ఇంకా.. గెలుపు గుర్రాల వేటలోనే!
ఇంకా.. గెలుపు గుర్రాల వేటలోనే!
Published Tue, Mar 11 2014 2:02 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
విజయనగరం మున్సిపాలిటీ/బొబ్బిలి, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారు చేయడానికి రాజకీయ పార్టీల నేతలు తలలు పీక్కుంటున్నారు. సాధారణ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తొలుత రాజకీయ పార్టీలు భావించాయి. అయితే, ఎన్నికల కమిషన్ ఒక్కసారిగా ‘మున్సిపల్’ షెడ్యూల్ ప్రకటించడంతో కంగుతిన్నాయి. నామినేషన్ల ఘట్టం మొదలైనా.. నేటికీ చాలా చోట్ల అభ్యర్థులను ఖరారు చేసుకోలేని స్థితిలో ఉన్నాయి. జిల్లాలో విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సాధారణంగా నామినేషన్ ముందురోజే అన్ని రాజకీయ పార్టీలూ అభ్యర్థుల పేర్లు ప్రకటించాలి. కానీ ప్రధాన పార్టీలేవీ పూర్తిస్థాయి అభ్యర్థుల జాబితాను నేటికీ ఖరారు చేయలేకపోయాయి. విజయనగరం మున్సిపాలిటీలో విలీన పంచాయతీలను కలుపుకొని 40 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 21 వార్డులకు మాత్రమే కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ఎక్కువగా మాజీ కౌన్సిలర్లే ఉన్నారు. టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లు మంగళవారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్ వేయడానికి బుధ, గురువారాలు మంచిరోజులుగా భావిస్తున్నారు. దీంతో ఆయా రోజుల్లో నామినేషన్లు వేయడానికి రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బొబ్బిలిలో సర్వత్రా ఉత్కంఠ
నామినేషన్ ఘట్టం మొదలైనా అభ్యర్థుల ప్రకటనను ఏ రాజకీయ పార్టీలూ చేయకపోవడంతో బొబ్బిలిలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, టీడీపీలతోపాటు, బీజేపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, లోక్‌సత్తా వంటి పార్టీలు బరిలో దిగుతున్నాయి. గత పాలకవర్గంలో కౌన్సిలర్లుగా చేసిన వారిలో 90 శాతం మంది వరకూ తిరిగి పోటీ చేసే అవకాశం ఉంది. గత కౌన్సిలరు, లేకపోతే వాళ్ల ఇంట్లో ఎవరినో ఒకరిని బరిలో దించడానికి ఇప్పటికే సన్నాహాలు పూర్తయ్యాయి. అయితే అభ్యర్థులను మాత్రం ప్రకటించలేదు. ఏ రాజకీయ పార్టీ ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తే.. అందుకు దీటైన వారిని బరిలో దించాలనే యోచనలో ప్రత్యర్థులు ఉన్నారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు అభ్యర్థులే లేనట్లు తెలుస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని దించుతుందో చూసుకుని.. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక సీపీఎం, బీజేపీలు ప్రధాన పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నట్లు భోగట్టా. అందుకు ఆయా పార్టీలు పిలిస్తే వెళ్లి కొన్ని వార్డులను అడిగి తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఒక పార్టీ నుంచి పోటీ లేని అభ్యర్థులంతా మంగళవారం నామినేషన్లను దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. భారీ సంఖ్యలో జన సేకరణ చేపడుతున్నారు. మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి నామినేషను వేయాలని చూస్తున్నారు. నామినేషను దాఖలు చేసే సమయంలో మున్సిపాలిటీకి బకాయి లేదని చూపించే ధ్రువీకరణ పత్రాల కోసం సోమవారం అభ్యర్థులు పోటీలు పడ్డారు. అభ్యర్థులతో పాటు డమ్మీలుగా వేసే వారికి కూడా బకాయిలు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు. నామినేషన్లు మొదలైనా ఏ పార్టీ కూడా కచ్చితంగా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
తొలిరోజు ఐదే నామినేషన్లు
ఇక జిల్లాలోని నాలుగుమున్సిపాలిల్లో తొలిరోజు నామినేషన్లు వేసేవారే కనిపించలేదు. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయకపోవడం.. సెంటిమెంట్‌గా మంచిరోజు కోసం వేచి చూడడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సోమవారం సాలూరులో మాత్రమే ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి.
Advertisement