ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెల 12న ఏలూరు కార్పొరేషన్, ఏడు మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా జిల్లాలోని మునిసిపల్ కమీషనర్లతో ఆయన కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు.
ప్రతి కౌంటింగ్ సెంటరులో లెక్కింపు నిర్వహణకు అన్ని ఏర్పాట్లను ఆయా మునిసిపల్ కమిషనర్లు ముందుగానే పూర్తి చేసుకోవాలన్నారు. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది ఉదయం 5 గంటలకే కౌంటింగ్ సెంటర్‌కు హాజరు కావాలన్నారు. వారి సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ చేపట్టి ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని చెప్పారు.
కౌంటింగ్ సిబ్బంది ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ సెంటర్లోకి సెల్‌ఫోన్లు అనుమతించేది లేదన్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేసి వాటిలో కంప్యూటర్, ఇంటర్నెట్, టెలిఫోన్ తదితర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు వివరించేందుకు మీడియా సెంటరును ఏర్పాటు చేసి, అక్కడ ఓ ఉద్యోగిని నియమించాలని సూచించారు. కౌంటింగ్ సరళిని వీడియో తీయించాలని, సంబంధిత సీడీలు, డీవీడీలను భద్రపరచాలన్నారు. ఆరోజు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఈపీడీసీఎల్ ఎస్‌ఈని కలెక్టర్ ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు స్థానిక ఎన్నికల పరిశీలకులు కె.ప్రవీణ్‌కుమార్, విజయమోహన్ వస్తారని తెలిపారు.
కౌంటింగ్ సెంటర్లు ఇవి..
ఏలూరు- సీఆర్‌ఆర్ పబ్లిక్ స్కూల్
కొవ్వూరు- బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల
తాడేపల్లిగూడెం- డీఆర్ గోయెంకా మహిళా డిగ్రీ కళాశాల
నిడదవోలు- ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల
భీమవరం- మునిసిపల్ కార్యాలయంలో పాత కౌన్సిల్ హాల్
తణుకు- ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల
నరసాపురం-పాలకొల్లు రోడ్డులోని స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాల
పాలకొల్లు- సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల
జంగారెడ్డిగూడెం- ఏఎంసీ కార్యాలయం గోడౌన్
అదనపు పరిశీలకులుగా 9 మంది నియామకం
కౌంటింగ్ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు 9 మంది అధికారులను అదనపు పరిశీలకులుగా కలెక్టర్ నియమించారు. ఏలూరుకు జెడ్పీ సీఈవో వెంకటరెడ్డి, కొవ్వూరుకు ఆర్డీవో గోవిందరావు, తాడేపల్లిగూడెంకు కేఆర్‌సీ ఎస్డీసీ కోగంటి ఉమారాణి, నిడదవోలుకు టీఎల్‌ఐఎస్ ఎస్డీసీ ఎం.సమజ, భీమవరానికి డ్వామా అదనపు పీడీ టి.సవరమ్మ, తణకుకు డీపీవో నాగరాజువర్మ, నరసాపురానికి ఆర్డీవో జె.ఉదయభాస్కర్, పాలకొల్లుకు మైక్రోఇరిగే షన్ పీడీ ఆర్‌వీ సూర్యనారాయణను నియమించారు.
మునిసిపల్ ఓట్ల లెక్కింపునకు భద్రతా ఏర్పాట్లు
Published Fri, May 9 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM
Advertisement
Advertisement