కాంగ్రెస్ నేతల మధ్య కుదరని ‘ఐ’క్యత
నిర్మల్ సభ ఏర్పాట్లకు ప్రతిబంధకాలు
అదేరోజు ఢిల్లీకి వెళ్లనున్న టీ-మంత్రులు
డీసీసీ సదస్సుకు దూరంగా ప్రేమ్‌సాగర్ వర్గం
ఎమ్మెల్యేలు మహేశ్వర్, సక్కు హాజరు
రచ్చబండ వాయిదా వేస్తేనే సభకు మంచిది
ఇద్దరు ఎమ్మెల్యేలకు సీఆర్ఆర్ సూచన
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జైత్రయాత్ర సభ నిర్వహణ ఏర్పాట్లు బాలారిష్టాలు దాటడం లేదు. నిర్మల్‌లో 13న నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు గడువు సరిగ్గా ఆరు రోజులే ఉంది. ఓ వైపు ఆ పా ర్టీలో కొలిక్కిరాని గ్రూపు తగాదాలు.. మరోవైపు రెండు రోజుల ముందు మొదల య్యే రచ్చబండ మూడో విడత.. 12, 13 తేదీల్లో ఢిల్లీకి టీ-మంత్రుల పయనం.. ఇవన్నీ జైత్రయాత్రకు ప్రతిబంధకాలుగా కనిపిస్తున్నాయి. నిర్మల్ కేంద్రంగా నిర్వహించే సభకు సక్సెస్ చేయడం కోసం బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డితో విభేదాలున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు దూరంగా ఉన్నారు. ఆయనతోపాటు ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ తదితరులు హాజరుకాలేదు. ఓ వైపు అధికార కార్యక్రమాలు, మరోవైపు టీ-మంత్రుల పర్యటనల నేపథ్యంలో సభను 13న నిర్వహిస్తారా? లేక మరో రోజుకు వాయిదా వేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
డీసీసీ సభకు ప్రేమ్‌సాగర్ దూరం
నిర్మల్‌లో 13న నిర్వహించే బహిరంగ సభ సక్సెస్ కోసం ఆదిలాబాద్ డీసీసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు రాలేదు. అదేవిధంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ సుల్తాన్ అహ్మద్, మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ సమావేశానికి హాజరు కాలేదు. అయితే డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి వర్గంగా ఉన్న నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నడిపెల్లి దివాకర్‌రావు కార్యకర్తలతో హాజరయ్యారు. ప్రేమ్‌సాగర్‌రావు గ్రూపునకు చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, జాదవ్ అనిల్‌కుమార్‌లతోపాటు పలువురు మార్కెట్ కమిటీ చైర్మన్లు, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు సమావేశంలో పాల్గొన్నారు. రెండు వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరైనా, ఆశించిన స్థాయిలో కార్యకర్తలు హాజరయ్యేలా నాయకత్వం తీసుకున్న చర్యలు కనిపించలేదు. జైత్రయాత్ర సభ సక్సెస్‌కు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని భావించి ఏర్పాటు చేసిన సమావేశానికి కేడర్ అంతంత మాత్రంగానే హాజరుకావడం, రెండు గ్రూపులకు చెందిన కొందరు నేతలు హాజరైనా ముఖ్య నేతల గైర్హాజరు కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది.
జైత్రయాత్రపై రచ్చబండ ప్రభావం
నిర్మల్‌లో 13న జైత్రయాత్ర సదస్సుకు కాంగ్రెస్ పార్టీ భారీ సన్నాహాలు చేస్తుండగా అంతకు రెండు రోజుల ముందే రచ్చబండ మూడో విడతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇటు జైత్రయాత్ర సభ, అటు మూడో విడత రచ్చబండ రెండు కూడా పార్టీకి ప్రతిష్టాత్మకమే. ఈ నేపథ్యంలో జైత్రయాత్ర సభ నిర్వహిస్తే రచ్చబండ ప్రభావం పడే అవకాశం ఉంది. సమైక్యాంధ్ర, తెలంగాణకు చెందిన మంత్రులు ఈనెల 12,13 తేదీల్లో వేర్వేరుగా కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)ను కలిసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రుల బృందం వేర్వేరుగా తెలంగాణ విభజనకు సంబంధించిన 11 విధివిధానాలను సూచించిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లడం టీ-మంత్రులకు అనివార్యం. ఈ నేపథ్యంలో జైత్రయాత్ర సభకు టీ-మంత్రులు హాజరయ్యే అవకాశం లేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేస్తేనే జైత్రయాత్ర సభను సక్సెస్ చేసుకోవచ్చని.. దీనికి నిర్మల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, ఆత్రం సక్కు చొరవ చూపి ప్రభుత్వం ప్రకటన చేయించాలని సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి సూచించడం గమనార్హం. ఈ క్రమంలో నిర్మల్‌లో సభపై స్పష్టత రావాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.