మాకివ్వండి.. మీరూ తినండి
► సబ్ రిజిస్ట్రార్లకు అధికార పార్టీ నేతల
► బంపర్ ఆఫర్ కాదూ కూడదంటే వేధింపులు
► నెలనెలా ముడుపులివ్వాలని డిమాండ్
అనంతపురం టౌన్ : రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై టీడీపీ నేతల పెత్తనం అధికమవుతోంది. తాము చెప్పినట్లు వింటే సరే. లేదంటే కథ చూస్తామంటూ బెదిరిస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులైతే తమ నియోజకవర్గ పరిధిలో జరిగే పలు కార్యక్రమాలకు కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆయా కార్యాలయాల్లో పనిచేయడానికి అధికారులు హడలిపోతున్నారు.
అనంతపురం రిజిస్ట్రార్ జిల్లా పరిధిలో 12, హిందూపురం రిజిస్ట్రార్ జిల్లా పరిధిలో తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు జులుం ప్రదర్శిస్తున్నారు. మాట వినకుంటే మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. బదిలీ చేయిస్తామని బెదిరిస్తున్నారు. ఇటీవల ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ బజారీ అధికార పార్టీ నేత వేధింపులు తాళలేక సెలవులో వెళ్లిపోయారు. రోజువారీగా కార్యాలయంలో జరిగే రిజిస్ట్రేషన్లకు సంబంధించి లెక్కగట్టి మరీ వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. గతంలో కూడా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల పేరుతో నేతలు బెదిరింపులకు పాల్పడటంతో అక్కడి అధికారులు హడలెత్తిపోయారు.
బజారీ స్థానంలో అనంతపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న శ్రీనివాసులును ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా పంపారు. మొదట ఆయన ధర్మవరం వెళ్లేందుకు అయిష్టత వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సర్దిచెప్పి పంపినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితే హిందూపురం, కళ్యాణదుర్గం, కదిరి, ఉరవకొండ, రాయదుర్గం, చిలమత్తూరు ప్రాంతాల్లోనూ ఉంది. కొందరు సబ్ రిజిస్ట్రార్లు కూడా కాసులకు కక్కుర్తి పడడం అధికార పార్టీ నేతలకు కలిసొస్తోంది. ‘మీరూ తినండి.. మాకూ ఇవ్వండి’ అన్న ధోరణిలో నేతలు వెళ్తున్నారు. లేపాక్షి ఉత్సవాల సందర్భంగా హిందూపురంలో ఎమ్మెల్యే తర్వాత అంతటి స్థాయిలో ఫీలవుతున్న ఓ వ్యక్తి భారీగా డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసింది. రూ.5 లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేయగా..
అధికారులు చివరకు రూ.1.50 లక్షలు ముట్టజెప్పినట్లు సమాచారం. హిందూపురం మునిసిపాలిటీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ టీడీపీ నాయకుడు కూడా నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గంలో ఓ ప్రజాప్రతినిధి కుమారుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు సాగించాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇలా ప్రతి చోటా అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతుండటంతో కొందరు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ఇదే తడువుగా అక్రమార్జనకు బరితెగించి సదరు నేతలకు గులాంగిరీ చేస్తున్నట్లు విమర్శలున్నాయి.
సబ్ రిజిస్ట్రార్లపై అధికార జులుం గురించి తెలిసినా ఉన్నతాధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ విషయమై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ గిరికుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. రాజకీయ ఒత్తిళ్లు వాస్తవమేనన్నారు. ఇంతకుమించి మరేమీ మాట్లాడనన్నారు. దీన్నిబట్టి ప్రజాప్రతినిధులంటే అధికారులకు ఎంత భయం పట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.