కాకిస్‌నూరు.. ఓటింగ్‌లో సూపర్‌.. | Sakshi
Sakshi News home page

కాకిస్‌నూరు.. ఓటింగ్‌లో సూపర్‌..

Published Thu, May 16 2024 6:07 AM

A village that has stood as an example for the country in voting

ఓటింగ్‌లో దేశానికే ఆదర్శంగా నిలిచిన కుగ్రామం

అష్టకష్టాలు పడి కేంద్రానికి చేరుకున్న అధికారులు

సాదరంగా ఆహ్వానించిన గిరిజనం

93.22 శాతం ఓటింగ్‌ నమోదు 

ఎక్స్‌లో హర్షం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 

అది బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఓ కుగ్రామం. ఏలూరు జిల్లా కేంద్రానికి 180  కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గూడేనికి చేరుకోవడమే ఓ ప్రహసనం. ఎలాంటి రహదారి  సౌకర్యం లేని అక్కడి పోలింగ్‌ కేంద్రానికి చేరుకోవాలంటే కొయిదా గ్రామం నుంచి గోదావరి‡ నదిగుండా బోట్‌లో ప్రయాణించి, ఆవలి ఒడ్డు నుంచి సుమారు మూడు కిలోమీటర్లు గుట్టల నడుమ కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడ మొత్తం 472మంది కొండరెడ్ల ఓటర్లున్నారు. 

సోమవారం జరిగిన ఎన్నికల్లో 440 ఓట్లు పోల్‌ కాగా 93.22శాతం ఓటింగ్‌ నమోదు చేసుకుని ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టిని ఆకర్షించింది. అంతేనా... అధికారుల ప్రశంసలను కూడా అందుకుని దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామమే పోలవరం నియోజకవర్గం పరిధిలోని కాకిస్‌నూరు.

వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని అత్యంత మారుమూల, దట్టమైన అటవీ ప్రాంత గ్రామమైన కాకిస్‌నూరు గ్రామం ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించింది.  సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 93.22 ఓటింగ్‌ శాతం నమోదు చేసుకుని ఆదర్శంగా నిలిచింది. అక్కడ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ఈ నెల 12వ తేదీ రాత్రి వెళ్లిన అధికారులకు గ్రామ కొండరెడ్లు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. 

అధికారులను పూలమాలలతో సన్మానించారు. వారి సహృదయతకు ముచ్చటపడిన భారత ఎన్నికల సంఘం ‘ఎక్స్‌’ వేదికగా అధికారులకు స్వాగతం పలికిన ఫొటోను అప్‌లోడ్‌ చేసి, వివరాలతో ట్విట్‌ చేశారు. దీనికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. 

బోటుపై వచ్చి ఓటు హక్కు వినియోగం
దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కాకిస్‌నూరు పోలింగ్‌ కేంద్రం పరిధిలోని పేరంటపల్లి, టేకుపల్లి, చినమకోలు, పెదమంకోలు గ్రామాల ఓటర్లు 440 మంది గోదావరిలో బోటుపై వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 16,37,430 ఓటర్లున్న ఏలూరు జిల్లాలోని 1,744 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్‌ సకల ఏర్పాట్లు చేశారు. కాకిస్‌నూరు గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్‌ సౌకర్యం లేని ఆ గ్రామంలో జనరేటర్‌ సమకూర్చి, తాత్కాలికంగా లైట్లు ఏర్పాటు చేయించారు.

ఫోన్‌ కవరేజ్‌ లేకపోవడంతో ఈ గ్రామంలో శాటిలైట్‌ ఫోన్‌ ఏర్పాటు చేశారు. ఓటర్లు వచ్చేందుకు బోటు సౌకర్యం కల్పించడమే కాకుండా ఓటింగ్‌కు ఒక రోజు ముందు వారికి ఓటింగ్‌పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల అధికారులు 12న కాకిస్‌నూరు గ్రామానికి చేరుకొని, ఇంటింటికీ తిరిగి ప్రతిఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు.

 ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను వివరించారు. ఫలితంగా ఓటింగ్‌ శాతం పెరిగింది. తమ గ్రామానికి దే«శస్థాయిలో గుర్తింపు రావడంపై భారత ఎన్నికల కమిషన్, రాష్ట్ర  ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్‌ మీనా, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌కు గ్రామ కొండరెడ్లు కృతజ్జతలు తెలిపారు.

మా ఓటు వల్లనే ఊరికి మంచి పేరు
మేమంతా ఓటు వేయడం వల్లనే మా ఊరికి మంచి పేరొచ్చింది. మా ఊరు దేశ ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. మాకు చాలా సంతోషంగా ఉంది.          –సిద్ది శ్రీనివాసరెడ్డి

సానా సంతోషంగా ఉందయ్యా
మేమంతా ఓటెయ్యడం వల్ల ఊరికే పేరు రావడం నాకు సానా సంతోషంగా ఉందయ్యా.. పెద్ద సార్లకు కృతజ్ఞతలు చెబుతున్నా.  – కోళ్ల కన్నమ్మ 

 
Advertisement
 
Advertisement