
(వరంగల్) మహబూబాబాద్: లైంగిక వేధింపులతో మండలంలోని ల్యాదెళ్ల గ్రామానికి చెందిన మాళవిక(19) ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. ఎస్సై హరిప్రియ, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. మాళవిక ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన సంగాల సాయి, మాళవిక ఒకర్నొకరు ప్రేమించుకున్నారు. మూడు నెలల క్రితం వీరిద్దరూ శారీరకంగా కలుసుకున్నారు. ఏకాంతంగా ఉన్న సమయంలో సాయి ఆమె ఫొటోలు తీసుకున్నాడు. మాళవిక ఆచిత్రాలను తొలగించాలని వేడుకుంది.
సాయి తొలిగిస్తానని నమ్మబలికి ఆవీడియోలు, ఫొటోలను తన మిత్రుడైన తాళ్ల ప్రణయ్ అలియాస్ ఢిల్లీకి పంపించాడు. ప్రణయ్ మాళవికకు వరుసకు సోదరుడవుతాడు. ఫొటోలు, వీడియోలను ఆసరాగా చేసుకున్న ప్రణయ్ ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో ప్రణయ్ వేధింపులు భరించలేక మాళవిక గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో గడ్డి మందు తాగింది. అనంతరం వాంతులు చేసుకుంటున్న క్రమంలో బంధువులు గమనించి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. యువతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. యువతి తల్లి ఇందిర ఫిర్యాదు మేరకు సంగాల సాయి, తాళ్ల ప్రణయ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment