సాక్షి,రాజంపేట: రాజంపేటలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని దిగుమతి చేసుకోవడం వల్లే అతనికి ఆశించినంత స్థాయిలో బలిజలు మద్దతు పలకడంలేదని కాపునేత, సీనియర్‌న్యాయవాది కృష్ణకుమార్ ఆరోపించారు. ఆదివారం తన స్వగృహంలో కాపుసామాజిక వర్గానికి చెందిన నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీకి బలిజలు మద్దతు తెలపకపోవడంతో ఆ కుల ఓట్లు తక్కువగా ఉన్నట్లుగా పచ్చపత్రికల్లో రాయడం సరికాదన్నారు. నిజాలు తెలుసుకొని రాయలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కేవలం బలిజ, కాపు ఉపకులాలతో అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాపు ఓట్లు లేనిదే టీడీపీకి దిక్కులేదన్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బలిజ ఓటర్లు సగం జనసేన వైపు, మిగిలిన సగం వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచారన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పచ్చపార్టీలు తమ పత్రికల్లో బలిజ కులస్తులు తక్కువగా ఉన్నారని చూపించడం సహించలేనిది అన్నారు. రాజంపేట నియోజకవర్గంలో బలిజ కులస్తులు 26వేలు మాత్రమే ఉన్నట్లు ఓ పత్రికలో రాయడాన్ని ఆయన తప్పుపట్టారు. రాజంపేటటౌన్, మండలం కలిపి 15వేలు, నందలూరులో 8వేలు, ఒంటిమిట్టలో 4వేలు, సిద్దవటంలో 5వేలు , సుండుపల్లెలో 8వేలు, వీరబల్లిలో 3వేల ఓట్లు మొత్తం 42వేల బలిజ ఓట్లు ఉన్నాయన్నారు.
రాజకీయ ఉద్దేశంతో తగ్గించి రాయడం చూస్తుంటేకాపు కులాన్ని కించపరిచడమే అవుతుందన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బలిజ కులస్తులు ఎక్కువ భాగం వైఎస్సార్‌సీపీ వెంట ఉన్నందు వల్లే ఇలా రాయడం అవివేకమన్నారు. టీడీపీ ఎన్ని గిమ్మిక్కులు చేసినా రాజంపేటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని, అలాగే రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం, జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యమని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment