తీవ్ర చర్చగా మారిన అసోం ట్రిపుల్ మర్డర్ కేసులో బాధిత కుటుంబాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పరామర్శించారు. ఈ క్రమంలో లవ్ జిహాదీ అంశం ప్రస్తావించిన ఆయన.. నిందితుడు నజిబుర్ పైనా సంచలన ఆరోపణలు చేశారు.
ఇది మొత్తంగా లవ్ జిహాద్ పరిణామమే. బాధిత కుటుంబం హిందూ.. అలాగే నిందితుడు ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడు. ఫేస్‌బుక్‌లో హిందూ పేరుతో పరిచయం పెంచుకుని.. ఆమెను ట్రాప్ చేశాడు. కోల్‌కతాలో ఆ ఇద్దరూ ఉన్నప్పుడు ఆమెపై డ్రగ్స్ ప్రయోగించినట్లూ తేలింది అని తెలిపారాయన.
నిందితుడు నజిబుర్ రెహమాన్ బోరా తన మతం మార్చేసి.. ఆమెను మోసం చేశాడు. అతను డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తి. ఆమెకూ డ్రగ్స్ ఇచ్చి లోబర్చుకున్నాడు. ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చింది. ఆపై ఆమెను హింసించడంతో.. భరించలేకే పుట్టింటికి వచ్చేసింది అని సీఎం హిమంత వెల్లడించారు. కరోనా సమయంలో బాధితురాలి సోదరి అంకిత ఈ లవ్ జిహాదీ అంశంపై తనకు లేఖ రాసిందని.. కానీ, ఆ టైంలో ఆ లేఖ తన దాకా రాకపోవడం వల్ల ఇవాళ ఇంత ఘోరం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహిళ గతంలో తన భర్తను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు చేసింది.
కరోనా ఫస్ట్ వేవ్ లాక్‌డౌన్ టైంలో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన సంఘమిత్ర, నజిబూర్‌లు.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి పారిపోయారు. ఆపై ఆమెపై దొంగతనం కేసు పెట్టించి నెలపాటు జైలు పాలు చేసింది ఆమె కుటుంబం. తిరిగి మళ్లీ పారిపోయిన జంట.. ఈసారి వివాహం చేసుకుని కాపురం పెట్టింది. ఓ బాబు కూడా పుట్టాడు. అయితే మనస్పర్థలతో ఆమె తిరిగి పుట్టింటికి చేరుకుని నజిబూర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జైలుపాలైన నజిబూర్.. కోపంతో రగిలిపోయి సోమవారం ఆమె ఇంటికి వెళ్లాడు. భార్య సంఘమిత్రను, ఆమె తల్లిదండ్రులు సంజీవ్ ఘోష్, జునూ ఘోష్‌లను పదునైన ఆయుధంతో హతమార్చాడు నిందితుడు నజిబూర్ రెహమాన్ బోరా(25). ఆపై తొమ్మిది నెలల బిడ్డను చంకనెక్కించుకుని గోలాఘాట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఈ కేసులో నిందితులను ఎవరినీ ఉపేక్షించం. 15 రోజుల్లో ఛార్జిషీటు నమోదుచేసి నిందితుణ్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో నిలబెడతామని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. అసోం హోం మంత్రిత్వ శాఖను కూడా ఆయనే పర్యవేక్షిస్తుండడంతో.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ని నియమించి బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేకూరుస్తానని చెబుతున్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment