kurugondla Ramakrishna
-
అక్కడ చంద్రబాబే నిప్పు రాజేస్తున్నారా..?
ఆ నియోజకవర్గ టీడీపీలో చంద్రబాబే నిప్పు రాజేస్తున్నారా..? వచ్చే ఎన్నికల్లో టికెట్ నీకే అంటూ ఆ ఇద్దరి నేతలని ఆయన మభ్యపెడుతున్నారా? గత ఎన్నికల్లో ఆ నియోజక వర్గంలో టీడీపీ గల్లంతు అయినా.. చంద్రబాబు వ్యవహార శైలి మారకపోవడంపై అక్కడి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏదా నియోజక వర్గం..? ఆ ఇద్దరు నేతలు ఎవరు..? గత అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ అడ్రస్ గల్లంతయింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ఘోరంగా ఓడిపోయారు.ఓటమిని జీర్ణించుకోలేని కురుగొండ్ల రామకృష్ణ తట్టా బుట్టా సర్దుకుని చెన్నైకు వెళ్ళిపోయారు. దీంతో టీడీపీ క్యాడర్లో తీవ్ర నిరాశ నెలకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకే టికెట్ దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు.. మరో బీసీ నేత మస్తాన్ యాదవ్ ఎవరికివారే చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తమకే మాట ఇచ్చారని ఇద్దరు నేతలూ చెప్పుకుంటున్నారు. 2009.. 2014 ఎన్నికల్లో టీడీపీ తరవున పోటీచేసి గెలుపొందారు కురుగొండ్ల రామకృష్ణ. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చెన్నైలో వ్యాపారాలపై దృష్టి పెట్టారు కురుగొండ్ల. సమయం దొరికినప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ కేడర్ కలుస్తున్నారు. కురుగొండ్లకు టికెట్ ఇస్తే.. వెంకటగిరిలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని ఆయన వ్యతిరేక వర్గంవారు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయని గుర్తుచేస్తున్నారు. కాంట్రాక్టర్లను బెదిరించడం, ఎర్రచందనం అక్రమ రవాణా, తనకు అనుకూలంగా వ్యవహరించని అధికారులపై విరుచుకుపడటంలాంటి కురుగొండ్ల వ్యవహార శైలిని వ్యతిరేకవర్గంవారు ప్రస్తావిస్తున్నారు. నెల్లూరు జడ్పీ ఎన్నికలలో ఏకంగా కలెక్టర్‌పైనే దాడికి ప్రయత్నించడం.. మైకు విసిరేసి..ఎన్నికలకు సంబంధించిన పత్రాలను చించేయడం లాంటి వ్యవహారాలతో చెడ్డ పేరు తెచ్చుకున్నారనీ వ్యతిరేక వర్గం నేతలు చెబుతున్నారు. పార్టీ కంటే సొంతప్రయోజనాల కే కురుగొండ్ల ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారని సొంతపార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణకు టికెట్ ఇస్తే పార్టీ గెలుపు అంత సులువుకాదని చాలామంది నేతలు.. టీడీపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారట.రామకృష్ణకు టికెట్ వచ్చే అవకాశం లేదని.. కొత్త అభ్యర్థిని రంగం లోకి దించుతామని అధిష్టానమే చెప్పిందని కురుగొండ్ల వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. మరోవైపు.. హైదరాబాదులో డాక్టర్‌గా ఉన్న మస్తాన్ యాదవ్ ఈసారి వెంకటగిరి నుంచి ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నారట. చదవండి: బాబు, పవన్‌లపై లెఫ్ట్ నేతల ఆగ్రహానికి కారణం ఏంటి? వెంకటగిరికి స్థానికుడు కావడం.. తనకు అవకాశం ఇప్పించాలని.. హై రికమెండేషన్‌తో చంద్రబాబు ను సైతం కలిశారట మస్తాన్ యాదవ్. ‘‘తమ్ముడూ.. గో హెడ్ అని’’ చంద్రబాబు తనకు హామీ ఇచ్చినట్టు మస్తాన్ యాదవ్ తన అనుచరులు దగ్గర చెప్పుకుంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ నిస్తేజంగా మారింది. దీనికితోడు రామకృష్ణ, మస్తాన్ యాదవ్ మధ్య మరింత అగాథాన్ని పెంచింది చంద్రబాబేనని టీడీపీ క్యాడరే చర్చించుకుంటోంది. టికెట్‌పై చంద్రబాబు హామీ ఇచ్చారని ఇద్దరు నేతలు బహిరంగంగా చెప్పుకోవడంతో క్యాడర్ అయోమయంలో పడిందంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడంపై కూడా అంతర్గత సమావేశాల్లో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టిక్కెట్ గనక మరోసారి కురుగొండ్లకిస్తే టీడీపీ ఓడిపోవడం ఖాయమని.. అలా కాదని కొత్తవారికి అవకాశమిస్తే క్యాడర్ మొత్తం వైసీపీలోకి వెళ్లే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మొత్తానికి చంద్రబాబు రాజకీయం వెంకటగిరి టీడీపీలో రచ్చ రచ్చగా మారింది. చదవండి: జగజ్జనని చిట్ ఫండ్స్.. ఆదిరెడ్డి అప్పారావు, వాసు అరెస్ట్ -
‘రామకృష్ణ! ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’
సాక్షి, విజయవాడ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రభుత్వ ఉద్యోగిపై చేసిన బూతు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎమ్మెల్యే రామకృష్ణ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఉద్యోగిపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే రామకృష్ణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామకృష్ణ నోరుపారేసుకున్న ఉద్యోగికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రామకృష్ణ చెన్నైకు దొంగ సరుకు రవాణా చేస్తున్నారని, ఆయన అవినీతి పరుడు.. దొంగ వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలు పన్ను ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆయన లాగా అవినీతి పరులు కాదన్నారు. రామకృష్ణ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. ఎన్నికల్లో అప్పటికప్పుడు 45 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నారని తెలిపారు. వారందరికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇవ్వాలని.. చిత్తూరు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇద్దరు కలెక్టర్లపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇవ్వాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొంత మంది అధికారులు అధికార పార్టీకి తాబేదారుల్లా పని చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారానికి ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇవ్వాలని, లేదంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తేల్చిచెప్పారు. చదవండి: ‘రేయ్.. నీ అంతు చూస్తా’ : టీడీపీ ఎమ్మెల్యే -
‘రేయ్.. నీ అంతు చూస్తా’ : టీడీపీ ఎమ్మెల్యే
వెంకటగిరి (నెల్లూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వ్యవహార శైలి ఏ మాత్రం మారలేదు. గతంలో సైదాపురం మండలంలో టీడీపీ నేతలకు మరుగుదొడ్లు, పింఛన్లు ఇవ్వాలని అధికారులపై తిట్ల దండకంతో విరుచుకుపడిన ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అది మరువకముందే రాపూరు ఉపాధి హామీ బే ఫుడ్ టెక్నికల్ అసిస్టెంట్ (బీఎఫ్‌టీఏ) వి.రామకృష్ణకు గురువారం ఉదయం ఫోన్ చేసి పోస్టల్ బ్యాలెట్ విషయమై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక దశలో అసభ్య పదజాలంతో దూషించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల, ఉపాధి హామీ ఉద్యోగి మధ్య సాగిన ఫోన్ సంభాషణ ఇదీ.. ఉద్యోగి: సార్.. సార్.. ఎమ్మెల్యే: రేయ్.. నేను రా.. నీకు కూడు పెట్టింది. లం.. కొడకా. కూడు పెట్టినోడికి ఈ పని చేస్తావా? అందరినీ గుంపుగా పెట్టి మాట్లాడి అందరివీ ఇప్పిస్తావా (పోస్టల్ బ్యాలెట్లు).. వాళ్లకి? ఉద్యోగి: సార్.. సార్.. అది తప్పు సార్. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే: రేయ్.. నీ కథ నేను చూస్తారా. నీ అంతు చూస్తారా. వచ్చే గవర్నమెంట్ మాదే. నిలువునా.. నిలువునా నీ తాట తీస్తా. నీ అంతు చూస్తా. మొత్తం రాసిపెట్టాలే. ఐదు సంవత్సరాలు మేం ఉద్యోగం ఇచ్చి.. సాకితే మాకే ద్రోహం చేస్త్రారా మీరు. కడుపులో భయం ఉన్న వాళ్లయితే ఎవరికి ఇవ్వాలా. కడపులో భయం ఉందా నీకు? ఉద్యోగి: నిజం సార్. నాకు తెలీదు. ఎమ్మెల్యే: అబద్ధం చెప్పావంటే మెట్టుతో (చెప్పుతో) కొట్టేస్తా. నీకు ఇప్పుడు తెలియదులే.. తెలిసేరోజు తెలుస్తాదిలే. ఉద్యోగి: సార్.. సార్ ఒక్కరైనా నా దగ్గర ఇచ్చారని చెప్పమనండి సార్. నాకు నిజంగా తెలియదు సార్. ఎమ్మెల్యే: ఉండవురా నువ్వు. రేపు ఉండవు నువ్వు. నీకు ఎవరు ఇచ్చారో డైరెక్షన్ నీ అంతు చూస్తా. వాడికి బుద్ధి లేదు. నడమంత్రపు చావు చస్త్రారా మీరు. చూస్తాలే మీ కథ. నీవు ఏమేం చేస్తావో అంతా తెలుసు నాకు. అంతా పెట్టిస్తా. మీ అంతు చూస్తా. రేయ్.. రేపు ఉదయం రారా వెంకటగిరికి.. రేపు ఉదయం రా. ఉద్యోగి: సరే సార్! ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వినతి తన పోస్టల్ బ్యాలెట్‌తోపాటు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారి పోస్టల్ బ్యాలెట్లు తెచ్చివ్వకపోతే అంతు చూస్తానని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తనను ఫోన్లో బెదిరిస్తున్నారంటూ ఉపాధి హామీ ఉద్యోగి వి.రామకృష్ణ గురువారం వెంకటగిరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈఎస్ మురళికి నెల్లూరులో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ గురువారం ఉదయం 10.44 గంటల సమయంలో ఎమ్మెల్యే రామకృష్ణ తనకు ఫోన్ చేశారని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లు తెచ్చివ్వకపోతే శాఖాపరంగా అక్రమ కేసుల్లో ఇరికిస్తానని, అంతు చూస్తానని బెదిరించారని తెలిపారు. ఎమ్మెల్యే రామకృష్ణ రౌడీయిజం, గూండాయిజం, స్మగ్లింగ్ వంటి అనేక క్రిమినల్ కేసుల్లో నిందితుడని, తనకు ఆయన నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై పోలీస్ చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఇదిలావుండగా.. ఎమ్మెల్యే కురుగొండ్ల, ఉద్యోగిని బెదిరించిన ఫోన్‌కాల్ గురువారం సోషల్ మీడియాలో హల్చల్ చేయగా, పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. -
కృష్ణ రహస్యం!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికలు సమీపస్తున్న తరుణంలో గుట్టుచప్పుడు కాకుండా రూ. 240 కోట్లతో చేపట్టే డక్కిలి మండలం ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బుధవారం హడావుడిగా భూమిపూజ నిర్వహించారు. భూమి పూజకు సంబంధించి నాయకులకు సమాచారం ఇవ్వకుండానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల నుంచి ఆల్తూరుపాడులో రిజర్వాయర్ తీసుకొస్తామని చెబుతున్న ఎమ్మెల్యే ఇన్నాళ్లు మౌనంగా ఉండి.. ఇప్పుడీ హడావుడి వెనుక కృష్ణ రహస్యం ఉందనే ప్రచారం జరుగుతోంది. పనులు ఎవరికోకరికి అప్పగించి కమీషన్ జేబులో వేసుకోవడానికేనని ప్రచారం జరుగుతోంది. రూ. 240 కోట్లతో రిజర్వాయర్ పనులు చేపట్టాలని ఇటీవల సీఎం చంద్రబాబునాయుడుతో ఎమ్మెల్యే రామకృష్ణ చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆల్తూరుపాడు రిజర్వాయర్‌తో పాటు కండలేరు– పూండి కాలువ నుంచి రిజర్వాయర్‌కుఎత్తిపోతల పథకం ద్వారా నీటిని నిల్వ చేసే పనుల కోసం రూ.110 కోట్లతో మరో ప్యాకేజీ పనులను ప్రభుత్వ ఆమోదించినట్లు అధికారులు చెబుతున్నారు. సీఎం, మంత్రులు లేకుండానే భూమి పూజా? ఆల్తూరుపాడులో రూ.240 కోట్లతో పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రామకృష్ణ భూమి పూజను పూర్తి చేయడం ఏమిటీ అని టీడీపీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు సీఎంతో కానీ, జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఇన్చార్జి మంత్రి ఉన్నా..వారితో కాకుండా ఎమ్మెల్యే స్వయంగా శంకుస్థాపన చేయడంపై అధకార పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. రిజర్వాయర్ పనుల శంకుస్థాపన చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు వస్తారని ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉంది. అయితే హడావుడిగా సీఎం చంద్రబాబునాయుడు లేకుండానే బుధవారం ఎమ్మెల్యే రామకృష్ణ, ఆయన వియ్యంకుడు, పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ కుటుంబ సమేతంగా వచ్చి భూమి పూజ చేశారు. కోట్లాది రూపాయిల ప్రభుత్వ నిధులతో చేపట్టే రిజర్వాయర్ పనుల భూమి పూజా కార్యక్రమానికి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించలేదు. చేయని పనులు, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేశామని ప్రభుత్వం చెప్పి కోట్లు ఖర్చు పెట్టి మరీ పబ్లిసిటీ చేస్తున్న తరుణంలో ఎవరికీ చెప్పకుండా చేయడంపై చర్చగా మారింది. కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుగంగ అధికారులు, ఎమ్మెల్యే అనుచరులు సెల్ఫోన్లు సైతం ఎమ్మెల్యే కోటరీగా వ్యవహరించే పలువురు తీసుకోవడం గమనార్హం. ఒక దశలో ఇరిగేషన్ శాఖ అధికారులు తమ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్న లక్ష్యంతో ఫొటోలను పంపాలని భావించినా ఎమ్మెల్యే రామకృష్ణ వారి ఫోన్లు తీసుకోవడంతో సమాచారం ఇవ్వలేకపోయారు. కొంతమంది ఫొటోలు తీయాలని ప్రయత్నించినా ఎమ్మెల్యే రామకృష్ణ ససేమిరా అన్నట్లు తెలిసింది. -
కౌన్సిలర్లే అవినీతి పరులు
ఎమ్మెల్యే కురుగొండ్ల వివాదాస్పద వ్యాఖ్యలు వెంకటగిరి: వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్లు తమ పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్లకే అందాయని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. శనివారం ఆయన పట్టణంలోని పాలకేంద్రం సెంటర్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికలు, టీవీ చానళ్లలో తనను అవినీతి పరుడిగా చిత్రిస్తూ వచ్చిన కథనాలపై ఆయన ఘాటుగా స్పందించారు. నాలుగేళ్లలో వెంకటగిరిలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని, వీటికి సంబంధించి కాంట్రాక్టర్ల నుంచి తానేమీ తీసుకోలేదన్నా రు. అనంతరం అక్కడే ఉన్న మున్సిపల్ కాంట్రాక్టర్ సుబ్రహ్మణ్యంనాయుడుతో కమీషన్లు తీసుకున్న వ్యక్తుల పేర్ల చెప్పాలని హుకుం జారీ చేశారు. దీంతో సుబ్రహ్మణ్యంనాయుడు తటపటాయిస్తూ కౌన్సిల ర్లు, చైర్పర్సన్లకు కమీషన్లు ఇచ్చానని వెల్లడించారు. కాగా ఎవరెంత తీసుకున్న విషయాన్ని త్వరలో తేల్చేస్తానని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. అయితే అక్కడే ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, పలువురు కౌన్సిలర్లు మిన్నకుండిపోయారు. ‘సాక్షి’పై అక్కసు ‘సాక్షి’ టీవీలో గురువారం ప్రసారమైన ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కథనం, ‘సాక్షి’ దినపత్రికలో నీరు–చెట్టు పథకంలో జరి గిన అవినీతిపై వస్తున్న కథనాలపై ఎమ్మె ల్యే అక్కసు వెళ్లగక్కారు. తప్పు జరిగి ఉంటే తనను ప్రశ్నించాలన్నారు. కార్యక్రమంలో వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ పులి కొల్లు రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సి.గంగాప్రసాద్, కౌన్సిలర్ పి.విశ్వనాథ్, ఆవుల ప్రహ్లాద, కె.చెంగారావ్, కె.రమేష్, ఎం.బాబు పాల్గొన్నారు. -
మొహం చాటేసిన టీడీపీ ఎమ్మెల్యే
-
మొహం చాటేసిన టీడీపీ ఎమ్మెల్యే
నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణ ‘ఎల్లో ట్యాక్స్’ వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికార టీడీపీ ఆత్మరక్షణలో పడింది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ నేతలతో రోజంతా మంతనాలు జరిపారు. తర్వాత పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రామకృష్ణ ప్రెస్ మీట్ ఉంటుందని మీడియాకు సమాచారం ఇచ్చారు. ముందుచెప్పినట్టు పార్టీ ఆఫీసులో కాకుండా హోటల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే విలేకరుల సమావేశానికి రామకృష్ణ మొహం చాటేశారు. చివరకు మాంటెకార్లో కంపెనీ మాజీ ఉద్యోగి రామును మీడియా ముందుకు తీసుకొచ్చారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తంటాలు పడ్డాడు. ఫోన్ ఆడియోలో ఉన్న గొంతు తనదేనని ఒప్పుకున్నాడు. ఓబులవారిపల్లి-కృష్ణపట్నం రైల్వే లైన్ నిర్మాణం పనులకు రూ.5 కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే రామకృష్ణ బెదిరించినట్టు మాంటెకార్లో కంపెనీ ప్రతినిధులు సోమవారం వెల్లడించారు. ఎమ్మెల్యే బెదిరింపుల ఆడియో సీడీలు మీడియాకు విడుదల చేశారు. ఎమ్మెల్యే దాష్టీకంపై రైల్వే మంత్రికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోయారు. రంగంలోకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎల్లో ట్యాక్స్ దందాపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. ఓబులవారిపల్లి-కృష్ణపట్నం రైల్వే లైన్ నిర్మాణం పనులు నిలిచిపోవడంపై ఆరా తీసింది. ఎమ్మెల్యే రామకృష్ణ రూ. 5 కోట్ల లంచం డిమాండ్ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ వివరాలు సేకరించింది. మాంటెకార్లో కంపెనీ ప్రతినిధులతో ఇంటెలిజెన్స్ అధికారులు మాట్లాడినట్టు సమాచారం. -
ఎమ్మెల్యే కురుగొండ్ల కోసం పోలీసుల గాలింపు
నెల్లూరు: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వీరంగం సృష్టించిన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన ఆయనపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆదివారం నెల్లూరులోని ఆయన నివాసంలో గాలించారు. అయితే ఈ విషయం ముందే తెలుసుకున్న ఆయన అప్పటికే హైదరాబాద్ చేరుకోవడంతో పోలీసులు వెనుదిరిగారు. కేసు నమోదైన సమయంలో ఎమ్మెల్యే నెల్లూరులో ఉన్నా పట్టించుకోని పోలీసులు తీరా ఆయన హైదరాబాద్ వెళ్లిన 15 గంటల తర్వాత ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం గమనార్హం. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ దౌర్జన్యానికి దిగారు. కలెక్టర్ ఎదుట ఉన్న మైకును తోసివేసి, నామినేషన్, ప్రమాణ స్వీకార పత్రాలను చించివేశారు. -
'కన్నకూతురు ఉసురు తగలక తప్పదు'
బాలాయపల్లి : రెండో భార్య మెప్పు కోసం ఆడబిడ్డ అని కూడా చూడకుండా చదువుకునే వయసులో కట్టుబట్టలతో వదిలించుకుని, న్యాయంగా దక్కాల్సిన ఆస్తిని కాజేసి తన కన్నీటికి కారణమైన తన తండ్రితో పాటు సవతి తల్లి సింధుకు తన ఉసురు తప్పదని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె కవిత అన్నారు. నెల్లూరు జిల్లా యాచవరంలో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రావి దేవికాచౌదరితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తన సవతి తల్లి సింధు ఇంట్లో పనిమనిషిని నిలిపివేయించి, ఆ పనులు తనతో చేయిస్తూ పని మనిషి కంటే హీనంగా చూసినా సహించానని తెలిపారు. డబ్బు, అధికార బలంతో తనకు అన్యాయం చేసినా దేవుడి ముందు మాత్రం వాళ్లు తప్పించుకోలేరన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దేవికా చౌదరి ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. -
పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే వీరంగం
- అరెస్టు.. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల వెంకటగిరిటౌన్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నేరుగా పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకుని ఓటర్లను ప్రభావితం చేయడంతో పాటు కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ప్రశ్నించిన ఎన్నికల అధికారులు పోలీసులపై వీరంగం సృష్టించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. పట్టణంలోని బంగారుపేటలోని 1వ వార్డు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తుండటంతో ఆ వార్డులోని పలువురు ఓటర్లు స్థానిక ఎన్నికల అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి 2వ వార్డు పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.దీనిపై సీఐ నరసింహరావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోడ్ ఉల్లంఘించడంపై నిలదీశారు. అప్పటికే ఉన్నతాధికారులకు సైతం సమాచారం ఇవ్వడంతో ఏఎస్పీ రెడ్డి గంగాధర్ ప్రత్యేక బలగాలతో ఆ ప్రాంతానికి చేరుకుని ఎమ్మెల్యే తీరుపై వివరణ కోరారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మున్సిపల్ ఎన్నికల అధికారి కె. ప్రమీల ఈ వ్యవహరంపై విచారణ జరిపి ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలో ప్రవేశించడంపై పోలీసులకు లిఖిత పూర్వక పిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఏఎస్పీ రెడ్డి గంగాధర్ ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పోలీసు వాహనంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెక్షన్ 448, 188 కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అయితే ఎమ్మెల్యే అరెస్టు వ్యవహరాన్ని స్థానిక టీడీపీ నాయకులు చెలికం శంకరరెడ్డి, గంగోటి నాగేశ్వరారావులతో పాటు పలువురు నాయకులు ఖండించారు.