సాక్షి, అమరావతి: భూ యాజమాన్య హక్కుల చట్టం అమలుకు మరింత సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ప్రస్తుతం భూముల రీ సర్వే కార్యక్రమం జరుగుతోందని, సర్వే ప్రక్రియ పూర్తి చేసిన తరువాతే చట్టం అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి హైకోర్టుకు నివేదించారు. చట్టం ఇప్పటికిప్పుడు అమలయ్యే పరిస్థితి లేదని, కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని అభ్యర్థించారు.
మహేశ్వరరెడ్డి వాదనతో సంతృప్తి చెందిన హైకోర్టు.. ఒకవేళ ఈలోగా ప్రభుత్వం చట్టాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటే, పిటిషనర్లు ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావొచ్చని వెసులుబాటు కల్పించింది. అయితే ప్రభుత్వం చెప్పిన వివరాలను రికార్డ్ చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పట్టుబట్టగా.. హైకోర్టు అందుకు నిరాకరించింది.
కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి మరింత సమయం మంజూరు చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
స్పష్టమైన ఆదేశాలి చ్చి నా.. ఎందుకీ ఆందోళన!
భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం వాదనలు వినిపిస్తూ.. భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని ఇప్పటికిప్పుడు అమలు చేయబోమని గత విచారణ సమయంలో అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హామీ ఇచ్చారని, అప్పుడు ఆ హామీని రికార్డ్ చేయలేదని అన్నారు.
ఏజీ హామీని రికార్డ్ చేయాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. ఆస్తి వివాదాలకు సంబంధించిన దావాలను విచారణ నిమిత్తం తీసుకోవాలని కింది కోర్టులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, అయినా ఆందోళన ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. చట్టాన్ని అమలు చేసే విషయంలో ప్రభుత్వం ముందుకెళుతోందని, అందువల్ల సంబంధిత జీవోలపై స్టే విధించాలని కోరారు.
అసలు చట్టం అమలు ప్రస్తుతం ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్టం అమలుకు నిబంధనలు అవసరమని, ఇప్పటివరకు నిబంధనల రూపకల్పనే జరగలేదని తెలిపారు. కౌంటర్ దాఖలుకు మరింత సమయం ఇవ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment