అన్నమో.. హరికిరణ్..
విజయవాడ, న్యూస్‌లైన్ : నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ విధుల్లో పాల్గొన్న కార్మికులు ఆకలి కేకలు పెట్టారు. తెల్లవారుజాము నుంచే పనులు చేయించిన అధికారులు మధ్యాహ్నం భోజనం పెట్టలేమని తెగేసి చెప్పారు. దీంతో కార్మికులు ఆందోళనకు దిగారు. అయినప్పటికీ నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు... అన్న రీతిలో అధికారులు భోజనాలు పెట్టేది లేదని తేల్చి చెప్పేశారు. చేసేదేమీ లేక ఉసూరుమంటూ కార్మికులు ఖాళీ కడుపులతో ఇంటిదారి పట్టారు. వివరాల్లోకి వెళితే... నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు విధులు కేటాయించారు. తెల్లవారుజామున 5.30గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియానికి కార్మికులు చేరుకున్నారు. బ్యాలెట్ బాక్స్‌లు మోసుకెళ్లడం దగ్గర నుంచి వెట్టిచాకిరీ చేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు అధికారులకు భోజనాలు వచ్చాయి. ఆ తరువాత తమకు వస్తాయని కార్మికులు ఆశపడ్డారు. ఎంతకీ భోజనాలు రాకపోవడంతో ఆకలేస్తోందని అధికారుల వద్ద నోరు తెరిచి అడిగారు. ఈ విషయాన్ని నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పి.రత్నావళి, అసిస్టెంట్ సిటీప్లానర్ వి.సునీతలు కమిషనర్ సి.హరికిరణ్ దృష్టికి తీసుకెళ్లారు. ‘కార్మికులకు భోజనాలు పెట్టాల్సిన పనిలేదు. వాళ్లను వెళ్లిపోవాలని చెప్పండి..’ అని హరికిరణ్ బదులిచ్చారు. ఏం చేయాలో తెలియక అధికారులు బిక్క మొహాలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు సమాచార కేంద్రం వద్ద కొద్దిసేపు ఆందోళన చేసినా ఫలితం లేకపోవడంతో ఇంటిదారి పట్టారు. విధుల్లో సుమారు 600 మంది పాల్గొన్నప్పటికీ కేవలం 370 మందికి మాత్రమే భోజనాలు తెప్పించారు. కమిషనర్ తీరుపై ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
అంతా గందరగోళం
నగరపాలక సంస్థ ఎన్నికల ప్రారంభం నుంచి కౌంటింగ్ వరకు అంతా గందరగోళం చోటు చేసుకుంది. కమిషనర్‌కు ఎన్నికల నిర్వహణపై అనుభవం లేకపోవడం, కిందిస్థాయి ఉద్యోగులను నమ్మకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం 8గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ సాయంత్రం 4గంటల వరకు కొనసాగింది. ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఒక్కో రౌండ్ గంట వ్యవధిలో ఓట్ల లెక్కింపు పూర్తి కావాల్సి ఉండగా.. రెండున్నర గంటల సమయం పట్టింది. రిటర్నింగ్ అధికారులు చురుగ్గా పని చేయలేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని మునిసిపాలిటీలతోపాటు పొరుగు జిల్లాల్లోని కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటికీ విజయవాడ ఫలితం వెల్లడిలో జాప్యం చోటుచేసుకుంది. అధికారుల్లో అవగాహనా లోపం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.