పోల్‌ సీన్‌ లైవ్‌ | Live broadcast to the transparency of the voting process | Sakshi
Sakshi News home page

పోల్‌ సీన్‌ లైవ్‌

Published Tue, Nov 20 2018 3:31 AM | Last Updated on Tue, Nov 20 2018 10:13 AM

Live broadcast to the transparency of the voting process - Sakshi

పోలింగ్‌ కేంద్రాలను వశపర్చుకోవడం లేదంటే బ్యాలెట్‌ బాక్సులు ఎత్తుకుపోవడం.. ఓటమి ఖాయమని తెలిస్తే రీపోలింగ్‌కు పట్టుబట్టడం లేదా పోలింగ్‌ వాయిదా వేయించడం.. ఇటువంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేయడానికి వెబ్‌ కాస్టింగ్‌ ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఈ విధానంలో.. ఓటరు ఓటుహక్కు వినియోగించుకునే దృశ్యం ప్రత్యక్షం కానుంది. అంటే.. ఈ ఎన్నికల్లో 2.78 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునే క్షణాలు 32,796 పోలింగ్‌ కేంద్రాల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ ఎన్నికల లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌కు కర్త, కర్మ కేంద్ర ఎన్నికల సంఘం కాగా ‘క్రియా’శీలక పాత్రను ఇంజనీరింగ్‌ కళాశాల  విద్యార్థులు పోషించనున్నారు. ఈ ప్రక్రియకు త్వరలో జరిగే ఎన్నికలు వేదిక కానున్నాయి. 

ప్రతి దృశ్యం ప్రత్యక్ష ప్రసారం: ప్రస్తుత ఎన్నికల్లో ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకుంటున్న తీరుతో పాటు.. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్, ప్రిసైడింగ్‌ అధికారులు, భద్రత సిబ్బంది, పోలింగ్‌ ఏజెంట్ల ప్రతి కదలికను ఎన్నికల సంఘం లైవ్‌లో వీక్షించనుంది. వచ్చే నెల 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 32,574 పోలింగ్‌ కేంద్రాలతో పాటు మరో 222 అనుబంధ పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహించనున్న పోలింగ్‌ ప్రక్రియను ఆద్యంతం ‘లైవ్‌ వెబ్‌కాస్ట్‌’ చేయనున్నారు. ఎక్కడ ఎలాంటి అపశ్రుతి చేసుకున్నా, పోలింగ్‌కు ఆటంకాలు కలిగినా.. క్షణాల్లో ఎన్నికల సంఘం సంబంధిత పోలింగ్‌ కేంద్రంలోని పరిస్థితులను లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌(http://webcast.gov.in/eci/)ద్వారా వీక్షిస్తూ స్థానిక పోలింగ్‌ అధికారులకు సూచనలు జారీ చేయనుంది. ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు, హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్, జిల్లా కేంద్రాల నుంచి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, నియోజకవర్గ కేంద్రాల నుంచి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు పోలింగ్‌ ప్రక్రియను టీవీ తెరలపై ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. సాంకేతికంగా ప్రత్యక్ష ప్రసారం సాధ్యం కాని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాల ద్వారా మొత్తం పోలింగ్‌ ప్రక్రియను రికార్డు చేస్తారు.   


ఈసారి పూర్తిస్థాయిలో వెబ్‌కాస్ట్‌: ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 2009లో పోలింగ్‌ కేంద్రాల లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ప్రతిసారి ఏదో చోట అలజడి చెలరేగడం.. పోలింగ్‌కు ఆటంకం కలగడం వంటి ఘటనలు చోటుచేసుకునేవి. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ ప్రక్రియను లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌ చేయడం లేదా వీడియో కెమెరాలతో రికార్డు చేయడం ప్రారంభించాక ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కడా చెదురుమదురు ఘటనలు సైతం చోటుచేసుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం అంతంత మాత్రమే ఉండడం, అవసరమైన మేరకు హార్డ్‌వేర్‌ పరికరాలు లేకపోవడంతో 2009లో కేవలం సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించగా మంచి ఫలితాలొచ్చాయి. 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో 29,138 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 16,512 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించారు. బ్రాండ్‌ బ్యాండ్‌తో పాటు వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ సదుపాయం లేకపోవడంతో 7,986 పోలింగ్‌ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించగా, మరో 4,142 కేంద్రాల్లో వీడియోగ్రఫీ, 320 కేంద్రాల్లో డిజిటల్‌ కెమెరాలతో పోలింగ్‌ ప్రక్రియను రికార్డు చేశారు. ప్రస్తుత ఎన్నికల సందర్భంగా 32,796 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈసారి అన్ని కేంద్రాలను వెబ్‌ కాస్టింగ్‌ పరిధిలోకి తేవాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. బ్రాండ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సదుపాయం లేనిచోట్ల డేటా కార్డులు, వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ సదుపాయం ద్వారా వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించేందుకు అధికా రులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 
భావి ఇంజనీర్ల పాత్ర
ఈ ఎన్నికల  లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌ ప్రక్రియ అమలులో ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులు కీలకపాత్ర పోషించనున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో ముగ్గురు ఇం జనీరింగ్‌ కళాశాల విద్యార్థులను వెబ్‌కాస్టింగ్‌ అవసరాల కోసం నియమిస్తారు. ఇందుకోసం స్థానిక ఇంజనీరింగ్‌ కళా శాలల యాజమాన్యాలతో క్షేత్ర స్థాయిలో ఎన్నికల యంత్రాంగం సంప్రదింపులు జరుపుతోంది. ఇందుకు 98,382 మంది విద్యార్థులు అవసరం. ఇప్పటికే విద్యార్థుల గుర్తింపు పూర్తయింది. ఇంజనీరింగ్‌ కళాశాలలు, వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ సదుపాయం లేని ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించనున్నారు.

లైవ్‌లో పోలింగ్‌ పరిశీలన ఇలా..: - ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కనీసం 7–8 అడుగుల ఎత్తులో సీసీ కెమెరాలను అమర్చి.. లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌ చేస్తారు
ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ‘వెబ్‌ కెమెరా/సీసీటీవీ నిఘా పరిధిలో మీరు ఉన్నార’నే నోటీసులు అతికిస్తారు
పోలింగ్‌ కేంద్రంలో ప్రవేశించిన ఓటరును పోలింగ్‌ అధికారి గుర్తించారా?.. వేలిపై సిరా చుక్క వేశారా?
ఓటరును గుర్తించిన అనంతరం ఈవీఎంకు సంబంధించిన కంట్రోల్‌ యూనిట్‌ను ప్రిసైడింగ్‌ అధికారి స్టార్ట్‌ చేయడం..
ఓటు వేసేందుకు పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌లోకి ఓటరు ప్రవేశించే దృశ్యం (అయితే, ఓటెవరికి వేశారన్న రహస్యాన్ని కాపాడేందుకు ఈవీఎం బ్యాలెట్‌ యూనిట్‌ కనిపించని విధంగా కెమెరా ఏర్పాటు చేస్తారు) పోలింగ్‌స్టేషన్‌లో పోలింగ్‌ ఏజెంట్ల కదలికలు
పోలింగ్‌ ముగింపు సమయంలో ఇంకా ఓటేసేందుకు వరుసలో నిలబడిన ఓటర్లకు టోకెన్లు/స్లిప్పులు అందించే ప్రక్రియ
పోలింగ్‌ ముగిశాక ఈవీఎంలు (బ్యాలెట్‌ యూనిట్‌/కంట్రోల్‌ యూనిట్‌), వీవీ ప్యాట్లను సీల్‌వేసే దృశ్యం.. పోలింగ్‌ ఏజెంట్లకు 17సీ కాపీలు అందజేయడం.. ఇవన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలిస్తారు.

ఎలక్షన్‌ ‘టెక్‌’..: ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ఉన్న అభ్యంతరాలు, సందేహాలను తీర్చడానికి  ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీ పాట్‌) కీలకపాత్ర పోషించనుంది. ఇది.. ఎవరికి ఓటు వేశామనేది ఏడు క్షణాల పాటు తెరపై చూపించనుంది.
పార్టీలు, అభ్యర్థులు నిర్వహించే ప్రచార ర్యాలీలు, బహిరంగసభలకు సత్వర అనుమతుల కోసం ‘సువిధ’ మొబైల్‌ యాప్‌ అమల్లోకి వచ్చింది.
ఎన్నికల్లో అక్రమాలు, అవినీతి, డబ్బుల పంపిణీ, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై సా మాన్య పౌరులు నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు ‘సీ–విజిల్‌’ యాప్‌ ప్రవేశపెట్టారు. ఈఆర్వో నెట్‌ వెబ్‌సైట్‌లో రాష్ట్ర ఓటర్ల జాబితాను ఉంచారు. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ఓటర్ల జాబితాలకు ఈ వెబ్‌సైట్‌ అనుసంధానంగా పనిచేయనున్నది. 

బరిలో 89 పార్టీలు..
2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ  నుం చి 89 పార్టీలు (ఇండిపెండెంట్లు అదనం) బరి లో దిగాయి. బీజేపీ, బీఎస్‌పీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎన్‌సీపీ  వంటి జాతీయ పార్టీలు, టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఏఐఎంఐ ఎం, రాష్ట్ర పార్టీలు, ఆప్, ఏఐఎఫ్‌బీ, ఐయూఎం ఎల్, జేడీ (ఎస్‌), జేడీ (యూ), లోక్‌జనశక్తి పా ర్టీ, ఆర్జేడీ, ఆర్‌ఎల్‌డీ, ఆర్‌ఎస్‌పీ, శివసేన, ఎస్‌ పీ, అఖిల భారత జనసంఘ్, సీపీఐ (ఎంఎల్‌) రెడ్‌స్టార్, సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తదితర 70 పార్టీలు పోటీ చేశాయి.
...::: మహమ్మద్‌ ఫసియొద్దీన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement