సాక్షి, రాజమహేంద్రవరం: అమరావతి నుంచి గురువారం పోలవరం పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులు అనంతరం విశాఖలో జరుగుతున్న అగ్రిథాన్ సదస్సుకు వెళ్లారు. జిల్లా సరిహద్దైన కాతేరు గామన్ బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై ప్రొటోకాల్ ప్రకారం అర్బన్ జిల్లాలోని వివిధ విభాగాల పోలీసులు కాన్వాయ్‌లతో సాయంత్రం నుంచి వేచి చూస్తున్నారు. ఎస్బీ డీఎస్పీ రామకృష్ణ, ట్రాఫిక్ డీఎస్పీ రమణకుమార్, మరో ఇద్దరు డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్సైలు, 30 మంది కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో ఉన్నారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో గతంలో ఎస్పీ హరికృష్ణ కారు డ్రైవర్‌గా పనిచేసి ప్రస్తుతం వీఐపీ డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణను ట్రాఫిక్ సీఐ బాజీలాల్ పిలిచారు.
ఆ సమయంలో కారు పక్కనే ఉన్న సత్యనారాయణ సీఐ పిలుపు విని ‘ఏం.. సార్’ అని గట్టిగా అన్నారు. పలుమార్లు పిలిచి.. అప్పటికే ఆవేశంతో ఉన్న సీఐ బాజీలాల్ ‘‘ఏం గట్టిగా మాట్లాడుతున్నావ్. ఎవరి మీద అరుస్తున్నాం. ఇన్‌స్పెక్టర్ మీదే అరుస్తావా? ఆఫ్‌ట్రాల్ కానిస్టేబుల్ గాడివి’’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ఆ సమయంలో వీఐపీ డ్యూటీలో ఎలా ఉండాలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామకృష్ణ ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణకు వివరిస్తున్నారు. ‘నేను ఏమీ అనలేదు సార్.. ఆయనకు వినపడలేదేమో ‘ఏం సార్’ అని అన్నాను అని పేర్కొంటుండగా ‘ఏం రా.. గట్టిగా మాట్లాడుతున్నావ్.. మాటాకు మాట ఎదురు చెబుతున్నావ్’’ అంటూ సీఐ బాజీలాల్ కానిస్టేబుల్ సత్యనారాయణపై పిడిగుద్దులు కురిపించారు.
కేకలు, అరుపులతో ఆ ప్రాంతం కొద్దిసేపు మార్మోగింది. అనంతరం అక్కడ ఉన్న కానిస్టేబుళ్లు అందరూ సీఐ బాజీలాల్‌పై ఎదురుతిరిగారు. వారికి సర్దిచెప్పడానికి డీఎస్పీలకు తలప్రాణం తోకకు వచ్చింది. ఒక వైపు అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వస్తుండగా ఈ ఘటన జరగడంతో ఉన్నతాధికారుల్లో ఆందోళనమొదలైంది. వీఐపీలు వచ్చే అరగంట ముందు ఈ వివాదం జరగడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ వ్యవహారం ఎస్పీ రాజకుమారి దృష్టికి వెళ్లగా కానిస్టేబుల్, సీఐ ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు పోలీసుల వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ‘సాక్షి’ ఎస్పీ రాజకుమారి వివరణ కోసం ఫోన్ చేయగా సస్పెండ్ చేసినట్టు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment