Psychological harassment
-
నిజమైన స్నేహితులెవరూ లేరు.. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు..
సాక్షి, పలమనేరు: పాఠశాల నిర్వాహకుడి సూటిపోటి మాటలకు కలత చెంది మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని మిస్బా సూసైడ్ లెటర్ బుధవారం బయటపడింది. తన వల్ల తండ్రికి ఇబ్బందులు రాకూడదంటే ఆత్మహత్యే శరణ్యమని లెటర్లో పేర్కొంది. తన బాధ పంచుకునేందుకు నిజమైన స్నేహితులు లేరని, ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. చదువులో పోటీ కారణంగా తోటి విద్యార్థినితో సమస్యలు వచ్చినట్టు వెల్లడించింది. చదవండి: (మా అమ్మాయిని సూటిపోటి మాటలతో చంపేశారు!) డబ్బు గల వారికే పాఠశాల యాజమాన్యం కొమ్ము కాస్తోందని, తనను మానసికంగా వేధిస్తోందని తెలిపింది. వేధింపులను తట్టుకోలేక మరణిస్తున్నానని స్పష్టం చేసింది. చదువులో ఎదురైన ఆటంకాలు, పబ్లిక్ పరీక్షలు సమీపిస్తుండడంతో మిస్బా మానసికంగా నలిగిపోయినట్లు లెటర్ ద్వారా వెల్లడవుతోంది. దీనిపై ఎస్ఐ నాగరాజును వివరణ కోరగా, బాలిక తండ్రి మంగళవారం సూసైడ్ నోట్ సమాచారం అందించలేదన్నారు. అయితే బుధవారం ఇంట్లో లెటర్ దొరికిందని చెబుతున్నారని తెలిపారు. ఈ లేఖను సైతం కేసు విచారణకు తీసుకుంటామని వెల్లడించారు. -
బాలికలకు భరోసా..
భూపాలపల్లి అర్బన్: మానసిక వేధింపులు, లింగవివక్షకు గురవుతూ ఎవరికీ చెప్పలేక తమలోతాము కుంగిపోతున్న బాలికల్లో చైతన్యం నింపి భరోసా ఇవ్వడానికి రాష్ట్ర విద్యాశాఖ నడుంబిగించిం ది. ప్రభుత్వ పాఠశాలల్లో యుక్తవయసు బాలికలు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దడానికి బాలిక సాధికారత క్లబ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సర్కారు స్కూళ్లలో చదువుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల బాలికలు లింగవిక్షతోపాటు పలురకాల మానసిక వేధింపులకు గురవుతున్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోవడం వల్ల ఈ సమస్యల ను ధైర్యంగా ఎదుర్కోలేక పోతున్నారు. మరోవైపు యుక్త వయసులో వచ్చే శారీరక మార్పులకు అనుగుణంగా ఆరో గ్యం, పరిశుభ్రతపై అవగహన కొరవడుతోంది. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి బాలికల్లో ఆత్మవిశ్వసాన్ని నింపుతూనే వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ జీవన నైపుణ్యాలు పెంచేలా సమగ్ర శిక్ష అభియాన్ బాలిక సాధికారత క్లబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలను ఇందుకు ఎంచుకుంది. మొదటి విడతలతో జిల్లాలోని 20 కస్తూరిబా పాఠశాలలతో పాటు భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు, కాటారం, ఏటూరునాగారం మండల కేంద్రాల్లోని ఉన్నత పాఠశాల్లో ప్రయోగాత్మకంగా ఈ క్లబ్‌లను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తోంది. గత ఏడాది వేసవి సెలవుల్లో జిల్లాలోని పలు కస్తూరిబా విద్యాలయల్లో వివిధ అంశాలపై నిర్వహించిన ప్రత్యేక శిక్షణ ప్రస్తుతం ఈ క్లబ్‌ల ఏర్పాటుకు ఎంతో ఉపయోగపడుతోంది. 15 మంది సభ్యులతో కమిటీ బాలిక సాధికారత క్లబ్లో భాగంగా 13 నుంచి 15 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా కస్తూరిబా విద్యాలయ స్పెషల్ అధికారి చైర్మన్‌గా, గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్ కన్వీనర్‌గా, ప్రతి తరగతి నుంచి ఇద్దరు ప్రతిభ కలిగిన బాలికలతో మొత్తం 10 నుంచి 12 మంది సభ్యులు, అలాగే ఎక్స్టర్నల్ సభ్యులుగా సమీపంలోని పోలీసుస్టేషన్ నుంచి మహిళా కానిస్టేబుల్ ఉంటారు. ఈ క్లబ్‌లు ప్రతినెలా మొదటి శుక్రవారం సమావేశమై పాఠశాలతో పాటు గ్రామంలోని బాలికల నుంచి వచ్చిన ఫిర్యాదులు, గుర్తించిన సమస్యలపై సమీక్షిస్తారు. క్లబ్ లక్ష్యాలు.. యుక్త వయసు బాలికల్లో వచ్చే శారీరక మార్పులు, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, సంరక్షణ, లింగవివక్ష, జీవన నైపుణ్యాలు వంటి వాటిపై ఈ క్లబ్‌ల ద్వారా అవగహన కల్పిస్తారు. లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, బెదిరింపులు తదితర సమస్యలను గుర్తించి సమస్యల పరిష్కారానికి క్లబ్‌లు చర్యలు తీసుకుంటాయి. విద్యార్థినులను ఎవరైనా మానసికంగా వేధించినా, చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉంటే కమిటీ సమావేశంలో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటా రు. ఈ క్లబ్‌లను ఏర్పాటు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ నుంచి అమలు.. బాలికల కోసం ఏర్పాటు చేస్తున్న సాధికారత క్లబ్‌లను డిసెంబర్ మొదటి వారం నుంచి అమలు చేస్తాం. పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే శిక్షణ సైతం ఇచ్చారు. బాలికల ప్రయోజనం కోసమే రాష్ట్ర విద్యాశాఖ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. – పి.నిర్మల, ఎస్ఎస్ఏ సెక్టోరియల్ అధికారిణి -
మాకివ్వండి.. మీరూ తినండి
► సబ్ రిజిస్ట్రార్లకు అధికార పార్టీ నేతల ► బంపర్ ఆఫర్ కాదూ కూడదంటే వేధింపులు ► నెలనెలా ముడుపులివ్వాలని డిమాండ్ అనంతపురం టౌన్ : రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై టీడీపీ నేతల పెత్తనం అధికమవుతోంది. తాము చెప్పినట్లు వింటే సరే. లేదంటే కథ చూస్తామంటూ బెదిరిస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులైతే తమ నియోజకవర్గ పరిధిలో జరిగే పలు కార్యక్రమాలకు కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆయా కార్యాలయాల్లో పనిచేయడానికి అధికారులు హడలిపోతున్నారు. అనంతపురం రిజిస్ట్రార్ జిల్లా పరిధిలో 12, హిందూపురం రిజిస్ట్రార్ జిల్లా పరిధిలో తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు జులుం ప్రదర్శిస్తున్నారు. మాట వినకుంటే మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. బదిలీ చేయిస్తామని బెదిరిస్తున్నారు. ఇటీవల ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ బజారీ అధికార పార్టీ నేత వేధింపులు తాళలేక సెలవులో వెళ్లిపోయారు. రోజువారీగా కార్యాలయంలో జరిగే రిజిస్ట్రేషన్లకు సంబంధించి లెక్కగట్టి మరీ వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. గతంలో కూడా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల పేరుతో నేతలు బెదిరింపులకు పాల్పడటంతో అక్కడి అధికారులు హడలెత్తిపోయారు. బజారీ స్థానంలో అనంతపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న శ్రీనివాసులును ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా పంపారు. మొదట ఆయన ధర్మవరం వెళ్లేందుకు అయిష్టత వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సర్దిచెప్పి పంపినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితే హిందూపురం, కళ్యాణదుర్గం, కదిరి, ఉరవకొండ, రాయదుర్గం, చిలమత్తూరు ప్రాంతాల్లోనూ ఉంది. కొందరు సబ్ రిజిస్ట్రార్లు కూడా కాసులకు కక్కుర్తి పడడం అధికార పార్టీ నేతలకు కలిసొస్తోంది. ‘మీరూ తినండి.. మాకూ ఇవ్వండి’ అన్న ధోరణిలో నేతలు వెళ్తున్నారు. లేపాక్షి ఉత్సవాల సందర్భంగా హిందూపురంలో ఎమ్మెల్యే తర్వాత అంతటి స్థాయిలో ఫీలవుతున్న ఓ వ్యక్తి భారీగా డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసింది. రూ.5 లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేయగా.. అధికారులు చివరకు రూ.1.50 లక్షలు ముట్టజెప్పినట్లు సమాచారం. హిందూపురం మునిసిపాలిటీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ టీడీపీ నాయకుడు కూడా నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గంలో ఓ ప్రజాప్రతినిధి కుమారుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు సాగించాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇలా ప్రతి చోటా అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతుండటంతో కొందరు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ఇదే తడువుగా అక్రమార్జనకు బరితెగించి సదరు నేతలకు గులాంగిరీ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. సబ్ రిజిస్ట్రార్లపై అధికార జులుం గురించి తెలిసినా ఉన్నతాధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ విషయమై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ గిరికుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. రాజకీయ ఒత్తిళ్లు వాస్తవమేనన్నారు. ఇంతకుమించి మరేమీ మాట్లాడనన్నారు. దీన్నిబట్టి ప్రజాప్రతినిధులంటే అధికారులకు ఎంత భయం పట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.