ఓట్ల లెక్కింపునకు భారీ బందోబస్తు
తాండూరు, న్యూస్‌లైన్: మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, అర్బన్ సీఐ వెంకట్రామయ్యలకు పలు సూచనలు చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజకుమారి విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌తోపాటు జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సునీతారెడ్డిలపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు.
వికారాబాద్ పరిధిలోని గుడిపల్లిలో గత నెల 28న ఎన్నికల ప్రచార సమయం అయిపోయిన తర్వాత రాత్రి సుమారు 8గంటల సమయంలో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ సమావేశం ఏర్పాటుచేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్నారు. తాండూరు మండలంలో ఓ రోడ్డు మీద సమావేశం ఏర్పాటు చేసినందుకు మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు. చేవెళ్ల లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి స్నేహితులు ఇద్దరు కౌకుంట్లలోని ఒక పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారని, వారిపైనా నమోదు చేశామని ఎస్పీ వివరించారు. మొత్తం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద జిల్లాలో 75 కేసులు నమోదు చేశామని, 200మందిని అరెస్టు చేశామన్నారు. దోమ, తాండూరులో ఎన్నికల సందర్భంగా గొడవ పడిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులపై కేసులు పెట్టామన్నారు. పోలీసు తనిఖీల్లో భాగంగా సుమారు రూ.70లక్షల నగదును, రూ. ఆరు లక్షల విలువచేసే మద్యంతోపాటు 11వేల లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు.
తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్లలో మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒక రోజుముందే ఆయా కౌంటింగ్ కేంద్రాలను ఆధీనంలోకి తీసుకొని, బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద వంద మీటర్ల అవతల వాహనాలను పార్కింగ్ చేసుకోవాలన్నారు.తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్లలో ఓట్ల లెక్కింపు కోసం సుమారు వెయ్యి మంది జిల్లా పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం స్ట్రాంగ్ రూంల వద్ద బందోబస్తు చేస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్)తోపాటు నాలుగు ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలను అదనంగా బందోబస్తుకు ఉపయోగించనున్నట్టు ఎస్పీ వివరించారు.
ఈనెల 12,13 తేదీల్లో మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఆయా పార్టీల నాయకులు, మద్దతుదారులు, అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటుపై నిషేధం విధించామన్నారు. పోలీసుల అనుమతితో ఈనెల 14న విజయోత్సవాలు జరుపుకోవచ్చని చెప్పారు. సమావేశంలో డీఎస్పీ షేక్‌ఇస్మాయిల్, అర్బన్ సీఐ వెంట్రామయ్య, ఎస్‌ఐ నాగార్జున్‌లు పాల్గొన్నారు.