నోటిఫికేషన్‌ వచ్చిన 5 రోజుల్లో ఇంటి వద్ద ఓటుకు దరఖాస్తు | Application for vote at home within 5 days of notification | Sakshi
Sakshi News home page

నోటిఫికేషన్‌ వచ్చిన 5 రోజుల్లో ఇంటి వద్ద ఓటుకు దరఖాస్తు

Published Sat, Apr 13 2024 4:30 AM | Last Updated on Sat, Apr 13 2024 4:30 AM

Application for vote at home within 5 days of notification - Sakshi

12డి ఫామ్‌ పూర్తి చేసి రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వాలి

ఈ ఫామ్‌ సేకరించే బాధ్యత బూత్‌ స్థాయి ఆఫీసర్‌కు

85 ఏళ్లు పైబడిన, 40 శాతం వైకల్యం ఉన్న వారు అర్హులు

దివ్యాంగులు వికలాంగ ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వాలి

దేశంలో 1.70 కోట్లు పైగా 85 ఏళ్లు పెబడిన వృద్ధులు, వికలాంగ ఓటర్లు

రాష్ట్రంలో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 2.11 లక్షలు.. వికలాంగులు 5.18 లక్షలు

85 ఏళ్లు పైబడిన ఓటర్లలో మహిళలే అధికం

ఇంటి వద్దే ఓటు వేసే ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరణ

ఓటు ఎవరికి వేశారో తెలియకుండా గోప్యత

కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి

సాక్షి, అమరావతి: పోలింగ్‌ కేంద్రం వరకు రాలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్ణయం తీసుకుంది. దేశంలో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగ ఓటర్లు ఈ సౌకర్యా­న్ని వినియోగించుకోవచ్చు. ఈమేరకు రాష్ట్రాల వారీగా ఇంటి వద్దే ఓటు వేసేందుకు అర్హత ఉన్న ఓటర్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్‌ కుమార్, డాక్టర్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు శుక్రవారం ప్రకటించారు.

వీరికి ఇంటి వద్దే ఓటు వేయాలనేది తప్పనిసరి కాదని, ఇది ఐచ్ఛికం మాత్రమేనని చెప్పారు. ఇటువంటి ఓటర్లు దేశవ్యాప్తంగా 1.70 కోట్లకు పైగా ఉన్నట్లు సీఈసీ తెలిపింది. ఇందులో 85 ఏళ్లు పైబడిన వారు 81 లక్షలకు పైగా, దివ్యాంగులు 90 లక్షలకుపైగా ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లలో మహిళలు ఎక్కువ ఉన్నారు. వీరిలో 33.84 లక్షల మంది పురుషులు కాగా, 47.27 లక్షల మంది మహిళా ఓటర్లు, 18 మంది థర్డ్‌ జెండర్‌లు ఉన్నారు.

40 శాతం వైకల్యం ఉన్న ఓటర్లలో 53.64 లక్షల మంది పురుషులు, 36.42 లక్షల మంది మహిళలు, 442 మంది థర్డ్‌ జెండర్‌లు ఉన్నారు. ఈ వర్గాల వారికి ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పించడం ప్రగతిశీల చర్యగా ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ వర్గాలకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటు వేసే సమయంలో ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. 

ఈ సదుపాయాన్ని పొందే విధానం సరళంగా, సమగ్రంగా, పారదర్శకంగా కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయిన ఐదు రోజుల్లోగా అర్హులైన ఓటర్లు ఇంటి వద్ద ఓటు వేసేందుకు 12 డి ఫారమ్‌ను పూర్తి చేసి రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వాలి. దివ్యాంగులు 12 డి ఫామ్‌తో పాటు వైకల్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. వీరి నుంచి 12 డి ఫామ్‌ను బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ సేకరిస్తారు. జవాబుదారీ, పాదర్శక­త కోసం ఇంటి వద్ద ఓటు వేసే వారి వివరాలను అభ్యర్ధులకు అందుబాటులో ఉంచుతారు.

అవసర­మైతే అభ్యర్థులు ఈ ప్రక్రియను పర్యవేక్షించుకో­వ­చ్చు. ఈ ఓటర్ల ఇళ్లకు భద్రతా అధికారులతో పాటు ప్రత్యేక పోలింగ్‌ బృందం వెళ్తుంది. ఎప్పుడు ఇంటికి వస్తారో ముందుగానే ఆ ఓటర్లకు తెలియజేస్తారు. ఇంటి వద్ద ఓటు వేసే పూర్తి ప్రక్రియను వీడియో తీస్తారు. ఓటు ఎవరికి వేశారో తెలియకుండా గోప్యతను పాటిస్తారు. ఇంటి వద్ద ఓటు వేసిన తరువాత ఆ బ్యాలెట్‌లను భద్రంగా బ్యాక్సుల్లో ఉంచి తిరిగి రిటర్నింగ్‌ అధికారికి స్వాధీనం చేస్తారు.

రాష్ట్రంలో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు
మొత్తం ఓటర్లు    2,11,088
పురుషులు    84,155
మహిళలు    1,26,927
థర్డ్‌ జెండర్‌    6

రాష్ట్రంలో 40 శాతం వైకల్యం గల ఓటర్లు
మొత్తం ఓటర్లు    5,18,193
పురుషులు    3,02,374
మహిళలు    2,15,795
థర్డ్‌ జెండర్‌    24 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement