Mobile Team
-
పోలింగ్‌పై పోలీసుల నిఘా
సాక్షి, వేములవాడ: పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించి ప్రతీ ఓటరు తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, ప్రతీ గ్రామంలో ఓటర్లంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు అధికారుల సూచనల మేరకు వేములవాడ డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక బృందాలు గ్రామగ్రామాన కవాతులు నిర్వహిస్తూ పోలీసులు ప్రజల రక్షణ కోసం ఉన్నారన్న సంకేతాలు అందజేస్తున్నారు. ఎవరి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలీసులు ప్రజలకు రక్షణగా ఉంటారన్న భరోసాను ఇస్తున్నారు. ప్రత్యేక పోలీసుల బలగాలతో కవాతులు నిర్వహించి ప్రజలకు మరింత ధైర్యాన్ని ఇస్తున్నారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ప్రత్యేక బలగాల రాక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ ప్రాంతానికి ప్రత్యేక బలగాలు వచ్చేశాయి. వీరితో నిత్యం కూడళ్ల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోడ్ అమల్లో ఉండటంతో అందుకు అనుగుణంగా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లోనూ తనిఖీలు నిర్వహిస్తూ పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వాహనాల తనిఖీలు, బస్సులు తనిఖీలు, ముల్లెమూటల తనిఖీలు, నగదు తరలింపు అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల వేములవాడ శివారులో రూ.4 లక్షలు తరలిస్తున్న ఓ వ్యక్తిని సోదా చేసి పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు తరలించవద్దన్న ఎన్నికల సంఘం నిబంధనలను ఇక్కడి పోలీసులు పాటిస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు మరింత ముమ్మరం చేస్తున్నారు. మద్యం పట్టివేత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేరచరిత గల వ్యక్తులను పట్టుకుని తహసీల్దారు ముందు బైండోవర్ చేయడంతోపాటు ఎలాంటి చర్యలకు దిగినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన మ ద్యాన్ని పట్టుకుని సీజ్ చేస్తున్నారు. ఎన్నికల నియమావళికి లోబడి డబ్బుల తరలింపు అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న డబ్బులను సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేస్తున్నారు. 103 మందిని బైండోవర్ చేశారు. 58 లీటర్ల మద్యం పట్టుకున్నారు. 96 పోలింగ్ స్టేషన్లలో 70 నార్మల్ పోలింగ్ స్టేషన్లు, 26 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. 141 లొకేషన్లలో 255 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందుకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్, 1 స్టాటిస్టిక్స్ అసెస్మెంట్ టీం గస్తీ తిరుగుతున్నారు. -
ఇంటి వద్దకే నాణ్యత సేవలు
మొబైల్ టీమ్‌ను ప్రారంభించిన భారతి సిమెంట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ భారతి సిమెంట్ మొబైల్ సాంకేతిక సేవలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించింది. శిక్షణ పొందిన సివిల్ ఇంజనీర్లు ద్విచక్ర వాహనంపై స్వయంగా కస్టమర్ల ఇంటి వద్దకు వెళ్లి ఎటువంటి బిల్డింగ్ మెటీరియల్ ఎంపిక చేసుకోవాలి, నాణ్యమైన కాంక్రీట్‌ను ఏ విధంగా తయారు చేయాలి వంటి అంశాలను వివరిస్తారు. అలాగే నిర్మాణానికి వాడే నీరు, ఇసుక, కంకర నాణ్యతను ప్రత్యేక పరికరాల ద్వారా అక్కడికక్కడే పరీక్షిస్తారు. మొబైల్ సాంకేతిక సేవలను దక్షిణాదిన ఇతర రాష్ట్రాలకు త్వరలో పరిచయం చేస్తామని సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి తెలిపారు. సిమెంటు రంగంలో ఇటువంటి సేవలను దేశంలో తొలిసారిగా భారతి సిమెంట్ ప్రారంభించిందని గుర్తు చేశారు. కంపెనీ ఇప్పటికే ఈ సేవలను తమిళనాడులో అందిస్తోంది. -
మున్సి‘పల్స్’పోలింగ్ నేడే
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు విజయవాడ కార్పొరేషన్, 8 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు 945 పోలింగ్ కేంద్రాలు సిద్ధం ఈవీఎంలలోనే పోలింగ్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, ఒక నగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఆదివారం జరగనుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేసి పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో సిబ్బందికి శనివారం ఈవీఎంలు తదితర సామగ్రిని అందజేశారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పరిశీలించిన అనంతరం శనివారం మధ్యాహ్నం నుంచి అధికారులు పోలింగ్స్టేషన్లకు తరలివెళ్లారు. పోలింగ్ సామగ్రి పంపిణీలో, సిబ్బంది నియామకంలో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తినా అధికారులు సకాలంలో స్పందించటంతో పరిస్థితి చక్కబడింది. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఎన్నికల సామగ్రిని, సిబ్బందిని నియమించే సమయంలో కొంత గందరగోళం నెలకొంది. దూరప్రాంతాల నుంచి వచ్చినవారిని ఎన్నికల విధుల్లో చేర్చుకునేందుకు అధికారులు జాప్యం చేస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు వాగ్వాదానికి దిగారు. ఏజేసీ చెన్నకేశవరావు జోక్యం చేసుకోవటంతో వివాదం సద్దుమణిగింది. ఎన్నికల విధుల్లో 1088 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1088 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 3700 మంది సిబ్బందిని నియమించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు సిబ్బందిని నియమించిన అనంతరం మిగిలినవారిని రిజర్వులో ఉంచారు. ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు పనిచేయకుంటే వెంటనే వాటిని మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 10.21 లక్షల మంది ఓటర్లు... విజయవాడ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లో 10 లక్షల 21 వేల 914 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లో 218 వార్డుల్లో 859 మంది, విజయవాడ కార్పొరేషన్‌లోని 59 డివిజన్లలో 508 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్, మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నూజివీడు, తిరువూరు, ఉయ్యూరు, నందిగామ పురపాలక సంఘాల్లో కలిపి మొత్తం 277 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులను ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉంది. ఆయా మున్సిపాలిటీల్లోని మొత్తం 945 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఓటుకు రూ.2,500... పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. పోలీసులు గస్తీ తిరుగుతున్నా వారి కళ్లుగప్పి అభ్యర్థుల అనుచరులు మద్యం పంపిణీలో తమ పంతం నెగ్గించుకున్నారు. శనివారం రాత్రి మద్యం పంపిణీ అన్ని ప్రాంతాల్లో జోరుగా సాగింది. గత రెండు, మూడు రోజులుగా ఓటర్లకు నగదు పంపిణీ కార్యక్రమం అభ్యర్థులు గుట్టుగా చేపట్టారు. ఉయ్యూరు పురపాలక సంఘంలోని ఓ వార్డులో టీడీపీ, ఇండిపెండెంట్ల అభ్యర్థుల మధ్య నగదు పంపిణీలో పోటీ నెలకొనడంతో ఒక్కొక్కరు ఓటరుకు రూ.2,500 చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. జగ్గయ్యపేట పురపాలక సంఘంలోనూ ఒకటి, రెండు వార్డుల్లో నగదు పంపిణీ చేశారు. తిరువూరు పురపాలక సంఘంలో ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున అభ్యర్థులు పంపిణీ చేసినట్లు తెలిసింది. మచిలీపట్నంలో ఓటుకు రూ.200 నుంచి రూ.500 వరకు పంపిణీ చేశారు.