అనంతగిరి, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజకుమారి సిబ్బందికి సూచించారు. విధులు నిర్వహించేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులకు శనివారం వికారాబాద్ పీఎస్ ఆవరణలో ఎస్పీ పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహిస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ సులభమవుతుందన్నారు. పోలింగ్ విధుల్లో చాకచక్యంగా వ్యవహరించాలని చెప్పారు. పోలింగ్ సిబ్బందితో ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలోంచి తీసుకెళ్లినప్పటి నుంచి వాటిని రిసెప్షన్ సెంటర్‌లో అప్పగించే వరకు బాధ్యతాయుతంగా ఉండాలని తెలిపారు.
అతి సమస్యాత్మకమైనా పోలింగ్ కేంద్రాలకు 5 మంది పోలీసులు, సమస్యాత్మక కేంద్రాల్లో నలుగురు, సాధారణ కేంద్రాల్లో ఇద్దరు చొప్పున విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. వికారాబాద్‌లో విధుల్లో ఉన్న పోలీసులతో పాటు 4 రూట్ మొబైల్ టీంలు, 4 పెట్రోలింగ్ టీంలు, 2 స్ట్రైకింగ్‌లు టీంలు, ఒక స్పెషల్ టీం ఉంటుందన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేసి జనం గుమిగూడకుండా జాగ్రత్త వహించాలన్నారు.
విధుల్లో ఎలాంటి పక్షపాతం వహించరాదని చెప్పారు. పోలింగ్ అధికారులు లోపలికి పిలిస్తేనే వెళ్లాలని సూచించారు. వికలాంగులకు, వృద్ధులకు సాయం చేయాలన్నారు. ఓటర్లతో సౌమ్యంగా మెలగాలని సూచించారు. డీఎస్పీ నర్సింలు, సీఐ లచ్చిరాం నాయక్, విజయలాల, ఎస్‌ఐలు ఉన్నారు.
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
తాండూరు టౌన్: తాండూరు మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె తాండూరులో విలేకరులతో మాట్లాడారు. వికారాబాద్, తాండూరులలో 900 మంది పోలీసులతో పాటు 3 ప్లాటూన్ల సాయుధ బలగాలను ఏర్పాటు చేశామన్నారు. ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు అదనంగా ఉంటారన్నారు.
వికారాబాద్, తాండూరులలో రెండేసి చొప్పున స్ట్రైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. వీరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటారన్నారు. అలాగే తాండూరులో 6, వికారాబాద్‌లో 4 రూట్ మొబైల్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీరు ఈవీఎంలను పోలింగ్ స్టేషన్లకు తీసుకెళ్లి తిరిగి స్ట్రాంగ్ రూంకు తరలిస్తారని చెప్పారు.
తాండూరులో 11, వికారాబాద్‌లో 20 సున్నిత కేంద్రాలు, తాండూరులో 7, వికారాబాద్‌లో 9 అత్యంత సున్నితమైన కేంద్రాలున్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా మొత్తం 15 చెక్ పోస్టులతో పాటు, 7 అంతర్గత చెక్‌పోస్టులను ఏర్పాటుచేసినట్లు ఎస్పీ తెలిపారు. తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.59 లక్షలు స్వాధీనం చేసుకొని 16 కేసులు నమోదు చేశామన్నారు.
3355 మందిని బైండోవర్ చేశామని, గతంలో కంటే ఈసారి 1000 మందిని అదనంగా బైండోవర్ చేసినట్లు ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలుగా తాండూరులో టీఆర్‌సీ(తాండూరు రీక్రియేషన్ క్లబ్), వికారాబాద్‌లో మహవీర్ మెడికల్ కళాశాలను ఎంపిక చే శామన్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.
విధులు అప్రమత్తంగా నిర్వర్తించాలి
Published Sun, Mar 30 2014 2:54 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM
Advertisement
Advertisement