ఉద్రిక్తతకు దారితీసిన దసరావేడుకలు | Tension leading up to the celebrations of Dussehra | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తతకు దారితీసిన దసరావేడుకలు

Published Sat, Oct 4 2014 11:57 PM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM

ఉద్రిక్తతకు దారితీసిన దసరావేడుకలు - Sakshi

ఉద్రిక్తతకు దారితీసిన దసరావేడుకలు

నాగ్‌సాన్‌పల్లిలో ఇరువర్గాల ఘర్షణ  
రాళ్లదాడిలో ఎస్‌ఐకి గాయాలు
వివరాలు సేకరించిన ఎస్పీ రాజకుమారి


బంట్వారం: దసరా వేడుకలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరువర్గాల దాడిలో ఓ ఎస్‌ఐకి గాయాలయ్యాయి. పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని నాగ్‌సాన్‌పల్లిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దసరా పండుగను శాంతియుతంగా జరుపుకొందామని ఎప్పటిమాదిరాగానే శుక్రవారం మధ్యాహ్నం సర్పంచ్ లక్ష్మి గ్రామస్తుల సమక్షంలో తీర్మానం చేశారు. సాయంత్రం 5 గంటలకు గ్రామస్తులు, సర్పంచ్ డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లి జమ్మి చెట్టుకు పూజలు చేసి తిరిగి వచ్చారు. కొద్దిసేపటికి వార్డు సభ్యుడు, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ గడ్డమీది వెంకటయ్య, ఆర్టీసీ కండక్టర్ బుచ్చ య్య పలువురిని వెంటబెట్టుకొని సర్పంచ్ ఇంటికి వెళ్లారు.

తమకు తెలియకుండానే జమ్మి చెట్టుకు పూజ లు ఎలా చేస్తావని ఆమెను దూషించారు. సర్పంచ్ వారికి నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది. అక్కడే ఉన్న సర్పంచ్ భర్త మల్లారె డ్డి జోక్యం చేసుకోగా ‘సర్పంచ్‌వి నువ్వు కాదని.. మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావ్’ అంటూ ఆయనను తిట్టారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఎస్సై రవీందర్ సిబ్బందితో నాగ్‌సాన్‌పల్లికి చేరుకున్నారు. ఇరువర్గాలకు నచ్చజెప్పే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

సర్పంచ్‌కు వంతపాడుతున్నావంటూ ఎస్‌ఐని గడ్డమీది వెంకటయ్య, బుచ్చయ్య తదితరులు దబాయించారు. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేశారు. దీంతో ఇరువర్గాలకు చెందిన కొందరు పోలీసుల పైకి రాళ్లు రువ్వడంతో ఎస్‌ఐ రవీందర్ ముక్కుకు తీవ్రగాయాలయ్యాయి.  ఘర్షణలో ఆరుగురికి గాయాలవగా వికారాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి 9 గంటలకు వికారాబాద్ డీఎస్పీ నర్సింలు గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు.
 
గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ
జిల్లా ఎస్పీ రాజకుమారి శనివారం నాగ్‌సాన్‌పల్లికి చేరుకొని ఇరవర్గాలతో మాట్లాడి వివరాలు సేకరిం చారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని, గొడవపడడం సరికాదని ఆమె సూచించారు. ఘటన పై దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. నిందితులపై రౌడీషీట్ తెరుస్తామని ఎస్పీ హెచ్చరించారు.
 
ఇరువర్గాలపై కేసులు నమోదు  
ఎస్‌ఐపై దాడి చేసిన గడ్డమీది వెంకటయ్య, బుచ్చ య్య, కావలి అంజయ్యలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ నర్సింలు విలేకరులకు తెలిపారు. ఇరువర్గాల దాడిలో గాయపడ్డ కిరణ్‌కుమార్, అడివయ్య, అనంతయ్య, సిద్దయ్య, ప్రవీణ్‌కుమార్, నరేందర్‌ల ఫిర్యాదు మేరకు సర్పంచ్ భర్త మల్లారెడి ్డతో పాటు అంజిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. శనివారం రాత్రి ముగ్గురు ఎస్‌ఐలు, 20 మంది పోలీసులు గ్రామంలో పికెట్ నిర్వహించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement