ఎమ్మెల్యేను అరెస్టు చేసి తీసుకెళుతున్న పోలీసులు
- అరెస్టు.. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల
వెంకటగిరిటౌన్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నేరుగా పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకుని ఓటర్లను ప్రభావితం చేయడంతో పాటు కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ప్రశ్నించిన ఎన్నికల అధికారులు పోలీసులపై వీరంగం సృష్టించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. పట్టణంలోని బంగారుపేటలోని 1వ వార్డు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తుండటంతో ఆ వార్డులోని పలువురు ఓటర్లు స్థానిక ఎన్నికల అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు.
దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి 2వ వార్డు పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.దీనిపై సీఐ నరసింహరావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోడ్ ఉల్లంఘించడంపై నిలదీశారు. అప్పటికే ఉన్నతాధికారులకు సైతం సమాచారం ఇవ్వడంతో ఏఎస్పీ రెడ్డి గంగాధర్ ప్రత్యేక బలగాలతో ఆ ప్రాంతానికి చేరుకుని ఎమ్మెల్యే తీరుపై వివరణ కోరారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మున్సిపల్ ఎన్నికల అధికారి కె. ప్రమీల ఈ వ్యవహరంపై విచారణ జరిపి ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలో ప్రవేశించడంపై పోలీసులకు లిఖిత పూర్వక పిర్యాదు చేశారు.
దీంతో స్పందించిన ఏఎస్పీ రెడ్డి గంగాధర్ ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పోలీసు వాహనంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెక్షన్ 448, 188 కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అయితే ఎమ్మెల్యే అరెస్టు వ్యవహరాన్ని స్థానిక టీడీపీ నాయకులు చెలికం శంకరరెడ్డి, గంగోటి నాగేశ్వరారావులతో పాటు పలువురు నాయకులు ఖండించారు.