SP raja kumari
-
ఏం రా.. గట్టిగా మాట్లాడుతున్నావ్..
సాక్షి, రాజమహేంద్రవరం: అమరావతి నుంచి గురువారం పోలవరం పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులు అనంతరం విశాఖలో జరుగుతున్న అగ్రిథాన్ సదస్సుకు వెళ్లారు. జిల్లా సరిహద్దైన కాతేరు గామన్ బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై ప్రొటోకాల్ ప్రకారం అర్బన్ జిల్లాలోని వివిధ విభాగాల పోలీసులు కాన్వాయ్‌లతో సాయంత్రం నుంచి వేచి చూస్తున్నారు. ఎస్బీ డీఎస్పీ రామకృష్ణ, ట్రాఫిక్ డీఎస్పీ రమణకుమార్, మరో ఇద్దరు డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్సైలు, 30 మంది కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో ఉన్నారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో గతంలో ఎస్పీ హరికృష్ణ కారు డ్రైవర్‌గా పనిచేసి ప్రస్తుతం వీఐపీ డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణను ట్రాఫిక్ సీఐ బాజీలాల్ పిలిచారు. ఆ సమయంలో కారు పక్కనే ఉన్న సత్యనారాయణ సీఐ పిలుపు విని ‘ఏం.. సార్’ అని గట్టిగా అన్నారు. పలుమార్లు పిలిచి.. అప్పటికే ఆవేశంతో ఉన్న సీఐ బాజీలాల్ ‘‘ఏం గట్టిగా మాట్లాడుతున్నావ్. ఎవరి మీద అరుస్తున్నాం. ఇన్స్పెక్టర్ మీదే అరుస్తావా? ఆఫ్ట్రాల్ కానిస్టేబుల్ గాడివి’’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ఆ సమయంలో వీఐపీ డ్యూటీలో ఎలా ఉండాలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామకృష్ణ ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణకు వివరిస్తున్నారు. ‘నేను ఏమీ అనలేదు సార్.. ఆయనకు వినపడలేదేమో ‘ఏం సార్’ అని అన్నాను అని పేర్కొంటుండగా ‘ఏం రా.. గట్టిగా మాట్లాడుతున్నావ్.. మాటాకు మాట ఎదురు చెబుతున్నావ్’’ అంటూ సీఐ బాజీలాల్ కానిస్టేబుల్ సత్యనారాయణపై పిడిగుద్దులు కురిపించారు. కేకలు, అరుపులతో ఆ ప్రాంతం కొద్దిసేపు మార్మోగింది. అనంతరం అక్కడ ఉన్న కానిస్టేబుళ్లు అందరూ సీఐ బాజీలాల్పై ఎదురుతిరిగారు. వారికి సర్దిచెప్పడానికి డీఎస్పీలకు తలప్రాణం తోకకు వచ్చింది. ఒక వైపు అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వస్తుండగా ఈ ఘటన జరగడంతో ఉన్నతాధికారుల్లో ఆందోళనమొదలైంది. వీఐపీలు వచ్చే అరగంట ముందు ఈ వివాదం జరగడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ వ్యవహారం ఎస్పీ రాజకుమారి దృష్టికి వెళ్లగా కానిస్టేబుల్, సీఐ ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు పోలీసుల వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ‘సాక్షి’ ఎస్పీ రాజకుమారి వివరణ కోసం ఫోన్ చేయగా సస్పెండ్ చేసినట్టు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని తెలిపారు. -
ఉద్రిక్తతకు దారితీసిన దసరావేడుకలు
నాగ్సాన్పల్లిలో ఇరువర్గాల ఘర్షణ రాళ్లదాడిలో ఎస్ఐకి గాయాలు వివరాలు సేకరించిన ఎస్పీ రాజకుమారి బంట్వారం: దసరా వేడుకలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరువర్గాల దాడిలో ఓ ఎస్ఐకి గాయాలయ్యాయి. పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని నాగ్సాన్పల్లిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దసరా పండుగను శాంతియుతంగా జరుపుకొందామని ఎప్పటిమాదిరాగానే శుక్రవారం మధ్యాహ్నం సర్పంచ్ లక్ష్మి గ్రామస్తుల సమక్షంలో తీర్మానం చేశారు. సాయంత్రం 5 గంటలకు గ్రామస్తులు, సర్పంచ్ డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లి జమ్మి చెట్టుకు పూజలు చేసి తిరిగి వచ్చారు. కొద్దిసేపటికి వార్డు సభ్యుడు, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ గడ్డమీది వెంకటయ్య, ఆర్టీసీ కండక్టర్ బుచ్చ య్య పలువురిని వెంటబెట్టుకొని సర్పంచ్ ఇంటికి వెళ్లారు. తమకు తెలియకుండానే జమ్మి చెట్టుకు పూజ లు ఎలా చేస్తావని ఆమెను దూషించారు. సర్పంచ్ వారికి నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది. అక్కడే ఉన్న సర్పంచ్ భర్త మల్లారె డ్డి జోక్యం చేసుకోగా ‘సర్పంచ్‌వి నువ్వు కాదని.. మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావ్’ అంటూ ఆయనను తిట్టారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఎస్సై రవీందర్ సిబ్బందితో నాగ్సాన్పల్లికి చేరుకున్నారు. ఇరువర్గాలకు నచ్చజెప్పే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సర్పంచ్‌కు వంతపాడుతున్నావంటూ ఎస్ఐని గడ్డమీది వెంకటయ్య, బుచ్చయ్య తదితరులు దబాయించారు. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేశారు. దీంతో ఇరువర్గాలకు చెందిన కొందరు పోలీసుల పైకి రాళ్లు రువ్వడంతో ఎస్ఐ రవీందర్ ముక్కుకు తీవ్రగాయాలయ్యాయి. ఘర్షణలో ఆరుగురికి గాయాలవగా వికారాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి 9 గంటలకు వికారాబాద్ డీఎస్పీ నర్సింలు గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ జిల్లా ఎస్పీ రాజకుమారి శనివారం నాగ్సాన్పల్లికి చేరుకొని ఇరవర్గాలతో మాట్లాడి వివరాలు సేకరిం చారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని, గొడవపడడం సరికాదని ఆమె సూచించారు. ఘటన పై దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. నిందితులపై రౌడీషీట్ తెరుస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఇరువర్గాలపై కేసులు నమోదు ఎస్ఐపై దాడి చేసిన గడ్డమీది వెంకటయ్య, బుచ్చ య్య, కావలి అంజయ్యలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ నర్సింలు విలేకరులకు తెలిపారు. ఇరువర్గాల దాడిలో గాయపడ్డ కిరణ్‌కుమార్, అడివయ్య, అనంతయ్య, సిద్దయ్య, ప్రవీణ్‌కుమార్, నరేందర్‌ల ఫిర్యాదు మేరకు సర్పంచ్ భర్త మల్లారెడి ్డతో పాటు అంజిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. శనివారం రాత్రి ముగ్గురు ఎస్ఐలు, 20 మంది పోలీసులు గ్రామంలో పికెట్ నిర్వహించారు. -
ఓట్ల లెక్కింపునకు భారీ బందోబస్తు
తాండూరు, న్యూస్‌లైన్: మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, అర్బన్ సీఐ వెంకట్రామయ్యలకు పలు సూచనలు చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజకుమారి విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌తోపాటు జెడ్పీ మాజీ చైర్పర్సన్ సునీతారెడ్డిలపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. వికారాబాద్ పరిధిలోని గుడిపల్లిలో గత నెల 28న ఎన్నికల ప్రచార సమయం అయిపోయిన తర్వాత రాత్రి సుమారు 8గంటల సమయంలో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ సమావేశం ఏర్పాటుచేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్నారు. తాండూరు మండలంలో ఓ రోడ్డు మీద సమావేశం ఏర్పాటు చేసినందుకు మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు. చేవెళ్ల లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి స్నేహితులు ఇద్దరు కౌకుంట్లలోని ఒక పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారని, వారిపైనా నమోదు చేశామని ఎస్పీ వివరించారు. మొత్తం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద జిల్లాలో 75 కేసులు నమోదు చేశామని, 200మందిని అరెస్టు చేశామన్నారు. దోమ, తాండూరులో ఎన్నికల సందర్భంగా గొడవ పడిన కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టామన్నారు. పోలీసు తనిఖీల్లో భాగంగా సుమారు రూ.70లక్షల నగదును, రూ. ఆరు లక్షల విలువచేసే మద్యంతోపాటు 11వేల లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్లలో మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒక రోజుముందే ఆయా కౌంటింగ్ కేంద్రాలను ఆధీనంలోకి తీసుకొని, బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద వంద మీటర్ల అవతల వాహనాలను పార్కింగ్ చేసుకోవాలన్నారు.తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్లలో ఓట్ల లెక్కింపు కోసం సుమారు వెయ్యి మంది జిల్లా పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం స్ట్రాంగ్ రూంల వద్ద బందోబస్తు చేస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)తోపాటు నాలుగు ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలను అదనంగా బందోబస్తుకు ఉపయోగించనున్నట్టు ఎస్పీ వివరించారు. ఈనెల 12,13 తేదీల్లో మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఆయా పార్టీల నాయకులు, మద్దతుదారులు, అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటుపై నిషేధం విధించామన్నారు. పోలీసుల అనుమతితో ఈనెల 14న విజయోత్సవాలు జరుపుకోవచ్చని చెప్పారు. సమావేశంలో డీఎస్పీ షేక్‌ఇస్మాయిల్, అర్బన్ సీఐ వెంట్రామయ్య, ఎస్ఐ నాగార్జున్‌లు పాల్గొన్నారు. -
విధులు అప్రమత్తంగా నిర్వర్తించాలి
అనంతగిరి, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజకుమారి సిబ్బందికి సూచించారు. విధులు నిర్వహించేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులకు శనివారం వికారాబాద్ పీఎస్ ఆవరణలో ఎస్పీ పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహిస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ సులభమవుతుందన్నారు. పోలింగ్ విధుల్లో చాకచక్యంగా వ్యవహరించాలని చెప్పారు. పోలింగ్ సిబ్బందితో ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలోంచి తీసుకెళ్లినప్పటి నుంచి వాటిని రిసెప్షన్ సెంటర్లో అప్పగించే వరకు బాధ్యతాయుతంగా ఉండాలని తెలిపారు. అతి సమస్యాత్మకమైనా పోలింగ్ కేంద్రాలకు 5 మంది పోలీసులు, సమస్యాత్మక కేంద్రాల్లో నలుగురు, సాధారణ కేంద్రాల్లో ఇద్దరు చొప్పున విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. వికారాబాద్‌లో విధుల్లో ఉన్న పోలీసులతో పాటు 4 రూట్ మొబైల్ టీంలు, 4 పెట్రోలింగ్ టీంలు, 2 స్ట్రైకింగ్లు టీంలు, ఒక స్పెషల్ టీం ఉంటుందన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేసి జనం గుమిగూడకుండా జాగ్రత్త వహించాలన్నారు. విధుల్లో ఎలాంటి పక్షపాతం వహించరాదని చెప్పారు. పోలింగ్ అధికారులు లోపలికి పిలిస్తేనే వెళ్లాలని సూచించారు. వికలాంగులకు, వృద్ధులకు సాయం చేయాలన్నారు. ఓటర్లతో సౌమ్యంగా మెలగాలని సూచించారు. డీఎస్పీ నర్సింలు, సీఐ లచ్చిరాం నాయక్, విజయలాల, ఎస్ఐలు ఉన్నారు. ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు తాండూరు టౌన్: తాండూరు మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె తాండూరులో విలేకరులతో మాట్లాడారు. వికారాబాద్, తాండూరులలో 900 మంది పోలీసులతో పాటు 3 ప్లాటూన్ల సాయుధ బలగాలను ఏర్పాటు చేశామన్నారు. ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు అదనంగా ఉంటారన్నారు. వికారాబాద్, తాండూరులలో రెండేసి చొప్పున స్ట్రైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. వీరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటారన్నారు. అలాగే తాండూరులో 6, వికారాబాద్‌లో 4 రూట్ మొబైల్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీరు ఈవీఎంలను పోలింగ్ స్టేషన్లకు తీసుకెళ్లి తిరిగి స్ట్రాంగ్ రూంకు తరలిస్తారని చెప్పారు. తాండూరులో 11, వికారాబాద్‌లో 20 సున్నిత కేంద్రాలు, తాండూరులో 7, వికారాబాద్‌లో 9 అత్యంత సున్నితమైన కేంద్రాలున్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా మొత్తం 15 చెక్ పోస్టులతో పాటు, 7 అంతర్గత చెక్‌పోస్టులను ఏర్పాటుచేసినట్లు ఎస్పీ తెలిపారు. తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.59 లక్షలు స్వాధీనం చేసుకొని 16 కేసులు నమోదు చేశామన్నారు. 3355 మందిని బైండోవర్ చేశామని, గతంలో కంటే ఈసారి 1000 మందిని అదనంగా బైండోవర్ చేసినట్లు ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలుగా తాండూరులో టీఆర్సీ(తాండూరు రీక్రియేషన్ క్లబ్), వికారాబాద్‌లో మహవీర్ మెడికల్ కళాశాలను ఎంపిక చే శామన్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు. -
దురాచారాలు కొనసాగడం దారుణం
తాండూరు, న్యూస్‌లైన్: హైటెక్ యుగంలో జోగిని వంటి దురాచారాలు కొనసాగడం దారుణం అని ఎస్పీ రాజకుమారి అన్నారు. పెద్దేముల్లో ‘బాలికను జోగిని’గా మార్చినట్లు భావిస్తున్న ఘటనపై సమగ్రంగా విచారణ జరుపుతున్నట్లు ఆమె చెప్పారు. ఎస్పీ సోమవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న నేడు ఇంకా గ్రామాల్లో జోగిని, బాణామతి, తదితర సాంఘిక దురాచారాలు కొనసాగడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఆదివారం పెద్దేముల్లో 12 ఏళ్ల బాలికను 60 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబీకుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. స్థానిక పోలీసులకు ఈ విషయమై సమాచారం అందగానే సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారన్నారు. స్థానిక వీఆర్వో ద్వారా ‘జోగిని’ఘటనపై వివరాలు సేకరించి విచారణ జరుపుతామన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో త్వరలో గ్రామాల్లో దురాచారాల నివారణకు కళాబృందాల ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ చెప్పారు. తాండూరు పట్టణంలో ఆదివారం దంత వైద్యం కోసం వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు శెట్టి బస్వరాజ్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. వైద్యుడిపై అదనంగా నిర్భయ చట్టంతో పాటు 323 సెక్షన్‌ను జతచేస్తామని ఎస్పీ చెప్పారు. వారం, పది రోజుల్లో జిల్లాలో ఎస్ఐల బదిలీలు ఉంటాయన్నారు. బాలికలకు సంబంధించిన ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకే విలేకరులు వార్తలు రాయాలని, ఊహజనిత కథనాలు రాస్తే సంబంధీకులపై కేసు నమోదు చేసేందుకు చట్టాలు ఉన్నాయని ఎస్పీ రాజకుమారి తెలిపారు. పాస్టర్ హంతకులను గుర్తించాం.. వికారాబాద్ సియోన్ చర్చి పాస్టర్ సంజీవులు హత్య కేసులో నిందితులతోపాటు ఘటనకు సంబంధించిన సూత్రదారులను గుర్తించామని ఎస్పీ రాజకుమారి చెప్పారు. త్వరలోనే నిందితుల్ని అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తామన్నారు. యాలాలలోని జిన్నింగ్ ఫ్యాక్టరీలో రైతులకు నకిలీ నోట్ల పంపిణీ వ్యవహారంపై విచారణ జరపాలని తాండూ రు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్‌ను ఎస్పీ ఆదేశించారు. ఫ్యాక్టరీ సంబంధీకుల ఇళ్లలో సోదాలు జరపాలని చెప్పారు. -
ఉల్లి కోసం రైతు హత్య!
నవాబుపేట, న్యూస్‌లైన్: ఆకాశాన్నంటున్న ధరతో సామాన్యులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఉల్లిగడ్డ.. ఓ అమాయక రైతు హత్యకు కారణమైంది. బుధవారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలం కడ్చర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఊరడి ఎల్లయ్య(60) తనకున్న నాలుగెకరాల్లో పత్తి, క్యారెట్, వంగ సాగు చేశాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేసి పొలానికి వెళ్లాడు. పొలం వద్ద ఇదివరకే క్వింటాలు ఉల్లిగడ్డలను విత్తనం కోసమని గడ్డికప్పి దాచి ఉంచారు. దాని పక్కనే ఉన్న చెట్టు కింద ఎల్లయ్య నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు వచ్చి, ఉల్లిగడ్డలను సంచుల్లో నింపుకుంటుండగా ఎల్లయ్య నిద్ర లేచి వారిని అడ్డుకున్నాడు. దీంతో వారు ఎల్లయ్య తలపై కర్రతో గట్టిగా మోదారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో దుండగులు ఉల్లిగడ్డలను అక్కడే వదిలి పారిపోయారు. గురువారం ఉదయం పక్కపొలం రైతులు.. ఎల్లయ్య చనిపోయిన విషయం గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు. భూ తగాదాలే కారణమై ఉండొచ్చు: ఎస్పీ ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాజకుమారి స్పందిస్తూ... భూ తగాదాలే ఎల్లయ్య హత్యకు కారణంగా తాము భావిస్తున్నామని, ఈ మేరకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు మాత్రం ఉల్లిగడ్డల దొంగతనానికి వచ్చిన వారే హత్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారని చెప్పారు. ఈ రెండు కోణాల్లోనూ విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని గురువారం రాత్రి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు.