లక్నో: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచి లక్నోలోని ఒక మసీదులో హోమం చేస్తామని శుక్రవారం నాడు సంచలన వాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ మధురాలోని ఒక ఆలయంలో నమాజ్ సమర్పించినందుకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన కొన్ని రోజుల తరువాత ఆమె ఇలా బహిరంగంగా ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. అయితే వెంటనే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అక్టోబర్ 29 న మధురలోని నందగావ్‌లో ఉన్న నంద్ బాబా మందిర్ వద్ద ఇద్దరు వ్యక్తులు నమాజ్ చేశారనే ఆరోపణలతో పోలీసులు నలుగురు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఫైజల్ ఖాన్, చంద్ మొహమ్మద్ అనే వ్యక్తులు నమాజ్ చేయగా వారితో పాటు వచ్చిన అలోక్ రతన్, నీలేష్ గుప్తా వారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ప్రసారం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తరువాత, మసీదులలో 'హనుమాన్ చలీసా' చదివిన కేసులు వెలువడ్డాయి.
తారోలి గ్రామంలోని ఒక మసీదులోకి ప్రవేశించి హనుమాన్ చలీసాను పఠించినట్లు ఆరోపణలు రావడంతో మధుర పోలీసులు గురువారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిపై సీఆర్‌పీసీ 151 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రాచి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక ప్రాచి ఈ విషయాల పై స్పందిస్తూ సామాజిక సామరస్యం పేరిట ఒక ముఠా దేవాలయాలకు వెళ్లి నమాజ్ చేస్తోందని, సాంఘిక సామరస్యాన్ని కాపాడుకునేలా హిందువులు కూడా మసీదుల వద్దకు వెళ్లి హోమం చేయాలని తాము అభిప్రాయపడుతున్నామని ఆమె పేర్కొన్నారు. దేవాలయాలను నాశనం చేసి నిర్మించిన మసీదులను కూల్చివేసి అక్కడ పూజలు నిర్వహించాలన్నారు. హోమం చేయడం ద్వారా వాయు కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు. లక్నోలో ఉన్న పురాతన మసీదలో హోమం చేస్తామని ఆమె ప్రకటించారు. అయితే తరువాత ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. దీంతో పాటు ఆమె ‘లవ్ జిహాద్’ పై కూడా స్పందించారు. ఇది ఎంతోకాలంగా చేస్తోన్న కుట్ర అని ఇది నెమ్మదిగా భారతదేశమంతా విస్తరిస్తుందన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులను బహిరంగా ఉరితీయాలన్నారు. ఈ విషయానికి సంబంధించి కఠినమైన చట్టాన్ని తీసుకురావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment