంకు అధికారులకు ఏమిటి సంబంధం అనే వాటిపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పలు బ్యాంకు అధికారులు ఫోన్ కాల్స్ వివరాలు కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. ఖాతాదారుని ఫోన్ నంబరుకు, బ్యాంకు అధికారులతో మాట్లాడిన ఫోన్ నంబరుకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా నోట్ల రద్దు తర్వాత జిల్లాలో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ చాలా వరకు తగ్గుముఖం పట్టింది. అయితే జరిగిన రిజిస్ట్రేషన్‌లో కూడా ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? గతంలో వారు ఏమైనా లావాదేవీలు నడిపారా? నోట్ల రద్దు తర్వాతే రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడులు పెట్టి రిజిస్ట్రేషన్‌లు జరిపారా? అని విషయాలు కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.
వివరాల సేకరణకు ప్రత్యేక బృందాలు
జిల్లాలోని బ్యాంకులలోని వివరాలకు, రిజిస్ట్రేషన్ శాఖలోని వివరాలు సేకరణకు సంబంధించి పూర్తి వివరాలు సేకరణకు నెల్లూరు ఐటీ శాఖకు ఎటువంటి సంబంధం లేకుండా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. మొత్తం ఈ వ్యవహారం హైదరాబాద్‌లోని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివరాల సేకరణలో నిమగ్నం అయినట్లు సమాచారం. మొత్తం ఈ వ్యవహారం ఎటు పోయి ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని పలు బ్యాంకు అధికారులతో పాటు ఎక్కువ మొత్తంలో లావాదేవీలు నడిపిన వారు సైతం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
ఐటీ శాఖ దూకుడు
Published Tue, Jan 3 2017 10:24 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
Advertisement
Advertisement