ఈవీఎంల మొరాయింపు వంటి స్వల్ప ఘటనలు మినహా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: ఈవీఎంల మొరాయింపు వంటి స్వల్ప ఘటనలు మినహా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారీ పోలీస్ బందోబస్తు, వెబ్ కాస్టింగ్ నిఘా వంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించడంతో జిల్లా అధికార యంత్రాంగం సఫలీకృతమైంది.
సగటున 77.14 శాతం పోలింగ్ నమోదైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో జరిగిన ఈ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, చాలా చోట్ల ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరడం, ఈవీఎం మొరాయించి ఓటింగ్ ఆలస్యం కావడం వంటి కారణాలతో సాయంత్రం 5 గంటల తర్వాత కూడా కొనసాగింది.