‘లవ్ జిహాద్’ కేసు ఎన్‌ఐఏకు..
న్యూఢిల్లీ: ఓ హిందూ యువతి ఇస్లాం మతాన్ని స్వీకరించి, ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న కేసును దర్యాప్తు చేయాలని జాతీయ దర్యాప్తు బృందాన్ని (ఎన్‌ఐఏ) సుప్రీంకోర్టు ఆదేశిం చింది. కేరళలో జరిగిన ఈ వివాహం యాదృ చ్ఛికంగా జరిగింది కాదని, క్రమక్రమంగా అక్కడ ఈ పద్ధతి రూపుదిద్దుకుంటోందని కోర్టుకు ఎన్‌ఐఏ వివరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌వీ రవీంద్రన్ నేతృత్వంలో కేసు దర్యాప్తు చేపట్టా లని ఆదేశిస్తూ న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
యువతను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న ‘బ్లూ వేల్’ గేమ్ తరహాలోనే.. ఎవరినైనా ఏదైనా పని చేయడానికి పురిగొల్పవచ్చని లవ్ జిహాద్‌ను ఉద్దేశిస్తూ ధర్మాసనం వ్యాఖ్యానిం చింది. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని, దర్యాప్తు తుది నివేదికను కోర్టు ముందుంచాలని ఎన్‌ఐఏకు స్పష్టం చేసింది. కేరళ పోలీసులు, స్థానిక మహిళల నుంచి ఎన్‌ఐఏ తీసుకున్న సమాచారంతో కూడిన నివేదికను పరిగణన లోకి తీసుకున్న తర్వాతే కేసుపై తాము ఓ అభిప్రాయానికి వస్తామంది. సంబంధిత యువతి భర్త, పిటిషనర్ షాఫిన్ జహాన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. సదరు యువతిని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టాలని, ఆమెతో మాట్లాడాలని కోర్టును కోరారు.
ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్‌ఐఏ నివేదిక అందిన తర్వాతనే ఆమెతో మాట్లాడతామని చెప్పింది. కేరళకు చెందిన ఓ హిందూ యువతి ముస్లిం వ్యక్తిని ప్రేమించి ఇస్లాం మతం స్వీకరించిన తర్వాత అతడిని 2016లో పెళ్లాడింది. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో దీనిపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు.. వారిద్దరి పెళ్లి ‘లవ్ జిహాద్’కు ఉదాహరణ వంటిదని పేర్కొంటూ వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.