డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఆటోడ్రైవర్
పోలీసులు వాహనాన్ని తరలిస్తుండగా అడ్డగింత
ఆటోడ్రైవర్ సమాచారంతో హుటాహుటిన వచ్చిన టీడీపీ నేతలు
మహిళా ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌పై దాడి
ఈ ఘటనను వీడియో తీస్తున్న యువకుడిని చితకబాదిన వైనం
సాక్షి, టాస్‌్కఫోర్స్: విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులపై టీడీపీ నేతలు దాడిచేశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని పెన్నా వారధి సమీపంలో జరిగింది. నార్త్ ట్రాఫిక్ ఎస్సై గీతా రమ్య.. హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణతో కలిసి ఆదివారం సాయంత్రం ఆమె రంగనాయకులపేట పెన్నా వారధికి సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. సంతపేట ప్రాంతానికి చెందిన మహేష్ ఫూటుగా మద్యం తాగి ఆ మార్గంలో ఆటో నడుపుతుండగా ఎస్సై అతనిని ఆపి పరీక్ష చేసి కేసు నమోదు చేశారు.
ఆటోను పోలీసుస్టేషన్‌కు తరలించేందుకు యత్నించగా డ్రైవర్ అడ్డుకున్నాడు. ఆటోను ఎలా తీసుకెళ్తారంటూ తన స్నేహితులకు ఫోన్‌చేశాడు. అయినా, ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్ తాడు సాయంతో ఆటోను తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా మహేష్ మళ్లీ అడ్డుకున్నాడు. ఇంతలో టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు, అతని సతీమణి కప్పిర రేవతి తమ అనుచరులతో అక్కడికొచ్చి పోలీసులపై దాడిచేసి గాయపరిచారు. అదే సమయంలో అక్కడున్న ప్రవీణ్ అనే వ్యక్తి దాడి ఘటనను వీడియో తీస్తుండగా అతన్ని కూడా టీడీపీ నేతలు మూకుమ్మడిగా చితకబాదారు.
ఇరువర్గాల మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. దీంతో కప్పిర దంపతులూ గాయపడ్డారు. ఇరువర్గాలు సంతపేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. చికిత్స నిమిత్తం ట్రాఫిక్ ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, ప్రవీణ్ జీజీహెచ్‌లో చేరారు. కప్పిర దంపతులు తొలుత జయభారత్ ఆస్పత్రి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం నారాయణ ఆస్పత్రిలో చేరారు. ఇరువర్గాల ఫిర్యాదులపై సంతపేట పోలీసులు విచారణ
జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment