
సాక్షి, రాజంపేట: రాజంపేటలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా అనే అనుమానాలు ఓటర్లలో వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా రాజంపేట నియోజకవర్గంలో స్థానికేతరులు భారీగా చొరబడినట్లు ప్రచారం జరుగుతోంది. పక్క నియోజకవర్గమైన రైల్వేకోడూరు నుంచి గత నెల నుంచి రాజంపేట టౌన్, నందలూరుతో వివిధ మండలాల్లో ఒక వర్గం చేరినట్లు తెలుస్తోంది. ఈ వర్గం ప్రతినిధుల కనుసన్నల్లోనే డబ్బు, మద్యం యథేచ్ఛగా పంపిణీ జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల (ఓ సామాజికవర్గం) అధికారులు పెద్దగా దృష్టి సారించలేదన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రతిపక్షపార్టీకి చెందిన వారినే టార్గెట్ చేసుకొనే ఆకస్మికదాడులు, కేసులో బనాయిస్తున్నారనే అపవాదును ఇప్పటికే పోలీసులు మూటకట్టుకున్నారు. అధికారపార్టీవైపు వారు కన్నెత్తిచూడటంలేదన్న విమర్శలున్నాయి.
నాన్‌లోకల్‌తోపాటు అసాంఘికశక్తులు దిగిపోయారా?
పక్క నియోజకవర్గం నుంచి స్థానికేతరులతోపాటు అసాంఘికశక్తులు వచ్చారనే ప్రచారాలు ఓటర్లను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతి మండలంలో స్ధానికేతరులతో పాటు అసాంఘికశక్తులు రంగంలో ఇప్పటికే దిగిపోయినట్లు తెలుస్తోంది. ఓవర్గంతో కలిసిపోవడమే కాకుండా అధికారపార్టీ నాయకుల అండదండలతో స్థ్ధానికంగా పెత్తనం సాగిస్తున్నారు. పోలింగ్ రోజున ఎటువంటి దుశ్చర్యలకు దిగుతారో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో కర్ణాటక నుంచి అక్రమమద్యం దిగుమతి చేసిన తరహాలో ఈసారి కూడా రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారులు స్ధానికంగానే మద్యం సరఫరాపై దృష్టి సారించారు. కానీ కర్ణాటక నుంచి తెప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న వైనాలపై దృష్టి సారించాల్సి ఉంది.
నియోజకవర్గంలో స్ధానికేతరుల ఓటర్ల నమోదుపై అనుమానాలు..
పొరుగు ప్రాంతాలకు చెందిన స్ధానికేతరులు అధికారపార్టీకి అండగా నిలిచేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజంపేటలో నాన్‌లోకల్ అరాచకశక్తులు చెలరేగిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే భయం స్ధానికుల్లో నెలకొంది. రెండువేల నుంచి మూడు వేల వరకు స్ధానికేతరులను కొంతమంది రెవెన్యూ సిబ్బంది సహకారంతోఓటర్లుగా చేర్చినట్లు ఎన్నికల సంఘాలకు ఫిర్యాదులు వెళ్లాయి. వీరు ఓటింగుకు వచ్చిన సందర్భంలో బూత్‌లలో అభ్యంతరాలు వ్యక్తమయ్యే పరిస్ధితుల్లో ఘర్షణలకు దారితీసే అవకాశముందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎన్నికల సంఘం, పోలీసుశాఖ దృష్టి సారించాలని, వెనువెంటనే ఈ విషయంపై జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ దృష్టి సారించాలని ఓటర్లు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment