యూపీ మదర్సా చట్టం రద్దు కేసులో.. సుప్రీంకోర్టు స్టే | Supreme Court Stays Order On UP Madrassas Impacting Lakhs | Sakshi
Sakshi News home page

యూపీ మదర్సా చట్టం రద్దు.. అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే

Published Fri, Apr 5 2024 3:47 PM | Last Updated on Fri, Apr 5 2024 5:41 PM

 Supreme Court Stays Order On UP Madrassas Impacting Lakhs - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సుమారు 17 లక్షల మంది మదర్సా విద్యార్థులకు సుప్రీంకోర్టు ఉపశమనం కల్పించింది. యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్- 2004ను రద్దు చేస్తూ గత నెలలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీంతో రాష్ట్రంలోని 16,000 మదర్సాలు యథావిధిగా కొనసాగనున్నాయి.

హైకోర్టు నిర్ణయం ప్రాథమికంగా సరికాదని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మదర్సా చట్టం-2004 సెక్యులరిజం సూత్రాలను ఉల్లంఘిస్తోందని, ఇది రాజ్యంగ విరుద్దమంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని తెలిపింది. ఈ తీర్పు 10 వేల మదర్సా టీచర్లు, 17 లక్షల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందని పేర్కొంది.

మదర్సాలో మ్యాథ్స్‌, సోషల్‌ స్టడీస్‌, సైన్స్‌ సబ్జెక్టులను కూడా మదర్సాల్లో బోధిస్తున్నారని, అక్కడి విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించే అవసరం లేదని తాము భావిస్తున్నట్లు సీజేఐ పేర్కొన్నారు.  అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థించాయి.  అనుమానిత మతం, ఇతర సంబంధిత అంశాలపై చర్చ జరగాలని కోరాయి.

దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. మదర్సా బోర్డ్‌ లక్ష్యం, ఉద్దేశం నియంత్రణ స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, సెక్యులరిజాన్ని ప్రభావితం చేయదంటూ  తెలిపింది.  ఈ అంశంపై లేవనెత్తిన సమస్యలను మరింత నిశితంగా పరిశీలించాల్సి వుందని సీజేఐ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్‌ , కేంద్ర ప్రభుత్వాలకు  నోటీసులు జారీ చేశారు.తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

కాగా ఉత్తరప్రదేశ్‌ మదర్సా చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని మార్చి 21న అలహాబాద్‌ హైకోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది లౌకికవాద భావనకు విరుద్ధమైనదని తెలిపింది. యూపీ మదర్సా చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ.. ప్ర‌స్తుతం మ‌ద‌ర్సాల్లో చ‌దువుతున్న విద్యార్ధుల‌ను సాధార‌ణ విద్యా విధానంలోకి మ‌ళ్లించే ప‌థకాన్ని రూపొందించాల‌ని ప్రభుత్వాన్ని పేర్కొంది.   మదర్సా ఎడ్యుకేషన్‌ బోర్డు ఏర్పాటును సవాలు చేస్తూ అన్షుమన్‌ సింగ్‌ రాథోడ్‌ ఈ పిటిషన్‌ వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement