ఇది అందరూ తెలుసుకోవలసిన విషయం. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక ప్రచారం చేశారు. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనవచ్చని. అంతలా తెలంగాణలో రేట్లు పెరిగిపోయాయని, ఏపీలో ధరలు దెబ్బతిన్నాయన్నది ఆయన చెప్పిన మాట. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయన ఈ అవకాశాన్ని వాడుకున్నారు.
ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయనకు మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి దిన పత్రిక హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ వేలంపాటలో విపరీతమైన రేట్లను కొందరు పెట్టడంపై ఒక కథనాన్ని ఇస్తూ అదంతా రియల్ ఎస్టేట్ మాఫియా పని అని, నిజానికి రేట్లు పెరిగినట్లు చూపి తమ భూముల విలువ పెంచుకునే కుట్ర అని వెల్లడించింది. అంతేకాక, గజం లక్ష రూపాయలకో, లేక ఎకరా వంద కోట్లకో పాట పాడినవారు చాలా మంది అసలు ఆ తర్వాత డబ్బులే చెల్లించడం లేదని తెలిపింది. కేవలం ఒక లక్ష రూపాయల డిపాజిట్ కట్టి ఈ తంతు సాగిస్తున్నారని తెలియచేసింది. తెలంగాణ ప్రాంతంలో ఈ కథనాన్ని ఇచ్చిన ఆ పత్రిక ఏపీలో మాత్రం ఇవ్వకుండా జాగ్రత్తపడింది.
బాబు బూమ్ మాయ..
ఇక్కడ మాత్రం చంద్రబాబు చెప్పిన విషయానికి మాత్రం ప్రాధాన్యం ఇచ్చారు. దీనిని బట్టి ఒకటి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ మాఫియాలకు అనుకూలంగా ఉంటారని అనుకోవచ్చు కదా!. ఎందుకంటే అమరావతి రాజధాని గ్రామాల్లో అచ్చంగా ఇలాగే రియల్ ఎస్టేట్ కృత్రిమ బూమ్ కోసం చంద్రబాబు కృషి చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో రాజధాని గ్రామాలలో తెల్లవారేసరికి భూముల విలువ ఐదు నుంచి పది రెట్లు పెరిగిపోయాయి. అబ్బో అదంతా చంద్రబాబు ఘనతే అని ఆయనకు మద్దతు ఇచ్చే పత్రికలు, టీవీలు ఊదరగొట్టాయి.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఆంధ్రజ్యోతి రాసిన ఈ కథనం చూస్తే కారణం ఏమైనా కానీ.. కొంత వాస్తవమే ఉన్నట్లు అనిపిస్తుంది. మేడిపల్లి అనే చోట జరిగిన హెచ్‌ఎండీఏ వేలంపాటలో నారాయణమూర్తి అనే వ్యక్తి గజం యాభై వేలకు ప్లాట్ కొన్నారట. ఆ తర్వాత ఆయన హెచ్‌ఎండీఏ ఆఫీస్‌కు వెళ్లి తన పక్క ప్లాట్ల వారి గురించి ఆరా తీశారట. అప్పుడు అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారట. తనతో పాటు ఆయా ప్లాట్లను వేలంలో అధిక ధరకు కొనుగోలు చేసినవారిలో ఎనభై శాతం అసలు డబ్బు చెల్లించలేదట. లక్ష రూపాయల డిపాజిట్ కూడా వదలుకోవడానికి సిద్దపడటంలో రహస్యం వారి ఆ చుట్టుపక్కల ఉన్న ఆస్తుల విలువను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుండటమేనట.
రియల్ ఎస్టేట్ ట్రిక్స్..
ఫ్రీలాంచ్ ఆఫర్ల పేరుతో తమ విల్లాలు, అపార్టుమెంట్లను అమ్ముకోవడానికి అత్యాశతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేలం మాఫియాగా మారారని ఆ పత్రిక రాసింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత సుమారు లక్ష ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చింది. దాంతో ఓవరాల్‌గా రియల్ ఎస్టేట్ రంగం సబ్దుగా మారిందని, ఆ నేపథ్యంలోనే ఇలాంటి ట్రిక్కులను ప్లే చేస్తున్నారని మీడియా రాసింది. ఇంకో విశేషం ఏమిటంటే తెలంగాణలో 2023 మొదటి నాలుగు నెలల్లో గత ఏడాది కన్నా రిజిస్ట్రేషన్లు తగ్గాయట. ఆదాయం కూడా 150 కోట్లు తక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి.
ఈ రియల్ మాఫియాకు ప్రభుత్వ సహకారం కూడా ఉందని ఈ పత్రిక ఆరోపించింది. మార్కెట్ దెబ్బతిందన్న భావన కలగకుండా ఉండడానికి ప్రభుత్వం అలా చేస్తోందని రాశారు. మోకిలా అనేచోట హెచ్‌ఎండీఏ వేసిన ప్లాట్ల వేలంలో కూడా ఇలాగే స్కామ్ జరిగిందని మీడియా చెబుతోంది. ఒకే సంస్థకు చెందిన పదిహేను మంది అక్కడ గజం 35వేల రూపాయల వరకు వెళ్లవచ్చని అనుకుంటే అరవైఐదు వేల నుంచి లక్ష రూపాయలవరకు పెట్టారట. తీరా చూస్తే ఆ సంస్థకు ఆ పక్కనే 350 ఎకరాల భూమి ఉందట. హైదరాబాద్‌లో ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త మందగించిందని, అంతర్జాతీయంగా ఉన్న ఆర్ధిక సంక్షోభం కొంత కారణమని, ఐటి రంగంలో ఉన్న ఒడిదుడుకులు తోడవుతున్నాయని.. ఇలా రకరకాల రీజన్స్ చెబుతూ కొంతకాలం క్రితం ఒక టీవీ చానల్ కూడా కథనాన్ని ఇచ్చింది.
టీడీపీ మాఫియా పని..
ఇదే టైమ్‌లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఏ పరిణామం జరిగినా అదంతా తన ఘనతేనని చెప్పుకుంటారు. నిజానికి ఆయన ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం సీఎంగా ఉన్నారు. అప్పటికి, ఇప్పటికి ఎంతో తేడా వచ్చింది. ఆయన టైమ్‌లో మాదాపూర్ వరకు పూర్తి స్థాయిలో రోడ్డు కూడా లేదు. వైఎస్సార్ వచ్చాక దానిని పెద్ద ఎత్తున విస్తరించారు. ఆ విషయాలు పక్కనబెడితే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని గ్రామాలలో కూడా ఇలాంటి మాఫియా వారినే ప్రోత్సహించారన్న అభిప్రాయం కలగదా?. వెలగపూడి చుట్టుపక్కల రాజధాని అని ప్రకటించేలోపే ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగి తక్కువ ధరకు కొందరు టీడీపీ నేతలు భూములు కొన్నారని ఆరోపణ వచ్చింది.
తదుపరి ఆ భూములను అధిక ధరలకు అమ్ముకుని కొందరు లాభ పడ్డారు. పది, పదిహేను లక్షల రూపాయల చొప్పున ఎకరా భూమి అమ్ముడు పోయిన పరిస్థితి నుంచి ఏకంగా ఎకరా ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలకు అమరావతి గ్రామాలలో వెళ్లింది. ఆనాటి మంత్రి నారాయణ, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పలుమార్లు ఎకరం నాలుగు కోట్ల వరకు పలుకుతోందని, అదంతా తమ ఘనత అని చెప్పుకునేవారు. అసలు రాజధానికి సంబంధించిన భవనాలే రాకముందే అంతంత ధర ఎలా వచ్చింది. ఆ చుట్టుపక్కలే, చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ కంపెనీ భూములు కొనడం, నారాయణ తన బినామీల పేరుతో భూములు కొనడం ఏమిటి?.
అమరావతితో రియల్ దందా..
కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అచ్చంగా మాఫియాలా మారారన్న విమర్శలు అప్పట్లో కూడా వచ్చాయి కదా?. చంద్రబాబు ప్రభుత్వం కొన్ని ప్రైవేటు సంస్థలకు చాలా తక్కువ ధరకు భూముల ఇచ్చి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మాత్రం ఎకరా నాలుగు కోట్ల రూపాయల ధర పెట్టడంలోని హేతుబద్దత ఏమిటన్న ప్రశ్నలుకూడా వచ్చాయి. అమరావతి గ్రామాలలో మాత్రమే రియల్ ఎస్టేట్ రేట్లు పెరగడానికి అప్పట్లో మిగిలిన ప్రాంతాన్ని గ్రీన్ జోన్‌గా ప్రకటించడం జరిగిందని చెబుతారు. దానివల్ల చాలా రాజధానియేతర గ్రామాలలో పొలాలు అమ్ముకోవడమే కష్టం అయ్యేది. ధరలు కూడా పడిపోయాయి. అయినా ఇప్పటికీ చంద్రబాబు అమరావతి మోడల్ గురించే ప్రచారం చేస్తుంటారు. లక్షల కోట్లు వ్యయం చేస్తేకానీ.. తయారు కాని అమరావతిని సంపద సృష్టించే నగరంగా ప్రచారం చేసుకుంటారు. ఏది ఏమైనా హైదరాబాద్‌లో అయినా, అమరావతి గ్రామాలలో అయినా కృత్రిమంగా విలువలు పెంచుకోవడంలో ఉన్న మతలబు ఇది అని తెలిసిన తర్వాత అంతా ముక్కున వేలేసుకోవలసిందే. అలాంటివాటిని తన ఘనతగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గురించి ఏమనుకోవాలి?.
కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్.
Comments
Please login to add a commentAdd a comment