తొలి విడతలో వైఎస్‌ఆర్‌సీపీ హవా
సాక్షి ప్రతినిధి, అనంతపురం : మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, రైతులు ఓటుహక్కును వినియోగించుకోవడానికి పోటీపడ్డారు. ఫలితంగా మునిసిపల్ ఎన్నికలకన్నా అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ శాతం పెరగడం.. ప్రధానంగా మహిళలు అధికంగా పోలింగ్‌లో పాల్గొనడం.. గ్రామాల్లో వైఎస్సార్‌సీపీకి ఆదరణ అధికంగా ఉండటంతో తొలి విడత ప్రాదేశిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి స్పీడు స్పష్టంగా కన్పించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లోని జెడ్పీటీసీ స్థానాలు స్వీప్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కళ్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఒకట్రెండు జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే వైఎస్సార్‌సీపీకి టీడీపీ దీటైన పోటీ ఇవ్వగలిగిందని విశ్లేషిస్తున్నారు.
పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. వివరాల్లోకి వెళితే.. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం తొలి విడత గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల్లోని 31 జెడ్పీటీసీ, 437 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. జెడ్పీటీసీసీ స్థానాల్లో 83.01 శాతం, ఎంపీటీసీ స్థానాల్లో 83.11 శాతం ఓట్లు పోలయ్యాయి. మునిసిపల్ ఎన్నికల్లో సగటున 71.49 శాతం ఓట్లు మాత్రమే పోలవ్వడం గమనార్హం.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలతో పల్లెల్లో సింహభాగం ప్రజలు లబ్ధి పొందారు. ప్రధానంగా రైతు, రైతు కూలీ వర్గాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి దన్నుగా నిలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేయగల సత్తా ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో మాత్రమే ఉందని ప్రజానీకం విశ్వసిస్తున్నారు. ఇది సహకార, పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ప్రజలు అదే రీతిలో తీర్పు ఇచ్చారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాయదుర్గం నియోజకవర్గంలోని ఐదు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ స్వీప్ చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాతో ఆ నియోజకవర్గ టీడీపీ కీలక నేతలు కూడా ఏకీభవిస్తుండటం గమనార్హం. ఉరవకొండ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి బలంగా ఉన్న కూడేరు, బెళుగుప్ప మండలాల్లో ఫ్యాన్ గాలి బలంగా వీచింది. వజ్రకరూరు, విడపనకల్లు మండలాల్లో ఓటింగ్ వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఏకపక్షంగా సాగింది.
ఉరవకొండ జెడ్పీటీసీ స్థానంలో ఇరు పక్షాల మధ్య పోటాపోటీగా పోలింగ్ సాగినా.. అంతిమంగా వైఎస్సార్‌సీపీదే విజయమని విశ్లేషిస్తున్నారు. అంటే.. ఉరవకొండ నియోజకవర్గంలో కూడా అన్ని జెడ్పీటీసీ స్థానాలనూ వైఎస్సార్‌సీపీ స్వీప్ చేయబోతోంది. గుంతకల్లు నియోజకవర్గంలో గుత్తి, పామిడి జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలో చేరడం ఖాయం. టీడీపీకీ పట్టున్న గుంతకల్లు మండలంలో ఓటర్లు వైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలిచినట్లు పోలింగ్ సరళి స్పష్టీకరిస్తోంది. గుంతకల్లు జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ-టీడీపీల మధ్య నున్వా-నేనా అన్నట్లుగా పోటీ సాగింది.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయభేరి మోగించడం ఖాయం. కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లుగా సాగింది. పీసీసీ చీఫ్ రఘువీరా ప్రాతినిధ్యం వహిస్తోన్న కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని జెడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదు.మడకశిర నియోజకవర్గంలో గుడిబండ, రొళ్ల జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలో చేరనున్నాయి. అమరాపురం, మడకశిర, అగళి మండలాల్లో వైఎస్సార్‌సీపీ-టీడీపీల మధ్య పోటా నువ్వానేనా అన్నట్లుగా సాగింది.
పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ కంచుకోటలు బీటలు వారక తప్పదని పోలింగ్ సరళి స్పష్టం చేసింది. గోరంట్ల, పెనుకొండ జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం. సోమందేపల్లి, పరిగి మండలాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపు దిశగా సాగుతున్నారు.
రొద్దం మండలంలో మాత్రమే వైఎస్సార్‌సీపీ-టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది.టీడీపీ ఆవిర్భావం నుంచి ఆపార్టీకి దన్నుగా నిలుస్తోన్న హిందూపురంలోనూ ప్రాదేశిక ఎన్నికల్లో ఎదురుగాలి వీచింది. చిలమత్తూరు జెడ్పీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భారీ ఆధిక్యంతో విజయం సాధించడం ఖాయం. హిందూపురం, లేపాక్షి జెడ్పీటీసీ స్థానాల్లో ఇరు పక్షాల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది.