గువాహటి : అస్సోంలోని పాలిత బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిందు యువతులను మోసం చేసి వివాహం చేసుకుంటున్న ముస్లిం యువకులపై కఠిన చర్యలకు తీసుకోవాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హేమంత్ బిశ్వాశర్మ గురువారం గువాహటిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించారు. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా అస్సోం ప్రభుత్వం పోరాటాన్ని ప్రారంభించబోతుందని మంత్రి ప్రకటించారు. తమ బిడ్డలను మోసగాళ్ల వంచన నుంచి రక్షించేందుకే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. (లవ్ జిహాద్‌కు నిర్వచనం లేదు)
ఈ సందర్భంగా హేమంత్ బిశ్వా మట్లాడుతూ.. ‘సోషల్ మీడియా వాడకం విచ్చలవిడిగా పెరిగినే నేపథ్యంలో చాలామంది అమాయక బాలికలు మోసపోతున్నారు. హిందు అమ్మాయిలను వివాహం చేసుకోవాలనే దుర్భుద్దితో కొంతమంది ముస్లిం యువకులు కుట్రలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో హిందు వ్యక్తి మాదిరిగా ఫేక్ ఎకౌంట్ సృష్టించి దానికి ఓ దేవుడి ఫోటోను వాల్‌పేపర్‌గా పెడుతున్నారు. ఈ విధంగా హిందు వర్గానికి చెందిన యువతులను మోసం చేసి, ప్రేమ పేరుతో లోబర్చుకుంటున్నారు. అనంతరం పెద్దలకు ఇష్టం లేకున్నా దొంగచాటుగా వివాహం చేసుకుంటున్నారు. ఇలా ఎంతో మంది యువతులు వారి చేతిలో మోసపోతున్నారు.
మరోవైపు లవ్ జిహాద్ పేరుతో తమ బిడ్డలను మరో వర్గం వారు బలవంతంగా వివాహం చేసుకుంటున్నారు. అన్నెంపున్నెం ఎరుగని యువతుల్ని మభ్యపెట్టి బలవంతంగా మత మార్పిడి చేసి.. తమ మతంలోకి మార్చుకుంటున్నారు. దీనిని ఇక సహించేది లేదు. అలాంటి వారిపై అస్సోం ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటిస్తోంది. తమ బిడ్డలను మోసం చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాల్సింది. బలవంతపు వివాహాలను నివారించడానికి చర్యలకు ఉపక్రమిస్తున్నాం. అస్సామీ ఆడపడచుల రక్షణకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి మీడియా ముఖంగా వెల్లడించారు.
కాగా ఇటీవల కాలంలో మతమార్పిడి సంఘటలను తరచుగా వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే. తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నట్లు యువతులు చెబుతున్నా.. ఇది బలవంతపు వివాహమని తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేలుకున్న అస్సోం ప్రభుత్వం ఇకపై బలవంతపు వివాహాలను చోటుచేసుకోకుండా ఉండేందుకు తగిన చర్యలకు చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు, ముస్లిం వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. యువతీ యువకులు ఇష్టాలకు అనుగుణంగా చేసుకున్న వివాహాన్ని రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేస్తున్నారు. ఇది ముస్లిం సమాజంపై కక్షసాధించడంగా వారు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment