ప్రచార‘వేడి’ | Campaign 'hot' | Sakshi
Sakshi News home page

ప్రచార‘వేడి’

Published Sun, Mar 23 2014 2:04 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

ప్రచార‘వేడి’ - Sakshi

ప్రచార‘వేడి’

  • మండే ఎండల్లోనూ ‘పుర’ ప్రచారం
  •   పల్లెల్లో పుంజుకుంటున్న వైనం
  •   ఈ నెల 28తో మున్సిపల్ ప్రచారం సమాప్తి
  •   సాక్షి, మచిలీపట్నం : ప్రచండ భానుడితో పోటీ పడుతూ మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచార వేడి పుంజుకుంది. మండుతున్న ఎండల్లోనూ చెమటలు కక్కుతూ వ్యయప్రయాసలకోర్చి అభ్యర్థులు ఓటర్లను కలుస్తున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో ప్రచారం ముమ్మరం కాగా, పల్లెల్లో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది.

    ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో వార్డుల్లో ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 28తో పట్టణాల్లో ప్రచార గడువు ముగియనుంది. పట్టణాల్లో ఎన్నికల ప్రచారానికి ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎండలను సైతం లెక్కచేయక జనాన్ని వెంటబెట్టుకుని ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.
     
    టీడీపీ ప్రలోభాల వల...

    జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ హవాను తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు అప్పుడే ఓటర్లకు ప్రలోభాల వల విసురుతున్నారు. వెంట తిరిగే వారికి మద్యం, బిర్యానీ ప్యాకెట్లు అందిస్తున్నారు. వైద్య శిబిరాలు పెట్టి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేయడంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి.
     
    పత్తా లేని కాంగ్రెస్...
     
    మున్సిపల్, స్థానిక ఎన్నికల సమరంలో కాంగ్రెస్ అభ్యర్థుల హడావుడి కనిపించడం లేదు. జిల్లాలోని పెడన, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, ఉయ్యూరు మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రచారంలో ముందున్నారు. పలు పట్టణాల్లో గెలుపు కోసం టీడీపీ ప్రలోభాల వల విసిరేందుకు సిద్ధమవుతోంది.
     
    పార్టీలకు తప్పని రెబెల్స్ బెడద
     
    ప్రధాన రాజకీయ పార్టీల్లో సైతం టిక్కెట్‌పై ఆశలు పెరగడంతో స్థానిక ఎన్నికలో బరిలో ఉన్న అభ్యర్థులకు రెబెల్స్ బెడద తప్పలేదు. ఇటువంటి పరిస్థితిలో పదవి దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నెల 24న జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్‌ల ఉప సంహరణకు గడువు విధించడంతో రాజకీయ పార్టీల నేతలు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. పార్టీలోని రెబెల్స్‌ను బుజ్జగించడం, ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

    ఈ నెల 21న జరిగిన నామినేషన్ల పరిశీలనలో జిల్లాలోని 52 జెడ్పీటీసీ, 204 ఎంపీటీసీ నామినేషన్‌లను ఎన్నికల అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో 49 మండలాలకు 370 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 836 ఎంపీటీసీ స్థానాలకు 4616 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వైఎస్సార్‌సీపీ తరఫున 161 జెడ్పీటీసీ అభ్యర్థులు, 1822 మంది ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీడీపీ తరఫున 146 జెడ్పీటీసీ అభ్యర్థులు, 2007 మంది ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌కు అభ్యర్థులే దొరకని దుస్థితిలో ఉండటంతో నామినేషన్లు తక్కువగానే వేశారు.

    49 జెడ్పీటీసీ స్థానాలకు 41 మంది, 836 ఎంపీటీసీ స్థానాలకు గాను 283 మంది మాత్రమే నామినేషన్‌లు దాఖలు చేశారు. ఇక స్వతంత్రులు జెడ్పీటీసీ స్థానాలకు 36 మంది, ఎంపీటీసీ స్థానాలకు 513 మంది నామినేషన్‌లు వేశారు. దీంతో నామినేషన్‌ల ఉపసంహరణకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
     
    తిరువూరులో అత్యధికం..
     
    జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 17 నుంచి 20 వరకు వేసిన నామినేషన్లను పరిశీలిస్తే తిరువూరు జెడ్పీటీసీ స్థానానికి అత్యధిక అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తిరువూరు జెడ్పీటీసీ పదవికి 19 నామినేషన్లు దాఖలయ్యాయి. మొవ్వ, పామర్రు, వీరులపాడు మండలాల్లో నాలుగు నామినేషన్లు చొప్పున దాఖలయ్యాయి. నామినేషన్‌ల ఉపసంహరణతో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement