
ఎమ్మెల్యే కురుగొండ్ల కోసం పోలీసుల గాలింపు
నెల్లూరు: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వీరంగం సృష్టించిన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన ఆయనపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆదివారం నెల్లూరులోని ఆయన నివాసంలో గాలించారు. అయితే ఈ విషయం ముందే తెలుసుకున్న ఆయన అప్పటికే హైదరాబాద్ చేరుకోవడంతో పోలీసులు వెనుదిరిగారు.
కేసు నమోదైన సమయంలో ఎమ్మెల్యే నెల్లూరులో ఉన్నా పట్టించుకోని పోలీసులు తీరా ఆయన హైదరాబాద్ వెళ్లిన 15 గంటల తర్వాత ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం గమనార్హం. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ దౌర్జన్యానికి దిగారు. కలెక్టర్ ఎదుట ఉన్న మైకును తోసివేసి, నామినేషన్, ప్రమాణ స్వీకార పత్రాలను చించివేశారు.