Madrassa
-
యూపీ మదర్సా చట్టం రద్దు కేసులో.. సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సుమారు 17 లక్షల మంది మదర్సా విద్యార్థులకు సుప్రీంకోర్టు ఉపశమనం కల్పించింది. యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్- 2004ను రద్దు చేస్తూ గత నెలలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీంతో రాష్ట్రంలోని 16,000 మదర్సాలు యథావిధిగా కొనసాగనున్నాయి. హైకోర్టు నిర్ణయం ప్రాథమికంగా సరికాదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మదర్సా చట్టం-2004 సెక్యులరిజం సూత్రాలను ఉల్లంఘిస్తోందని, ఇది రాజ్యంగ విరుద్దమంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని తెలిపింది. ఈ తీర్పు 10 వేల మదర్సా టీచర్లు, 17 లక్షల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. మదర్సాలో మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్ సబ్జెక్టులను కూడా మదర్సాల్లో బోధిస్తున్నారని, అక్కడి విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించే అవసరం లేదని తాము భావిస్తున్నట్లు సీజేఐ పేర్కొన్నారు. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థించాయి. అనుమానిత మతం, ఇతర సంబంధిత అంశాలపై చర్చ జరగాలని కోరాయి. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. మదర్సా బోర్డ్ లక్ష్యం, ఉద్దేశం నియంత్రణ స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, సెక్యులరిజాన్ని ప్రభావితం చేయదంటూ తెలిపింది. ఈ అంశంపై లేవనెత్తిన సమస్యలను మరింత నిశితంగా పరిశీలించాల్సి వుందని సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ , కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు.తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని మార్చి 21న అలహాబాద్ హైకోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది లౌకికవాద భావనకు విరుద్ధమైనదని తెలిపింది. యూపీ మదర్సా చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ.. ప్రస్తుతం మదర్సాల్లో చదువుతున్న విద్యార్ధులను సాధారణ విద్యా విధానంలోకి మళ్లించే పథకాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని పేర్కొంది. మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు ఏర్పాటును సవాలు చేస్తూ అన్షుమన్ సింగ్ రాథోడ్ ఈ పిటిషన్ వేశారు. -
అఫ్గాన్ మదరసాలో పేలుళ్లు... 16 మంది దుర్మరణం
కాబుల్: అఫ్గానిస్తాన్‌లోని ఐబక్ నగరంలోని ఒక మదరసాలో బుధవారం సంభవించిన పేలుళ్లలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయాల పాలయ్యారు. ఈ విషయాన్ని స్థానికంగా వైద్యుడు ఒకరు మీడియాకి వెల్లడించారు. తమ ఆస్పత్రికి చికిత్సకి వచ్చిన వారిలో యువతే అత్యధికంగా ఉన్నారని చెప్పారు. అల్ జిహాద్ మదరసాలో పేలుళ్లు జరిగినట్టుగా ప్రావిన్షియల్ అధికారి కూడా ధ్రువీకరించారు. గత ఏడాది ఆగస్టులో తాలిబన్లు అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాక యువతీ యువకుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఎక్కువ దాడులకు ఇస్లామిక్ స్టేట్ తనదే బాధ్యతని ప్రకటించుకుంది. ఈ సారి దాడుల పని ఎవరిదో ఇంకా తెలియలేదు. -
పాఠశాలలో భారీ పేలుడు.. 16 మంది మృతి
కాబుల్: తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అఫ్గానిస్థాన్‌లో సామాన్య ప్రజలే లక్ష్యంగా దాడులు పెరిగిపోయాయి. తాజాగా అయ్బక్ నగరంలోని ఓ మదర్సాలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మంది చిన్నారులు సహా మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. దేశ రాజధాని కాబుల్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని అయ్బక్ నగరంలో పేలుడు జరిగినట్లు తెలిపారు డాక్టర్. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులేనని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మృతుల్లో మొత్తం చిన్నారులు, సామాన్య ప్రజలే.’ అని ఏఎఫ్‌పీ న్యూస్‌తో వెల్లడించారు. మరోవైపు.. పేలుడు జరిగినట్లు అధికారులు ధ్రువీకరించినప్పటికీ మృతుల సంఖ్యపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్! -
మదర్సాలో 12 ఏళ్ల విద్యార్థినిపై టీచర్ వేధింపులు
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మదర్సాలో 12 ఏళ్ల విద్యార్థినిపై 52 ఏళ్ల ఉపాధ్యాయుడు వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చందన్నగర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అభయ్ తెలిపారు. బాధితురాలి తండ్రి, చిన్నాన్నను కొట్టినందుకు ఉపాధ్యాయుడి ఇద్దరు కుమారులపై కేసు పెట్టినట్లు చెప్పారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు ప్రకారం.. బాలిక గత నెలలో మదర్సాలో చేరింది. పాఠాలు చెప్పే నెపంతో ఉపాధ్యాయుడు ఆమెను అసభ్యంగా తాకేవాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. నిలదీసేందుకు వెళ్లిన బాలిక తండ్రి, చిన్నాన్నను నిందితుడి కుమారులు కొట్టారు. -
మదర్సా ప్రాంగణంలో మూక దుశ్చర్య
బీదర్(కర్ణాటక): బీదర్‌లో 1472లో నిర్మించిన మదర్సా, మసీదు ఉన్న ప్రాంగణంలో అన్యమత ప్రార్థనలకు ఒక గుంపు తెగించింది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆ ప్రాంగణంలో పూజలు చేసింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున దుర్గామాత విగ్రహం నిమజ్జనం కోసం గుంపుగా వెళ్తున్న జనంలోని దాదాపు 60 మంది హఠాత్తుగా మదర్సా, మసీదు ఉన్న ప్రాంగణంలోకి చొరబడి అక్కడి శమీ చెట్టు ఉండే చోట పూజలుచేశారు. ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందించారు. ‘ ఆ ప్రాంతంలో చాలా ఏళ్లుగా శమీ చెట్టు ఉండేది. ప్రతి ఏటా నలుగురైదుగురు వచ్చి దర్శించుకుని వెళ్లేవారు. ఇప్పుడా చెట్టు లేదు. అయినాసరే ఈ ఏడాదీ వచ్చారు. వీడియోలు తీసి వైరల్ చేయడంతో వివాదమైంది’ అని మంత్రి అన్నారు. దీంతో పట్టణంలో ముస్లింలు ఆందోళనకు దిగారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నలుగురిని అరెస్ట్‌చేశారు. -
మసీదు, మదర్సాను సందర్శించిన మోహన్ భగవత్
న్యూఢిల్లీ: దేశంలో మత సహనాన్ని పెంపొందించడానికి గత కొన్ని వారాలుగా ముస్లిం మేధావులతో మంతనాలు జరుపుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ గురు వారం ఒక మసీదు, మదర్సాను సందర్శించారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాస్‌ను కలుసుకొని ఏకాంతంగా గంటకు పైగా చర్చలు జరిపారు. సెంట్రల్ ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్‌లో ఒక మసీదుని సందర్శించారు. తర్వాత ఉత్తర ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌లో మదర్సాకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. తమ ఆహ్వానం మేరకే భగవత్ మసీదు, మదర్సాకి వచ్చారని ఇలియాస్ వెల్లడించారు. -
అలాంటి మదర్సాలను కూల్చేయడం పక్కా: అస్సాం సీఎం వార్నింగ్
గౌహతి: అస్సాంలో మదరసాల కూల్చివేత వ్యవహారం ఇటు రాజకీయంగా, అటు మతపరంగా పెను దుమారం రేపుతోంది. అయినా సరే ‘తగ్గేదేలే’ అంటున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నెలవైన ఏ ఒక్క మదరసాను కూల్చేయకుండా వదిలే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారాయన. మదరసాలను కూల్చేయాలన్నది మా అభిమతం, ఉద్దేశం కాదు. జిహాదీ శక్తులు వాటిని ఉపయోగిస్తున్నాయా? లేదా? అని పరిశీలించడమే మా పని. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాటిని ఉపయోగిస్తున్నారని, సంబంధాలు ఉన్నాయని తేలితే చాలూ.. వాటిని కూల్చివేసి తీరతాం. ఈ విషయంలో బుల్డోజర్లు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు అని ఆయన గురువారం మరోసారి సీఎం హిమంత బిస్వా శర్మ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. అనుమానిత, ఉగ్రసంస్థలతో సంబంధాలున్న మదర్సాలపై అస్సాం సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రత్యేక డ్రైవ్‌లతో వాటిని కూల్చేస్తోంది. తాజాగా బొంగైగావ్ జిల్లా కబితరీ గ్రామంలోని మార్క్‌జుల్ మా-ఆరిఫ్ క్వారియానా మదర్సాను బుధవారం కూల్చివేసింది. అల్ ఖైదాతో సంబంధాలున్న కారణంగానే ఈ కూల్చివేత జరిగినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కట్టినందుకే కూల్చినట్లు.. ముందస్తు నోటీసుల తర్వాతే కూల్చివేసినట్లు ప్రకటించారు. 🚨 3rd Madrassa demolished by @himantabiswa govt in Assam for having alleged links with Al Qaeda Video courtesy - ANI pic.twitter.com/vt8x9se3sQ — Kreately.in (@KreatelyMedia) August 31, 2022 ఇక ఈ వారంలో ఇది రెండో మదర్సా కూల్చివేత. నెల వ్యవధిలో మూడో కూల్చివేత. అంతకు ముందు బార్పేటలో ఇద్దరు బంగ్లాదేశీ ఉగ్రవాదులకు నాలుగేళ్లుగా ఆశ్రయం ఇచ్చారని సోమవారం ఓ మదర్సాను కూల్చేశారు. ఢక్లియాపరా ప్రాంతంలోని ఉన్నషేఖుల్ హింద్ మహ్మదుల్ హసన్ జామియుల్ హుదా అనే మదర్సాను బుల్డోజర్తో నేలమట్టం చేశారు. అంతకు ముందు మదర్సాలో తనిఖీలు చేపట్టగా.. నిషేధిత రాడికల్ గ్రూపులకు సంబంధించిన పలు పత్రాలు, ప్రచార ప్రతులు దొరికాయి. ఈ నేపథ్యంలో కట్టడానికి అనుమతులు లేవంటూ కూల్చేశారు. అలాగే.. అల్ ఖైదాతో సంబంధం ఉన్న ఇమామ్‌లు. మదర్సా ఉపాధ్యాయులతో సహా 37 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మదర్సా కూల్చివేతకు ముందు.. అందులోని నుంచి విద్యార్థులను ఖాళీ చేయించి.. ఇతర విద్యాసంస్థలకు పంపించారు. అల్-ఖైదా, బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సరుల్ బంగ్లా టీమ్ (ABT) సభ్యులు మదర్సాలలో తలదాచుకుంటున్న ఘటనలు ఇప్పుడు పెరిగిపోతున్నాయ్. జిహాదీ కార్యకలాపాలకు అస్సాం హాట్‌బెడ్‌గా మారిందంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలే చేశారు సీఎం హిమంత బిస్వా శర్మ. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటిదాకా 40 మంది బంగ్లాదేశీ ఉగ్రవాదులను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ముస్లిం మతపెద్దలు, మదర్సాల నిర్వాహకులు సీఎం హిమంతను ‘బుల్డోజర్ రాజా’గా అభివర్ణిస్తూ.. చర్యలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: ఆరెస్సెస్‌కు సపోర్టుగా దీదీ కామెంట్లు