రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం ఇస్తున్న ఉపాధి హామీ బీఎఫ్‌టీఏ రామకృష్ణ
వెంకటగిరి (నెల్లూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వ్యవహార శైలి ఏ మాత్రం మారలేదు. గతంలో సైదాపురం మండలంలో టీడీపీ నేతలకు మరుగుదొడ్లు, పింఛన్లు ఇవ్వాలని అధికారులపై తిట్ల దండకంతో విరుచుకుపడిన ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అది మరువకముందే రాపూరు ఉపాధి హామీ బే ఫుడ్ టెక్నికల్ అసిస్టెంట్ (బీఎఫ్‌టీఏ) వి.రామకృష్ణకు గురువారం ఉదయం ఫోన్ చేసి పోస్టల్ బ్యాలెట్ విషయమై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక దశలో అసభ్య పదజాలంతో దూషించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల, ఉపాధి హామీ ఉద్యోగి మధ్య సాగిన ఫోన్ సంభాషణ ఇదీ..
ఉద్యోగి: సార్.. సార్..
ఎమ్మెల్యే: రేయ్.. నేను రా.. నీకు కూడు పెట్టింది. లం.. కొడకా. కూడు పెట్టినోడికి ఈ పని చేస్తావా? అందరినీ గుంపుగా పెట్టి మాట్లాడి అందరివీ ఇప్పిస్తావా (పోస్టల్ బ్యాలెట్లు).. వాళ్లకి?
ఉద్యోగి: సార్.. సార్.. అది తప్పు సార్. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
ఎమ్మెల్యే: రేయ్.. నీ కథ నేను చూస్తారా. నీ అంతు చూస్తారా. వచ్చే గవర్నమెంట్ మాదే. నిలువునా.. నిలువునా నీ తాట తీస్తా. నీ అంతు చూస్తా. మొత్తం రాసిపెట్టాలే. ఐదు సంవత్సరాలు మేం ఉద్యోగం ఇచ్చి.. సాకితే మాకే ద్రోహం చేస్త్రారా మీరు. కడుపులో భయం ఉన్న వాళ్లయితే ఎవరికి ఇవ్వాలా. కడపులో భయం ఉందా నీకు?
ఉద్యోగి: నిజం సార్. నాకు తెలీదు.
ఎమ్మెల్యే: అబద్ధం చెప్పావంటే మెట్టుతో (చెప్పుతో) కొట్టేస్తా. నీకు ఇప్పుడు తెలియదులే.. తెలిసేరోజు తెలుస్తాదిలే.
ఉద్యోగి: సార్.. సార్ ఒక్కరైనా నా దగ్గర ఇచ్చారని చెప్పమనండి సార్. నాకు నిజంగా తెలియదు సార్.
ఎమ్మెల్యే: ఉండవురా నువ్వు. రేపు ఉండవు నువ్వు. నీకు ఎవరు ఇచ్చారో డైరెక్షన్ నీ అంతు చూస్తా. వాడికి బుద్ధి లేదు. నడమంత్రపు చావు చస్త్రారా మీరు. చూస్తాలే మీ కథ. నీవు ఏమేం చేస్తావో అంతా తెలుసు నాకు. అంతా పెట్టిస్తా. మీ అంతు చూస్తా. రేయ్.. రేపు ఉదయం రారా వెంకటగిరికి.. రేపు ఉదయం రా.
ఉద్యోగి: సరే సార్!
ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వినతి
తన పోస్టల్ బ్యాలెట్‌తోపాటు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారి పోస్టల్ బ్యాలెట్లు తెచ్చివ్వకపోతే అంతు చూస్తానని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తనను ఫోన్‌లో బెదిరిస్తున్నారంటూ ఉపాధి హామీ ఉద్యోగి వి.రామకృష్ణ గురువారం వెంకటగిరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈఎస్ మురళికి నెల్లూరులో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ గురువారం ఉదయం 10.44 గంటల సమయంలో ఎమ్మెల్యే రామకృష్ణ తనకు ఫోన్ చేశారని పేర్కొన్నారు.
పోస్టల్ బ్యాలెట్లు తెచ్చివ్వకపోతే శాఖాపరంగా అక్రమ కేసుల్లో ఇరికిస్తానని, అంతు చూస్తానని బెదిరించారని తెలిపారు. ఎమ్మెల్యే రామకృష్ణ రౌడీయిజం, గూండాయిజం, స్మగ్లింగ్ వంటి అనేక క్రిమినల్ కేసుల్లో నిందితుడని, తనకు ఆయన నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై పోలీస్ చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఇదిలావుండగా.. ఎమ్మెల్యే కురుగొండ్ల, ఉద్యోగిని బెదిరించిన ఫోన్‌కాల్ గురువారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేయగా, పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment