మున్సి‘పల్స్’పోలింగ్ నేడే | Munsi 'pulse' of polling today | Sakshi
Sakshi News home page

మున్సి‘పల్స్’పోలింగ్ నేడే

Published Sun, Mar 30 2014 1:20 AM | Last Updated on Wed, Oct 17 2018 4:53 PM

మున్సి‘పల్స్’పోలింగ్ నేడే - Sakshi

మున్సి‘పల్స్’పోలింగ్ నేడే

  •  ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు
  •  విజయవాడ కార్పొరేషన్, 8 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు
  •  945 పోలింగ్ కేంద్రాలు సిద్ధం
  •  ఈవీఎంలలోనే పోలింగ్
  •  పటిష్ట బందోబస్తు ఏర్పాటు
  •  మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, ఒక నగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఆదివారం జరగనుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేసి పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

    సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో సిబ్బందికి శనివారం ఈవీఎంలు తదితర సామగ్రిని అందజేశారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పరిశీలించిన అనంతరం శనివారం మధ్యాహ్నం నుంచి అధికారులు పోలింగ్‌స్టేషన్లకు తరలివెళ్లారు.

    పోలింగ్ సామగ్రి పంపిణీలో, సిబ్బంది నియామకంలో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తినా అధికారులు సకాలంలో స్పందించటంతో పరిస్థితి చక్కబడింది. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఎన్నికల సామగ్రిని, సిబ్బందిని నియమించే సమయంలో కొంత గందరగోళం నెలకొంది. దూరప్రాంతాల నుంచి వచ్చినవారిని ఎన్నికల విధుల్లో చేర్చుకునేందుకు అధికారులు జాప్యం చేస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు వాగ్వాదానికి  దిగారు.

    ఏజేసీ చెన్నకేశవరావు జోక్యం చేసుకోవటంతో వివాదం సద్దుమణిగింది. ఎన్నికల విధుల్లో 1088 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1088 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 3700 మంది సిబ్బందిని నియమించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు సిబ్బందిని నియమించిన అనంతరం మిగిలినవారిని రిజర్వులో ఉంచారు. ఏదైనా పోలింగ్ స్టేషన్‌లో ఈవీఎంలు పనిచేయకుంటే వెంటనే వాటిని మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
     
    10.21 లక్షల మంది ఓటర్లు...
     
    విజయవాడ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లో 10 లక్షల 21 వేల 914 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లో 218 వార్డుల్లో 859 మంది, విజయవాడ కార్పొరేషన్‌లోని 59 డివిజన్లలో 508 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్, మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నూజివీడు, తిరువూరు, ఉయ్యూరు, నందిగామ పురపాలక సంఘాల్లో కలిపి మొత్తం 277 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులను ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉంది. ఆయా మున్సిపాలిటీల్లోని మొత్తం 945 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది.
     
    ఓటుకు రూ.2,500...
     
    పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. పోలీసులు గస్తీ తిరుగుతున్నా వారి కళ్లుగప్పి అభ్యర్థుల అనుచరులు మద్యం పంపిణీలో తమ పంతం నెగ్గించుకున్నారు. శనివారం రాత్రి మద్యం పంపిణీ అన్ని ప్రాంతాల్లో జోరుగా సాగింది. గత రెండు, మూడు రోజులుగా ఓటర్లకు నగదు పంపిణీ కార్యక్రమం అభ్యర్థులు గుట్టుగా చేపట్టారు.

    ఉయ్యూరు పురపాలక సంఘంలోని ఓ వార్డులో టీడీపీ, ఇండిపెండెంట్ల అభ్యర్థుల మధ్య నగదు పంపిణీలో పోటీ నెలకొనడంతో ఒక్కొక్కరు ఓటరుకు రూ.2,500 చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. జగ్గయ్యపేట పురపాలక సంఘంలోనూ ఒకటి, రెండు వార్డుల్లో నగదు పంపిణీ చేశారు. తిరువూరు పురపాలక సంఘంలో ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున అభ్యర్థులు పంపిణీ చేసినట్లు తెలిసింది. మచిలీపట్నంలో ఓటుకు రూ.200 నుంచి రూ.500 వరకు పంపిణీ చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement