ట్రిపుల్ ఐటీలో పీయూసీ 2 విద్యార్థిని ఆత్మహత్య
వ్యక్తిగత కారణాలతోనే అని అధికారుల ప్రకటన
తమ కూతురును చంపేశారని తల్లి ఆరోపణ
మృతదేహం తరలింపుపై అనుమానాలు
సెల్‌ఫోన్, సూసైడ్ నోట్ ఇవ్వడం లేదని ఆగ్రహం
క్యాంపస్‌ను ముట్టడించిన ఏబీవీపీ నాయకులు
లాఠీచార్జి చేసిన పోలీసులు,సెక్యూరిటీ గార్డులు
భైంసా/బాసర: బాసరలోని ట్రిపుల్‌ఐటీలో మరో విద్యా సుమం రాలిపోయింది. పీయూసీ2 చదువుతున్న పూరి స్వాతిప్రియ(18) ఆదివారం అర్ధరాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని తిరుమలకాలనీకి చెందిన పూరి స్వాతిప్రియ బాసర ట్రిపుల్‌ఐటీలో పీయూసీ2 చదువుతోంది. విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న కుటుంబీకులు ట్రిపుల్‌ఐటీకి చేరుకున్నారు. వారిని సెక్యూరిటీ అధికారులు ప్రధాన గేటు వద్దనే నిలిపివేశారు. పుట్టెడు దుఃఖంతో వచ్చిన తల్లిదండ్రులు గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. బంధువుల ప్రశ్నలకు అధికారులెవరూ సమాధానం చెప్పలేదు.
పిల్లలను చదివిస్తూ...
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్‌కుచెందిన పూరి రవీందర్ – ఉజ్వల దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు సరస్వతి బీటెక్ చదువుతోంది. రెండో కూతురు స్వాతిప్రియ బాసర ట్రిపుల్‌ఐటీలో చదువుతోంది. కొడుకు ఓంసాయిరాం హైసూ్కల్ చదువుతున్నాడు. ఆర్మూర్ మోడల్ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివిన స్వాతిప్రియకు బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు వచ్చింది. పూరి రవీందర్ ప్రైవేటు ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరాచేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలను బాగా చదివిస్తే జీవితంలో స్థిరపడతారని ఎంతో కష్టపడుతున్నారు. కూతురు మృతిచెందడాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
తల్లి ఆరోపణలు...
పూరి స్వాతిప్రియను క్యాంపస్ అధికారులే హత్యచేసి ఆత్మహత్యగా చెబుతున్నారని మృతు రాలి తల్లి ఉజ్వల ఆరోపించారు. తాము రాకముందే మృతదేహాన్ని ఆస్పత్రికి ఎందుకు తరలించారని ప్రశ్నించారు. ట్రిపుల్‌ఐటీకి చేరుకున్న తమను లోపలికి ఎందుకు అనుమతించలేదని నిలదీశారు. కూతురు సెల్‌ఫోన్ ఇవ్వడంలేదని, సూసైడ్ నోట్ ఉందని చెప్పిన అధికారులు దానిని చూపించలేదని పేర్కొన్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునే అవకాశమేలేదన్నారు. ఆదివారం ఫోన్‌లో మాట్లాడిందని ఉదయానికే ఎలా చనిపోయిందని ప్రశ్నించారు. క్యాంపస్ అధికారులు సాక్ష్యాలు మాయంచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. చదువు కోసం పంపితే శవాన్ని ఇంటికి పంపుతున్నారని విలపించారు.
తల్లిదండ్రులు రాకముందే తరలింపు..
స్వాతిప్రియ దసరా, దీపావళి పర్వదినాల్లోనూ ఇంటికి వెళ్లివచ్చింది. రోజూ తల్లిదండ్రులకు ఫోన్‌లో మాట్లాడేది. సోమవారం ఉదయం క్యాంపస్ అధికారులు ఫోన్ చేసి స్వాతిప్రియ ఆత్మహత్యచేసుకుందని తెలుపడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. దీంతో గంటలోపే బాసరకు చేరుకున్నారు. అయితే తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని క్యాంపస్ నుంచి భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై వారు అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment