
మిస్బా (ఫైల్), సూసైడ్ నోట్
సాక్షి, పలమనేరు: పాఠశాల నిర్వాహకుడి సూటిపోటి మాటలకు కలత చెంది మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని మిస్బా సూసైడ్ లెటర్ బుధవారం బయటపడింది. తన వల్ల తండ్రికి ఇబ్బందులు రాకూడదంటే ఆత్మహత్యే శరణ్యమని లెటర్‌లో పేర్కొంది. తన బాధ పంచుకునేందుకు నిజమైన స్నేహితులు లేరని, ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. చదువులో పోటీ కారణంగా తోటి విద్యార్థినితో సమస్యలు వచ్చినట్టు వెల్లడించింది.
చదవండి: (మా అమ్మాయిని సూటిపోటి మాటలతో చంపేశారు!)
డబ్బు గల వారికే పాఠశాల యాజమాన్యం కొమ్ము కాస్తోందని, తనను మానసికంగా వేధిస్తోందని తెలిపింది. వేధింపులను తట్టుకోలేక మరణిస్తున్నానని స్పష్టం చేసింది. చదువులో ఎదురైన ఆటంకాలు, పబ్లిక్ పరీక్షలు సమీపిస్తుండడంతో మిస్బా మానసికంగా నలిగిపోయినట్లు లెటర్ ద్వారా వెల్లడవుతోంది. దీనిపై ఎస్‌ఐ నాగరాజును వివరణ కోరగా, బాలిక తండ్రి మంగళవారం సూసైడ్ నోట్ సమాచారం అందించలేదన్నారు. అయితే బుధవారం ఇంట్లో లెటర్ దొరికిందని చెబుతున్నారని తెలిపారు. ఈ లేఖను సైతం కేసు విచారణకు తీసుకుంటామని వెల్లడించారు.